Showing posts with label Yatraa visheshalu. Show all posts
Showing posts with label Yatraa visheshalu. Show all posts

Monday, December 16, 2019

Maa kaasi yatra

మా కాశీ ప్రయాణం: వడ్డి ఓంప్రకాశ్‌ నారాయణ

చారిత్రక నవలా చక్రవర్తి, శ్రీ ముదిగొండ శివప్రసాద్‌ రాసిన 'దశాశ్వమేథ్' నవల దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం జాగృతి వార పత్రికలో ధారావాహికగా వచ్చింది. విదేశీయుడైన ఓ వ్యక్తి భారతీయ సంస్కృతి సంప్రదాయాల ఔన్నత్యాన్ని గుర్తించి, కాశీ విశ్వనాథుని భక్తుడిగా ఎలా మారిపోయాడనే నేపథ్యంలో అది సాగుతుంది. పితృఋణం తీర్చుకోవడానికి కాశీ వెళుతుంటారని తప్పితే ఆ ప్రాంతం గురించి పెద్దంత అవగాహన నాకప్పటికీ లేదు. అలానే అయోధ్య, మధుర తరహాలోనే కాశీ విశ్వనాథ మందిరం మీద సైతం మహ్మదీయులు దాడి చేశారని, ప్రధాన దేవాలయంను కొంత కూల్చేసి వారి ప్రార్థనా మందిరాన్ని కట్టారనే విషయం కొంత తెలుసు. అప్పటికే విశ్వహిందూ పరిషత్ అయోధ్య, మధుర, కాశీ ఈ మూడు దేవాలయాలను పునర్నిర్మించాలనే ఉద్యమాన్ని మొదలుపెట్టింది. సరే... మొత్తానికీ చట్టప్రకారంగా ఇప్పటికైతే అయోధ్యను దక్కించుకోగలిగింది. ఆ రామజన్మభూమికి నేను వెళ్ళలేకపోయినా... మధురలోని శ్రీకృష్ణాలయాన్ని, దానిలోకి చొచ్చుకొని వచ్చిన ప్రార్థనా కట్టడాన్ని అయితే చూశాను. ఇంతకాలానికి కాశీని సందర్శించుకునే అవకాశం నాకు ఓ వివాహం సందర్భంగా కలిగింది. తాండూరులో ఉండే మా తోడల్లుడు మీదికేరి రాములు గారి అమ్మాయి అఖిల వివాహం ఉత్తరప్రదేశ్ లోని భదోహీ (కార్పెట్ సిటీ) లో ఏర్పాటు చేశారు. అక్కడ నుండి వారణాసి కేవలం 45 కిలోమీటర్లే కావడంతో వివాహానంతరం వారణాసి వెళ్ళి కాశీ విశ్వనాథుడి దర్శనం కూడా చేసుకోవాలని అనుకున్నాం. ముందుగా పది పదిహేను మందిమి వివాహానికి వెళ్ళాలని అనుకున్నా, దానికి కాశీ పుణ్యక్షేత్ర దర్శనం జత కావడంతో ఆ సంఖ్య దాదాపు 30కి చేరిపోయింది.

