Tuesday, July 19, 2011

Vikram's 'Naanna' movie review


హృదయాన్ని హత్తుకునే 'నాన్న'!
ఒక దశకు చేరుకున్నాక, నటీనటులకు సంపాదన మీద కంటే కూడా కీర్తికాంక్షలపై ఆశ కలుగుతుంది. అందుకనే కెరీర్‌ ప్రారంభంలో కమర్షియల్‌ హిట్‌ కోసం పాకులాడిన వారు ఒక స్థాయికి వచ్చాక, వైవిధ్యమైన పాత్రలు చేసి పేరు సంపాదించుకోవాలని తహతహలాడుతుంటారు. పైగా స్టార్‌ హీరోలు రొటీన్‌ ఫార్ములా సినిమాలు చేసినా అభిమానులు, సాధారణ ప్రేక్షకులు హర్షించరు. ప్రస్తుతం కథానాయకుడు విక్రమ్‌ది అదే పరిస్థితి. అందుకనే హడావుడి పడకుండా ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. 'శివపుత్రుడు'తో ఉత్తమనటుడిగా జాతీయ అవార్డును అందుకున్న విక్రమ్‌ ఓ సాదా సీదా నటుడిగా కెరీర్‌ను ప్రారంభించాడు. తమిళ, తెలుగు భాషల్లో చిన్న చిన్న పాత్రలు చేసి ఒక్కో అడుగు అధిరోహిస్తూ ఇవాళ స్టార్‌ హీరోగా ఎదిగాడు. దర్శకుడు శంకర్‌తో కలిసి 'అపరిచితుడు' చేశాక, విక్రమ్‌ హీరోగా శిఖరాగ్రాన్ని చేరినట్టు అయింది. ఇక ఇప్పుడు నటుడిగా తనను ఛాలెంజ్‌ చేసే పాత్రల కోసం పరితపిస్తున్నాడు. అందులో భాగంగానే తాజాగా 'దైవ తిరుమగన్‌' సినిమా చేశాడు. ఇది తెలుగులో 'నాన్న'గా అనువాదమైంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైంది.
'నాన్న' సినిమా పేరుకు తగ్గట్టుగానే ఓ నాన్న కథ. మానసికంగా ఎదగని ఓ తండ్రి వ్యథ. ఊటీలో చాక్లెట్‌ ఫ్యాక్టరీలో పనిచేసే కృష్ణ (విక్రమ్‌) మానసిక ఎదుగుదల లేని మనిషి. అయినా అతన్ని ఇష్టపడి ఓ గొప్పింటి అమ్మాయి కన్నవాళ్ళను కాదని పెళ్ళి చేసుకుంటుంది. ఓ పాపకు జన్మనిచ్చిన మరుక్షణమే ఆమె మరణిస్తుంది. ఇక ఆ చిన్నారి పాపకు కృష్ణే తల్లీతండ్రి! మూడేళ్ళపాటు స్నేహితులు, సహచరుల సహకారంతో ఏ లోటు లేకుండా తన కూతురు వెన్నెల (బేబీ సారా)ను పెంచుతాడు. ఆమెను స్కూల్‌లో వేసినప్పటి నుండి కృష్ణ జీవితంలో కష్టాలు మొదలవుతాయి. ఆ స్కూల్‌ కరస్పాండెంట్‌ శ్వేత (అమలాపాల్‌)కు వెన్నెల అంటే తెలియని అభిమానం కలుగుతుంది. తీరా చూస్తే వెన్నెల తన చనిపోయిన అక్క కూతురే అని తెలుస్తుంది. వైజాగ్‌లో ఉండే నాన్నకు కబురు చేస్తుంది. తమని కాదని ప్రేమించి పెళ్ళి చేసుకున్న కూతురు చనిపోయింది, కనీసం ఆమె వారసురాలినైనా తనతో తీసుకెళ్ళాలని చూస్తాడు. అందుకు కృష్ణ ప్రతిఘటించడంతో వెనక్కి తగ్గుతారు. కృష్ణని కూడా తమతో పాటు రమ్మని చెప్పి, ఓ తెల్లవారు ఝామున మార్గం మధ్యలో అతన్ని కారు నుండి దింపేసి వెళ్ళిపోతారు. మనసికంగా ఎదగని కృష్ణకు తాను ఎక్కడున్నాడో తెలియదు. తాను ఎక్కడ నుండి అక్కడకు వచ్చాడో తెలియదు. తెలిసిందంతా తన కూతురు వెన్నెలను కొందరు ఎత్తుకు పోయారనే. అటువంటి పరిస్థితిలో అనుకోకుండా అతనికి లాయర్‌ అనురాధ (అనుష్క) పరిచయం అవుతుంది. కృష్ణ కథను తెలుసుకుని అతనికి సాయం చేసేందుకు సిద్ధపడుతుంది. కోర్టు ద్వారా అతనికి న్యాయం జరిగేలా చేస్తానని హామీ ఇస్తుంది. కృష్ణ తన కూతురు వెన్నెలను కలుసుకున్నాడు? ఈ అమాయక తండ్రీ కూతుళ్ళకు న్యాయం జరిగిందా! లేదా? అన్నది పతాక సన్నివేశం.