పాట్నా (దానాపూర్) ఎక్స్ ప్రెస్ లో...
సికింద్రాబాద్ నుండి వారణాసి వెళ్ళాలంటే పాట్నావరకూ వెళ్ళే దానాపూర్ ఎక్స్ ప్రెస్ సౌకర్యవంతంగా ఉంటుందని మాకు అనిపించింది. సికింద్రాబాద్ లో ఉదయం 9.35కు బయలుదేరే ఆ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ వారణాసికి ఆ మర్నాడు మధ్యాహ్నం 2.30కి చేరుతుంది. అయితే మేం వెళ్ళాల్సింది భదోహీ కావడంతో వారణాసి కంటే రెండు గంటల ముందే జ్ఞాన్ పూర్ రోడ్ లో ట్రైన్ దిగేశాం. అక్కడ నుండీ భదోహీకి రోడ్డు మార్గంలో 20 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత మా హోటల్ కు చేరుకున్నాం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో కొన్ని స్టేషన్లలో రైలు ఐదు, పది నిమిషాల పాటు ఆగింది. సరదాగా రైలు దిగి ఫ్లాట్‌ ఫామ్ మీద చక్కర్లు కొడుతుంటే ఎలాంటి సూచనలు, ప్రకటనలు ఇవ్వకుండా ఠక్కున రైలు బయలుదేరడం... మా వాళ్ళంతా పరుగు పరుగున దానిని అందుకోవడం మాత్రం కాస్తంత ఆందోళనకు గురిచేసింది. గతంలో స్టేషన్ లో రైలు బయలుదేరే ముందు గంటలు కొట్టడం, విజిల్ వేయడం, ప్రధానంగా మైక్ లో అనౌన్స్ మెంట్ చేయడం లాంటివి జరిగేవి. కనీసం నాగ్ పూర్ లాంటి స్టేషన్ లో సైతం అలాంటి పని చేయలేదు!
డిసెంబర్ మాసంలో ఉత్తరభారతంలో చలి భరించలేనంతగా ఉంటుందని భావించిన మా అంచనాలను భిన్నంగా భదోహీలో వెచ్చని వాతావరణమే మాకు స్వాగతం పలికింది. అయితే వేకువ ఝామున మాత్రం కాస్తంత చలి ఉండటంతో టీ స్టాల్స్ లో మట్టి ముంతలతో (కుల్లడ్) చాయ్ ను తాగి... ఓ కొత్త రుచిని ఆస్వాదించాం. అలానే అదే రోజు సాయంత్రం ఆ భదోహిలో శ్రీ సేవాలాల్ మౌర్య కుమారుడు అమిత్ కుమార్ మౌర్యతో మా వదినగారి అమ్మాయి అఖిల వివాహం జరిగింది. తెలుగు వివాహ పద్ధతికి కాస్తంత భిన్నంగా జరిగిన ఆ వేడుక ఆద్యంతం మాలో ఓ కొత్త ఉత్సాహాన్ని, ఉత్సుకతను కలిగించింది. ఓ కొత్త సంప్రదాయాన్ని తెలుసుకున్న అనుభూతికి అందరం లోనయ్యాం.




ఛలో కాశీ....
ప్రధానమైన వివాహ తంతు పూర్తి కాగానే మా దృష్టి కాశీ ప్రయాణం మీదకు మళ్ళింది. భదోహీ నుండీ వారణాసి 45 కిలో మీటర్లు. మా 30 మందికి ఓ మినీ బస్ ను పెళ్ళివారు ఏర్పాటు చేశారు. కాశీలో మా కోసం ఓ హోటల్ లో రూమ్స్ సైతం ముందే బుక్ చేశారు. ఒకటిన్న ర రోజు పాటు మేం కాశీలో ఉండేలా ప్లాన్ చేశారు. ఉదయమే అల్పాహారం చేసి, భదోహి నుండీ బస్ లో 11.00 గంటలకు కాశీ బయలుదేరాం. కానీ ఆ దారి అస్సలు బాగోక పోవడం, సింగిల్ రోడ్ కావడంతో మాకు దాదాపు మూడు గంటలసేపు పట్టింది. ముందు అనుకున్న విధంగా
సారానాథ్ కు చేరిపోయాం. వారణాసికి అది కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉంది. క్రీస్తుపూర్వం 528లో గౌతమ బుద్ధుడు తన ప్రధానమైన శిష్యులకు బౌద్ధం గురించి బోధించిన స్థలం ఇది. దీనిని ధాయ్ లాండ్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. దాదాపు 81 అడుగుల భారీ బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. 1995 నుండి 2005 వరకూ ఈ విగ్రహ రూపకల్పన జరగ్గా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి, శిలలు, శిల్పాలు ఏర్పాటు చేయడానికి మరో ఐదారేళ్ళు పట్టింది. మొత్తం మీద 2011 డిసెంబర్ కు ఈ ప్రాజెక్ట్ పనిని పూర్తి చేశారు. భారత జాతీయ చిహ్నంలో ఉంటే అశోకుని ధర్మ చక్ర స్థూపం కూడా ఇదే ప్రాంగణంలో కొలువుదీరింది. మనం ఏదైనా విహార స్థలం లేదా పుణ్య క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడి గైడ్స్ మనకు ఆ స్థల విశేషాలను తెలియచెప్పడం కంటే కూడా అక్కడ లభించే ప్రత్యేక వస్తువులను మనతో కొనిపించే పనిలో ఎక్కువ పడతారు. గతంలో బెంగళూర్ లో మాకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇక్కడ సారానాథ్ లోనూ అదే జరిగింది. సారానాథ్ లోని వట్ థాయ్ బౌద్ధ విహార్ దర్శనం తర్వాత మమ్మల్ని బెనారస్ చీరలు అమ్మే ప్రాంతానికి గైడ్ తీసుకెళ్ళిపోయాడు. దాంతో ఆ పక్కనే ఉన్న ప్రసిద్ధ బౌద్ధ ఆర్కియాలజికల్ మ్యూజియంను మేం చూడలేకపోయాం.









దశాశ్వమేథ్ ఘాట్ లో గంగా హారతి
కాశీ బయలుదేరే ముందే మా బృందంలోని ఆడవాళ్ళంతా గంగాహారతికి కచ్చితంగా హాజరు కావాలనే నిర్ణయానికి వచ్చేశారు. అయితే సారానాథ్ నుండి వారణాసి నగరంలోకి అడుగుపెట్టేసరికి సాయత్రం ఆరు గంటలు అయిపోయింది. సిటీలో ట్రాఫిక్ విపరీతంగా ఉండటంతో రైల్వే స్టేషన్ సమీపంలోని మా హోటల్ కు ఈ మినీ బస్ వెళ్ళలేని పరిస్థితి. మరో పక్క గంగాహారతికి హాజరు కావాలంటే... కనీసం ఐదు గంటలకే ఆ నదీతీరానికి వెళ్ళాలని స్థానికులు చెబుతున్నారు. దాంతో మా లగేజీని బస్ లోనే వదిలేసి ఐదారు ఆటోలలో గంగాహారతికి బయలు దేరాం. ఘాట్ కు దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలోని ఆటోలను ఆపేశారు. అక్కడ నుండీ కాలినడక... ఉరుకులు పరుగులతో మొత్తానికి గంగాహారతి చివరి దశలో ఘాట్ కు చేరుకుని ఆ దివ్యమనోహర సుందర దృశ్యాన్ని మాలో కొద్దిమందిమి తిలకించగలిగాం. అక్కడే అమ్ముతున్న దీపాలను కొనుక్కుని కాశీ విశ్వనాథుడిని తలుచుకుని గంగా నదిలో విడిచిపెట్టాం. గంగానది నుండీ మేం దిగి వచ్చిన ఘాట్ వైపు తలెత్తి చూస్తే... పైన బోర్డ్ మీద "దశాశ్వమేథ్‌ ఘాట్' అని రాసి ఉంది. వెంటనే నా మనసు పులకించిపోయింది...  ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం చదివిన 'దశాశ్వమేథ్' నవల కళ్ళముందు కదలాడింది. ఓ చక్కని రచన మన మీద ఎంతటి ప్రభావం చూపుతుందో, ఇగిరిపోని గంధం తరహాలో మనల్ని ఎప్పుడూ ఎలా మానసికంగా పరిమళింప చేస్తుందో ఆ క్షణం నాకు అర్థమైంది. ఆ దశాశ్వమేథ్ ఘాట్ కు వినమ్రంగా నమస్కరించి, కాశీ విశ్వనాథుని దర్శనానికి బయలు దేరాం. కాశీ అనగానే చాలామంది భయపెట్టిన తీరు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇరుకైన వీధులు, బురద, ఆవులు మనుషులను తోసుకుంటూ వెళ్ళడం, అసలు ప్రధాన ఆలయం రహదారి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పలేం అని కొందరు వర్ణిస్తే... నాకు ముంబై లోకల్ ట్రైన్ లో ప్రయాణం జ్ఞప్తికి వచ్చేది. కాశీలోని ఘాట్ లు ఇప్పుడు చాలా పరిశుభ్రంగా ఉన్నాయి. ప్రధాన దేవాలయ మార్గం ఇరుకుగానే ఉన్నా, మరీ తోపులాట లేదు. భక్తులంతా దాదాపు ఓ అరకిలోమీటరు క్యూలో నిలుచుని ఉన్నారు. దేవాలయంలో నైవేద్య సమర్పణ, హారతి ఇచ్చే సమయం కావడంతో మా దర్శనానికి గంటన్నర సమయం పట్టింది. తిరుపతి, శ్రీశైలం వంటి విశాలమైన పుణ్యక్షేత్రాలను చూసిన వాళ్ళకు కాశీ విశ్వనాథుని మందిరం అతి చిన్నదిగా అనిపించడంలో తప్పులేదు. బాధాకరం ఏమంటే... విశ్వనాథుని దేవాలయంలోకి అడుగుపెట్టగానే దానికి రెండింతల ఎత్తులో పక్కనే ఓ పెద్ద మసీదు గుమ్మటం మాకు కనిపించింది. ప్రశాంతంగానే విశ్వనాథుని దర్శనం చేసుకున్నాం. గతంలో అయితే... భక్తులంతా శివలింగాన్ని తాకి, మొక్కే అవకాశం లభించేదట. కానీ ఇప్పుడు మాత్రం దూరం నుంచి నమస్కారం చేసుకుని వెళ్ళడమే! అక్కడ నుండీ తిరిగి వస్తూ పక్కనే ఉన్న అన్నపూర్ణ దేవాలయానికి వెళ్ళాం. ప్రశాంత చిత్తంతో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నాం. ఆ వెనుకే అమ్మవారి ప్రసాద వితరణ శాలకు వెళ్ళి దానిని స్వీకరించాం. దాంతో కాస్తంత క్షుద్బాధ తీరింది. ఆ తర్వాత కొద్ది దూరంలో ఉన్న విశాలాక్షి దేవాలయానికి బయలుదేరాం. ఈ రాత్రి సమయంలో ఇరుకు వీధుల్లో ప్రయాణం చేయడం అంత క్షేమం కాదని, మెడలోని బంగారు ఆభరణాలను కాస్తంత జాగ్రత్తగా చూసుకోమని కొందరు సలహా ఇచ్చారు. అప్పటికే రాత్రి 10.30 నిమిషాలు అయిపోయింది. దేవాలయం తెరిచి ఉంటుందనే నమ్మకంతో అక్కడకీ వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని కొంతదూరం రిక్షా, మరికొంత దూరం ఆటోలో ప్రయాణించి మేం దిగిన మినీ బస్ ను చేరుకున్నాం. అక్కడ నుండీ హోటల్ రూమ్ కు చేరడంతో ఆ రోజు కార్యక్రమాలు ముగిశాయి.