'నాన్న' సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది విక్రమ్‌ నటన. మానసికంగా ఎదగని తండ్రిగా అతను అద్భుతంగా నటించాడు. అలానే మూడేళ్ళ బేబీ సారా కూడా విక్రమ్‌కు థీటుగా నటించి మెప్పించింది. లాయర్‌ అనురాధగా అనుష్క చక్కగా నటించింది. అనుష్క నటించిన 'అరుంధతి' సినిమా తమిళంలో ఘన విజయాన్ని సాధించింది. అంతవరకూ అనుష్కను ఓ గ్లామర్‌ హీరోయిన్‌గానే చూసిన తమిళ ప్రేక్షకులకు ఆమెలోని మరో కోణం 'అరుంధతి' సినిమాతో తెలిసింది. అలానే గత యేడాది అక్కడ ఘన విజయం సాధించిన 'సింగం' (తెలుగులో 'యముడు') సినిమా కూడా ఆమెకు నటిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడీ సినిమా కూడా నటిగా అనుష్కలోని సత్తాను చాటేదే. అలానే 'మైనా'తో తమిళ ప్రేక్షకులకు చేరువైన మలయాళీ నటి అమలాపాల్‌ కూడా పాత్రోచితంగా నటించింది. ఇక సంతానం, నాజర్‌, సచిన్‌ ఖేడ్కర్‌, సురేఖావాణి తమ పాత్రల్లో చక్కగా ఇమిడిపోయారు.
తమిళంలో గత యేడాది వచ్చిన 'మదరాసి పట్టణం' సినిమాకు దర్శకత్వం వహించిన ఎ.ఎల్‌. విజయ్‌ 'నాన్న' సినిమాను డైరెక్ట్‌ చేశాడు. నిజానికి పదేళ్ళ క్రితం హాలీవుడ్‌లో వచ్చిన 'ఐ యామ్‌ శామ్‌' అనే సినిమా ఆధారంగా, 'నాన్న' తెరకెక్కింది. ఇదే సినిమాను కాస్త అటు ఇటుగా మార్చి ఆరేళ్ళ క్రితం హిందీలో అజయ్‌ దేవ్‌గన్‌ హీరోగా 'మై ఐసా హీ హూ' చిత్రాన్ని తీశారు. ఇప్పుడు మరోసారి 'నాన్న'గా ఈ సినిమా దక్షిణాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ చక్కని కథాంశాన్ని ప్రేక్షకులకు అందించడం మంచిదే కానీ పూర్తిగా కాపీ కథను అందించడమే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అమాయకపు తండ్రి అనగానే తెలుగు వాళ్ళందరికీ గుర్తొచ్చేది 'స్వాతిముత్యం'లో కమల్‌ హాసనే. అయితే ఆ ఛాయలు ఎక్కడా కనిపించకుండా విక్రమ్‌ ఈ పాత్రలో ఒదిగిపోయాడు. అతను పోషించిన కృష్ణ పాత్రలో ఓ స్వచ్ఛత మనకు గోచరిస్తుంది. ముఖ్యంగా కోర్టులో వచ్చే పతాక సన్నివేశంలో విక్రమ్‌, సారా పోటీపడి నటించారు. ఈ సినిమాకు ఓ రకంగా ప్రాణం పోసింది జి.వి. ప్రకాశ్‌ నేపథ్య సంగీతం. సినిమాలో వచ్చే పాటలన్నీ సందర్భానుసారంగా ఉండేవే. అలానే నీరవ్‌ షా కెమెరాపనితనం కూడా చెప్పుకోదగ్గది. చాలా కాలం తర్వాత మళ్ళీ వెండితెరపై ఊటీ అందాలను ఆస్వాదించే అవకాశం కలిగింది.
మొత్తం మీద రొటీన్‌ ఫార్ములా చిత్రాలకు భిన్నంగా 'నాన్న' రూపొందింది. కమర్షియల్‌గా ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించకపోవచ్చు. కానీ మనసున్న ప్రతివారినీ ఆకట్టుకుంటుంది. ఆలోచింపచేస్తుంది. 'నాన్న' సినిమాను తెలుగువారి ముందుకు తీసుకొచ్చిన నిర్మాతలు మళ్ళా విజయ్‌ ప్రసాద్‌, సురేశ్‌ కొండేటి అభినందనీయులు.