కాశీలో సుడిగాలి పర్యటన
తొలిరోజు కాశీలో చేసిన ప్రయాణంతో మాకు అక్కడ మినీ బస్ తో తిరగడం వల్ల ఉపయోగం లేదనే విషయం బోధ పడింది. మూడు నాలుగు ఆటోలు మాట్లాడుకుని చూడాల్సిన ప్రదేశాలకు వెళ్ళడమే బెటర్ అనుకున్నాం. దాంతో మినీ బస్ ను పంపించేశాం. మాలో కొంతమంది పెద్దవాళ్ళు గంగాస్నానం చేయడానికి, మరోసారి కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవడానికి ఆసక్తి చూపించారు. వారంతా ఉదయం ఎనిమిది గంటల కల్లా గంగానదీ స్నానానికి వెళ్ళిపోయారు. మరికొందరు పర్యాటక స్థలాలు, గంగా విహారానికి మొగ్గు చూపారు. వాళ్ళూ రెండు ఆటోలలో ఆ దిశగా వెళ్ళారు. మిగిలిన కొందరం మాత్రం దగ్గరలోని దేవాలయాలను చూడాలని అనుకున్నాం. ఆ సమయంలో మాకు తోడుగా నిలిచిన వ్యక్తి ఫౌజీ పండిట్. ఆ రోజు ఉదయమే మా బావమరిది శ్రీనివాసరావు భార్య కిరణ్మయి, కుమార్తె ఉపాసన ఫ్లైట్ లో వారణాసి నుండి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. వాళ్ళను ఎయిర్ పోర్ట్ లో దించే సమయంలో శ్రీనివాస్ కు ఆటో డ్రైవర్ ఫౌజీ పండిట్ తో పరిచయం ఏర్పడింది. అతను ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యాడు. ముగ్గురు పిల్లలూ డాక్టర్లట. అతనికి సొంతగా ఏడు ఆటోలు ఉన్నాయట. 'మరి హాయిగా విశ్రాంతి తీసుకోకుండా ఈ 70 యేళ్ళ వయసులో ఆటో నడుపుకోవడం ఎందుకూ?' అంటే నవ్వేశాడు. ఒంట్లో ఓపిక ఉన్నంత కాలం పిల్లల మీద ఆధారపడటం తనకిష్టం లేదని, తానే కొంతమంది కుర్రాళ్ళకు కొలువు ఇచ్చానని చెప్పాడు. అతని సహకారంతో ఓ ఐదారు గంటల పాటు కాశీలోని కొన్ని పుణ్యక్షేత్రాలు చుట్టేసి వచ్చాం. బెనారస్ లస్సీకి, పాన్ కు ఫేమస్‌. దాంతో పహిల్వాన్ లస్సీ సెంటర్ లో రుచికరమైన లస్సీ తాగి, రబ్డీని తిన్నాం. బనారస్ పాన్ గురించి ఫౌజీ పండిట్ ఓ విశేషం చెప్పాడు. పాన్ షాప్ వాళ్ళు తమ కుమార్తెలను షాపులో కూర్చో పెట్టి పాన్ తయారు చేయనివ్వరట. దానిని ఎలా తయారు చేస్తారో ఆడపిల్లలకు తెలిసిపోతే, వివాహానంతరం వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి, అంత రుచికరమైన పాన్ అక్కడ కూడా తయారు చేస్తే తమకి పోటీ అవుతుందని, తమ ప్రత్యేక కోల్పోతామని వీళ్ళకు భయమట!



తులసీ మానస మందిర్
కాశీలో చూడాల్సిన ప్రధాన ప్రదేశాలలో ఇదొకటి. తులసీదాస్ రామచరిత మానస్ రాసిన ప్రాంతం. ఆయన రాసిన రామాయణాన్ని మార్బుల్స్ మీద చెక్కి గోడలకు అమర్చిన కట్టడం ఇది. క్రింది భాగంలో దేవాలయం ఉండగా, మొదటి అంతస్తులో రామాయణంలోని వివిధ ఘట్టాలను తెలియచేసే మ్యూజియం ఉంది. ఐదు రూపాయల ప్రవేశ రుసుముతో దానిలోకి వెళ్ళి వాటిని చూడొచ్చు. 1964లో దీనిని కట్టారు. దానికి కాస్తంత ఇవతల ఉన్నది త్రిదేవ్ మందిర్. ప్రశాంత వాతావరణంలో కాసేపు ద్యానం చేసుకోవడానికి అనువుగా ఉన్న మందిరం ఇది. అక్కడి మూర్తుల అలంకరణ ప్రత్యేకంగా ఉండి, చూపరులను ఆకట్టుకుంటోంది. ఇక కాశీలోని మరో ప్రధాన దేవాలయం సంకట మోచన్ హనుమాన్ టెంపుల్. 16వ శతాబ్దంలో తులసీదాస్ ఈ దేవాలయంలోనే రామచరిత మానస్ రాశాడనే వారూ లేకపోలేదు. అక్కడి హనుమంతుడు చాలా శక్తిమంతుడని, ఆయనను దర్శించుకుని, ప్రార్థిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. దీని కాస్తంత దగ్గరలోనే ఉంది దుర్గామాత మందిరం. దీని విశేషం ఏమంటే 18వ శతాబ్దంలో తూర్పు బెంగాల్ (ప్రస్తుత బంగ్లాదేశ్) కు చెందిన నాటోర్‌ రాణీ భభానీ దీనిని నిర్మించారట. దేవాలయం మొత్తం సిందూర వర్ణంలో శోభాయమానంగా ఉంది. ఆ తర్వాత మేం కాలభైరవ మందిరానికీ వెళ్ళాల్సి ఉంది. కానీ అప్పటికే ఆ దేవాలయాన్ని మూసి వేస్తారని తెలియడంతో ఆ ఆలోచన విరమించుకుని, మరోసారి గంగాతీరానికి బయలుదేరాం.