Saturday, July 2, 2011

Tollywood - Half Yearly Review

తెలుగు సినీరంగ ప్రథమార్థం - నిరాశాజనకం

తెలుగు సినిమా రంగానికి కాలం ఇంకా కలిసిరాలేదు. ఆంగ్ల సంవత్సరాది వచ్చి ఆరు మాసాలు గడిచిపోయినా పర్‌ఫెక్ట్ హిట్స్ పెద్దగా పడలేదు. ఒకటీ అరా విజయాలతో ఆరు నెలల కాలం అలా అలా గడిచిపోయింది. నిజం చెప్పాలంటే ఈ యేడాది ప్రదమార్ధంలో వికసించిన సినీ కుసుమాల కంటే నేలరాలిపోయిన పువ్వులే ఎక్కువ. టాలీవుడ్ చరిత్రనే తిరగరాస్తాయని, పాత రికార్డుల్ని బద్దలు కొడతాయని భావించిన సినిమాలు కూడా బాక్సా ఫీస్ బరిలో చతికిలపడ్డాయి. హిట్ కాంబినేషన్లు, దర్శకుల సీనియారిటీ, నటీనటుల కష్టాలు ఇవేవి సగటు ప్రేక్షకుడికి పట్టలేదు. సినిమా బాగుందా లేదా అన్నది ఒకటి గీటురాయిగా ప్రేక్షకులు భావించారు. నచ్చిన సినిమాలకు నజరానా అందించారు.

ఈ యేడాది తొలి ఆరు నెలల్లో విదుదలైన సినిమాల విషయానికి వస్తే తెలుగులో స్ట్రయిట్ చిత్రాలు మొత్తం యాభై విడుదుల అయ్యాయి. జనవరిలో 10, ఫిబ్రవరిలో 8, మార్చిలో 11, ఏప్రిల్‌లో 8, మేలో 6, జూన్‌లో 7 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. విచిత్రం ఏమంటే దాదాపు అనువాద చిత్రాలు ఇదే సంఖ్యలో విడుదల అయ్యాయి. స్ట్రయిట్ చిత్రాల విజయం అనువాద చిత్రాలు పొందక పోయినా వాటికి ఈ ఆరు మాసాలలో తగిన ప్రాధాన్యం లభించింది. ఈ ఆరు నెలల్లో ఇంగ్లీష్ నుండి 23, తమిళ్ నుండి 15, కన్నడ నుండి 6, హిందీ నుండి 4, మలయాళం నుండి 2 సినిమాలు తెలుగులోకి అనువాదమయ్యాయి.

బరిలో నిలబడలేకపోయిన సంక్రాతి సినిమాలు!

తెలుగు సినిమా రంగానికి సంక్రాతి పండగ పెద్ద సీజన్. అల్లుళ్ళందరూ అత్తవారింటికి చేరుకునే ఈ సమయంలో సినిమాలకు విపరీతమైన ఆదరణ ఉంటుందని అందరూ నమ్ముతారు. సంక్రాంతి సీజన్‌ను సొమ్ము చేసుకోవాలని నిర్మాతలు ఆరాటపడతారు. అయితే ఈ యేడాది సంక్రాంతికి వచ్చిన' పరమవీరచక్ర' సినిమా సగటు ప్రేక్షకుడినే కాదు, బాలక్రిష్ణ అభిమానులను సైతం నిరాశకు గురి చేసింది. బాలకృష్ణ అభినయం ఆకట్టుకున్నా, కథాబలం లేకపోవడంతో ఈ అగ్ర కథానాయాకుని చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. దాసరి అభిమానులను నిరిత్సాహపరిచింది. ఇక అదే సీజన్‌లో వచ్చిన ' అనగనగా ఓ థీరుడు' దీ అదే పరిస్థితి. ఎన్నో అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా పరాజయం బాటనే పట్టింది. రవితేజ 'మిరపకాయ్' ఓపెనింగ్స్ పర్వాలేదనిపించాయి. ఇక సుమంత్ 'గోల్కొండ హైస్కూళ్ మంచి చిత్రమనే పేరు తెచ్చుకుంది తప్పితే నిర్మాతలకు కాసుల్ని అందించలేదు.

చిన్న చిత్రాలకే పెద్ద పీట!