బోటులో గంగా విహారం
మొదటి రోజు రాత్రి దశాశ్వమేథ్ ఘాట్ నుండీ గంగానదికి వెళ్ళగా, ఇప్పుడు విజయనగరం ఘాట్, కేదార్ ఘాట్ మధ్య నుండీ గంగానదికి చేరుకున్నాం. పట్టపగలు పెద్దంత జన సంచారం లేకుండా అలా గంగానదిని చూస్తుంటే మనసు పులకించిపోయింది. వెంటనే ఓ బోటును మాట్లాడుకుని గంగా విహారానికి బయలుదేరాం. ముందుగా మనిషికి 500 రూపాయాలు ఇవ్వాలని చెప్పినా... చివరకు రెండు వందల రూపాయలకు బేరం కుదిరింది. మాతో పాటు ఫౌజీ పండిట్ సైతం బోటులో కూర్చోవడం మాకెంతో మంచిదైంది. కాశీ పుణ్యక్షేత్రం విశేషాలనూ ఆయన మాకు చెప్పారు. కాశీ, వారణాసి, బెనారస్ అనే పేర్లు కాకుండా దీనికి అవిముక్త అనే పేరుకూడా ఉందట. ఇక వారణాసి అనేది రెండు నదుల పేర్ల కలయిక. వారణ, అశి అనే నదులవి. 'నేను వారణ, నీవు అశి..' అంటూ విజయచందర్ నటించిన 'కబీర్ దాస్' సినిమాలో ఓ పాటను వేటూరి రాశారు. ఇటీవలే ఆ పాటను విన్నాను. దాంతో ఆ పాటలో వర్ణించిన వారణాసి వర్ణన నా కళ్లముందు కదిలింది. గంగాతీరంలో అనేక ఘాట్స్ ఉన్నాయి. వాటిల్లో హరిశ్చంద్ర ఘాట్, మణికర్ణిక ఘాట్ ప్రత్యేకమైనవి. ఈ రెండు ఘాట్ ల లోనూ దహన సంస్కారాలు జరుగుతూ ఉంటాయి. వీటిల్లో మణికర్ణిక ఘాట్ ఇంకా చిత్రమైంది. ఈ ప్రాంతం దగ్గరకు ఓసారి శివపార్వతులు వచ్చారట. అక్కడ అమ్మవారి బంగారు ఆభరణాలలో ముక్కెర, కంఠాహారం పోయాయట. ఎంత వెదికినా కనిపించలేదట. దాంతో శివుడు ఆగ్రహించి, ఈ స్థలం ఎప్పుడూ రగులుతూనే ఉండాలని శపించాడట. అప్పటి నుండీ 24 గంటలకూ అక్కడ దహన సంస్కారాలు జరుగుతూనే ఉంటాయని చెప్పారు. రాత్రి ఒంటి గంటకు జరిగే శవదహనానికి సంబంధించిన భస్మం ను స్థానిక పోలీసు, ప్రభుత్వ అధికారుల సమక్షంలో సేకరించి, మూడు గంటల సమయంలో విశ్వనాథుడికి ఇచ్చే భస్మహారతిలో ఉపయోగిస్తారట. దీనిని దేవాలయంలోని భక్తుల నుదుటికి పెడతారట. రాజా హరిశ్చద్రకు సంబంధించిన భవనం కూడా ఈ నది ఒడ్డునే ఉంది. ఆ భవనం ఇరువైపులా రెండు పెద్ద పులుల విగ్రహాలు ఉండటం విశేషం. అలానే కాశీ విశ్వేశ్వరుని దేవాలయాన్ని తలపించేలా చిన్న మందిరం ఒకటి గంగానది ఒడ్డున కాస్తంత పక్కకి ఒరిగిపోయి ఉంది. దానికీ ఓ కథ ఉందని ఫౌజీ పండిట్ చెప్పారు. ఓసారి తల్లి కొడుకులిద్దరు కాశీలో విశ్వనాథుని దర్శనానికి వచ్చారట. భక్తుల రద్దీకారణంగా ఆ స్వామిని దర్శించుకోవడం తన వల్ల కాదని తల్లి చెప్పి, తన కోసం విశ్వనాధుని మందిరాన్ని నిర్మించమని కొడుకుని కోరిందట. తల్లి కోరిక నెరవేర్చుతూ తనయుడు అక్కడో దేవాలయాన్ని నిర్మించి, 'అమ్మా! ఈ దేవాలయ నిర్మాణంతో నీ రుణం నేను తీర్చుకున్నాను' అని గర్వంగా చెప్పాడట. 'ఏదో ఒక పని చేసి నంత మాత్రాన తల్లి రుణం తీరిపోతుందా? అమ్మ రుణం ఎప్పటికీ తీర్చలేద'ని చెప్పిన అతని తల్లి, 'నిజంగానే నీ రుణం తీరిపోతే, ఈ గుడి సక్రమంగా ఉంటుంది, లేదంటే పక్కకి ఒరిగిపోతుంద'ని చెప్పిందట. చూస్తుండగానే ఆ గుడి గంగానదిలోకి కొన్ని వందల అడుగుల మేరకు పక్కకు ఒరిగిపోయిందట! ఇలాంటి ఆసక్తికరమైన అంశాలను ఆ యా ఘాట్స్ ను చూస్తుండగా మాకు ఫౌజీ పండిట్ చెబుతూనే ఉన్నాడు. ఆ పడవను నడిపే కుర్రాడి చేతిలో 'కేవట్ గుప్తధన్' పేరుతో మాకు నచ్చిన మొత్తాన్ని ఇతరులకూ కనిపించకుండా పెట్టమని చెప్పాడు. గంగావిహారం బాగా జరిగిందనే ఆనందంతో ఎవరికి తోచిన మొత్తం వారు, ఆ పడవ నడిపే కుర్రాడికి ఇచ్చారు.ఆ పడవ మీద ప్రయాణిస్తూ కొన్ని ఫోటోలు తీయించుకున్నాం. ఆ ఫోటోగ్రాఫర్ 'ఆవ్... ఆవ్...' అంటూ చెయ్యి ఊపగానే పదుల సంఖ్యలో పావురాలు ఎగురుకుంటూ వచ్చాయి. అతను వేసిన ఆహారాన్ని గాల్లోనే అందిపుచ్చుకుని హాయిగా నదిమీద తేలుతూ సాగాయి! అదో చిత్రమైన అనుభూతి! అదే రోజు సాయంత్రం 4.00 గంటలకు దానాపూర్ ఎక్స్ ప్రెస్ లోనే వారణాసి నుండి సికింద్రాబాద్ కు మా తిరుగుప్రయాణం ఉండటంతో హడవుడిగా గంగామాతకు నమస్కారం చేసి హోటల్ కు బయలుదేరాం.






భారతీయ సంస్కృతికి, ఉన్నత విద్యా వ్యాప్తికి మూల స్తంభంగా నిలిచిన బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం చూడాలనే కోరిక మాత్రం సమయాభావం వల్ల మాకు తీరలేదు. ఇక వారణాసి రైల్వే స్టేషన్ సైతం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. కాశీ పుణ్యక్షేత్రం సంగీత, సాహిత్య, ఆధ్యాత్మికతల త్రివేణీ సంగమం. దానికి తలపించేలానే సంగీత కారుల చిత్రాలు ఆ రైల్వే స్టేషన్ లోని గోడలపై చిత్రీకరించబడి ఉన్నాయి. ఇక బయట ఉన్న వాటర్ ట్యాంక్ ఆకర్షణీయమైన పెయింటింగ్ వేయడం కొత్తవారికి భలే ఆకట్టుకుంది. ఆ రకంగా ఉత్తర భారతదేశంలోని ఓ ప్రధాన పుణ్యక్షేత్రాన్ని ఈ యేడాది చివరిలో దర్శించుకునే భాగ్యం మాకందరికీ కలిగింది.


Saturday, November 16, 2019

బందరులో శక్తిపటాలు (ప్రయాణం) సంచిక వెబ్ మేగజైన్ లో...