జనవరి మూడో వారంలో వచ్చిన 'అలా మొదలైంది ' చిన్న సినిమాల నిర్మాతలకు కొత్త ఊపిరి పోసింది. నాని, నిత్యా మీనన్ జంటగా నందినీరెడ్డి దర్శకత్వంలో దామోదర్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా చక్కని విజయాన్ని సొంతం చేసుకుని, చిన్న సినిమా ఇంకా బతికే వుందని నిరూపించింది. ఇక ఆ వెనుకే వచ్చిన గోపీచంద్ 'వాంటెడ్', బ్రహ్మానందం కుమారుడు గౌతం నటించిన 'వారెవా' పరాజయం పాలైనాయి. తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వచ్చిన 'జై బోలో తెలంగాణా నిజాయితీ గల ప్రయత్నంగా పేరు తెచ్చుకున్నా ఆశించిన స్థాయిలో తెలంగాణా జిల్లాల్లోనూ ఆడలేదు. ఇక మరో అగ్ర కథానాయకుడు నాగార్జున నటించిన 'గగనం' ఆలోచనాత్మక చిత్రమనే కితాబును పొందింది తప్పితే నిర్మాతలకు విజయం అందని ద్రాక్ష అయింది. 'వస్తాడు నా రాజు 'తో విష్ణు, 'కథా స్క్రీన్‌ప్లే దర్శకత్వం: అప్పల్రాజు ' తో సునీల్ ఖిన్నులయ్యారు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని మరో సినిమా ' ప్రేమ కావాలి ' ఫర్వాలేదు అనే టాక్‌తో సినిమా విడుదలై, ఆ తరువాత అంచలంచెలుగా ప్రేక్షకాదరణ పొంది చక్కని సక్సెస్సును సొంతం చేసుకుంది. ఇక వరుణ్ సందేశ్ 'కుదిరితే కప్పు కాఫీ', రాజేంద్ర ప్రసాద్ ' భలే మొగుడు-భలే పెళ్ళాం' కూడా నిరశకు గురి చేశాయి.

ప్రయోజనాత్మక, ప్రయోగాత్మక చిత్రాల పరాజయం!

పెద్దా చిన్నా తేడా లేకుండా ప్రయోజనాత్మక, ప్రయోగాత్మక చిత్రాలకు ప్రేక్షకులనుండి మొండి చేయి ఎదురయింది. ఎన్నారై దర్శక, నిర్మాతలు రూపొందించిన 'ఎల్‌బిడబ్ల్యు ' బాగానే వుందనే పేరు తెచ్చుకున్నా, థియేటర్లకు జనాన్ని తీసుకు రావడంలో విఫలమైంది. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అంశాల్ని దృష్టిలో పెట్టుకుని తీసిన్ 'నిత్య పెళ్ళికొడుకు', 'నిశ్శబ్ద విప్లవం', 'చట్టం' చిత్రాలను ప్రేక్షకులు హర్షించలేదు. ఐదు రోజుల్లో సినిమా తీసేస్తానన్న రాం గొపాల్‌వర్మ 'దొంగల ముఠా'' మేకింగ్ చేయగలిగారు కానీ ప్రేక్షకుల్ని మరో ఐదు రోజులయినా మెస్మరైజ్ చేయలేక పోయారు. కాస్త భిన్నంగా తెరకెక్కిన 'తిమ్మరాజు', 'కారాలు మిరియాలు','రాజ్', ప్రయోజనాత్మక చిత్రంగా పేరు తెచ్చుకున్న ''గంగ పుత్రులు ' సైతం పరాజయం పాలైనాయి.

పెద్ద చిత్రాలదీ పక్కదారే!

విజయానిది రహదారి అయితే పరాజయానిది పక్కదారే! భారీ అంచనాలతో తెరకెక్కిన అగ్ర హీరోల చిత్రాలన్నీ ఈ సీజన్లో వరుసగా పక్కదారి పట్టాయి. ఎన్‌టీఅర్, మెహర్ రమేశ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన 'శక్తి', పవన్ కళ్యాణ్, త్రివిక్రం కలసి వాయించిన 'తీన్‌మార్', రానా హీరోగా పూరీ రూపొందించిన 'నేను నా రాక్షసి' చిత్రాలు అలరించలేదు. మూడు భాషల్లో గీతాకృష్ణ తీసిన 'కాఫీ బార్'ది, శివాజీ నటించిన 'లోకమే కొత్తగా' చిత్రానిదీ అదే పరిస్థితి.

వరుస పరాజయాల నడుమ కాస్తంత ఊపిరి పోసిన చిత్రాలు 'మిస్టర్ పర్‌ఫెక్ట్', '100% లవ్'.గత ఏడాది 'డార్లింగ్' చిత్రంతో విజయాన్ని చవిచూసిన ప్రభాస్ మరో సారి 'మిస్టర్ పర్‌ఫెక్ట్' తో మంచి మార్కులు కొట్టేసాడు. అదే రకమైన ఆనందాన్ని నాగ చైతన్య కూడా పొందాడు. 'ఏం మాయ చేశావే' సక్సెస్ తరువాత మరోసారి '100% లవ్' రూపంలో విజయలక్ష్మి నాగ చైతన్యను వరించింది. దర్శకులు దశరథ్, సుకుమార్‌లలో ఈ విజయం కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ ఏడాది ప్రారంభంలో నరేశ్ నటించిన 'అహనా పెళ్ళంట' విడుదలై ఫర్వాలేదనిపించింది. ఇక మే నెలలో వచ్చిన 'సీమటపాకాయ్' కమర్షియల్‌గానూ సక్సెస్ సాధించింది. నరేశ్ ఇమేజ్‌కు బలం చేకూర్చింది. ఇక బాక్సాఫీస్ దగ్గర రవితేజ 'వీరం'గం సృస్టిస్తాడని భావించిన వారికి నిరాశ ఎదురైంది. 'ఆపరేషన్ దుర్యోధన'తో అలరించిన శ్రీకాంత్, పోసానిల జంట 'దుశ్శాసన' విషయంలో ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయింది. ఛార్మికి 'మంగళ' మాత్రమే కాదు 'నగరం నిద్రపోతున్న వేళ' సినిమా సైతం నిరాశ మిగిల్చింది. ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో వచ్చిన 'బద్రినాథ్' 'మగధీర' చిత్రాన్ని అన్ని రకాలుగా అధిగమించేస్తుందేమోననే భ్రమను విడుదలకు ముందు కలిగించినా అది అసాధ్యమని తేలిపోయింది. భారీ ఓపెనింగ్స్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఆ స్థాయిలో పాజిటివ్ టాక్‌ను తెచ్చుకోలేకపోయింది. సీనియర్ యాడ్ ఫిల్మ్ మేకర్ జయేంద్ర దర్శకత్వం వహించిన తొలి ఫీచర్ ఫిల్మ్ '180'ని విజువల్ ఫీస్ట్ అనగలం తప్పితే, గుడ్ ఫిల్మ్ అనలేం.

విడుదలలో పోటీపడిన అనువాద చిత్రాలు!

స్ట్రయిట్ తెలుగు సినిమాలు ఈ ఆరు నెలల్లో 50 విడుదలయితే, అనువాద చిత్రాలూ అదే సంఖ్యలో విడుదలై తామూ తీసిపోమని నిరుపించాయి. ఇందులో 23 చిత్రాలు ఆంగ్లం నుండి అనువాదం కాగా, తమిళం నుండి 15, కన్నడం నుండి 6,హిందీ నుండి 4, మలయాళం నుండి 2 సినిమాలు తెలుగులోకి వచ్చాయి. అయితే ప్రముఖ దర్శకుడు గౌతం వాసుదేవ మీనన్ తీసిన 'ఎర్ర గులాబీలు' ప్రయోగాత్మక చిత్రంగా మిగిలిపోయింది. అనువాద చిత్ర నిర్మాతలలో కాస్త ఉత్సాహాన్ని నింపింది కేవలం 'రంగం' సినిమా మాత్రమే. ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి కుమారుడు జీవా నటించిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఫొటో జర్నలిస్ట్‌గా జీవా అద్భుతంగా నటించాడు.దర్శకుడు కె.వి.ఆనంద్ టేకింగ్ కూడా అందర్నీ అలరించింది. అలానే సహజత్వానికి దగ్గరగా సినిమాలు తీసే బాల 'వాడు-వీడు'తో మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఈ సినిమాతో విశాల్‌కు నటుడిగా మంచి పేరు వచ్చింది. ఈ ఆరు నెలల్లో అనువాద చిత్రాలలో ఈ రెండు సినిమాలను తప్పితే చెప్పుకోడానికి మరే సినిమా లేదు.

మొత్తం మీద ఈ ఆరు నెలల్లో 'అలా మొదలైంది' 'ప్రేమ కావాలి' 'మిస్టర్ పర్‌ఫెక్ట్' '100% లవ్' 'సీమటపాకాయ్' చిత్రాలు విజయం సాధిస్తే, రెండు మూడు సినిమాలు మాత్రం ఫర్వాలేదనిపించాయి. ఇక చిత్రసీమ ఆశలన్నీ ద్వితీయార్థం పైనే..


--
Omprakash Vaddi