బందరులో శక్తి పటాలు!

పండగ సమయాల్లో సొంత వూరు వెళ్ళకూడదనే నియమాన్ని చాలా యేళ్ళ క్రితమే పెట్టేసుకున్నాను. దాంతో సంక్రాంతి, ఉగాది, వినాయక చవితి, దసరా, దీపావళి... ఇలా అన్ని పండగలు హైదరాబాద్‌లోనే జరుపుకోవడం అలవాటైపోయింది. కానీ ఈ యేడాది తప్పనిసరి పరిస్థితులలో మా సొంతూరు బందరు (మచిలీపట్నం) వెళ్ళాల్సి వచ్చింది. కొందరితో చేసే స్నేహం మనకు భలే ఉపయోగపడుతుంది. అలా ఓ రైల్వే ఉన్నతాధికారితో నాకున్న బీరకాయ పీచు బంధుత్వంతో పాటు ఏర్పడిన గాఢమైన మైత్రి కారణంగా ఎంచక్కా రైల్లో ఎమర్జెన్సీ కోటా కింద టిక్కెట్ కన్ఫర్మ్ చేసుకుని దసరా పండగకు బందరు చేరగలిగాను!

చిత్రమేమంటే... మా ఊళ్ళో ఉండే చాలా పురాతన, ప్రత్యేక దేవాలయాల గురించి నాకు తెలియనే తెలియదు. ఆ మధ్య నా కొలీగ్ ప్రదీప్ 'మీ బందరులో హయగ్రీవాలయం ఉంది తెలుసా?' అని ప్రశ్నిస్తే తెల్లబోయాను. ఆ తర్వాత ఊరెళ్ళినప్పుడు మా తమ్ముడు జితేంద్రను అడిగి తెలుసుకుని, బచ్చుపేట వెంకటేశ్వర స్వామి గుడిపక్కనే ఉన్న హయగ్రీవ కోవెలకు వెళ్ళి స్వామిని దర్శించుకున్నాను. అలానే ఈ దసరాకు నేను బందరు వెళ్ళినప్పుడూ ఓ కొత్త అనుభూతిని పొందాను. అదే శక్తిపటాల ఊరేగింపు!

నా చిన్నతనంలోనూ శక్తిపటాల ఊరేగింపు దసరా రోజుల్లో జరిగేది కానీ మరీ ఇంత ఉదృతంగా కాదు. రెండు మూడు శక్తిపటాలు మాత్రమే కనిపించేవి. అవీ ఒకటి రెండు పేటలకు మాత్రమే పరిమితం అయ్యేవి. కానీ ఇప్పుడు అవి వంద సంఖ్యకు పెరిగాయనిపించింది. అంతేకాదు... బందరులోని ప్రధాన పేటలన్నింటిలోనూ కుర్రాళ్లు శక్తి పటాలను ఎత్తుకుంటున్నారు. దసరా పండగ రోజుల్లో మనిషికి శక్తివేషం వేస్తారు.  ఐదారు అడుగు ఎత్తులో వెదురు కర్రలతో శక్తి పటాన్ని తయారు చేస్తారు. ఓ వైపు కాళీమాతను, మరో వైపు ఆంజనేయ స్వామి బొమ్మను రంగులతో గీస్తారు. దీనిని కుర్రాళ్ళు వీపుకు కట్టుకుంటారు. అలానే ముఖానికి కాళీ మాత బొమ్మను తగిలించుకుంటారు. ఓ చేతిలో శక్తిపటం తాలూకు తాడును, మరో చేతిలో కత్తిని పట్టుకుంటారు. వీరి ముందు ఉండే బృందం కొట్టే డప్పుల శబ్దానికి తగ్గట్టుగా, లయబద్దంగా శక్తి పటాన్ని ఎత్తకున్న యువకుడు ఆడుతూ ఉంటాడు. ముఖమంతా అమ్మవారి ప్రతిమతో మూసుకోవడంతో ఊపిరి అందడం కొంత కష్టమే. అందుకే ఓ సహాయకుడు పక్కనే ఉండి, విసనకర్రతో విసురుతూ ఉంటాడు. అలసి, సొలసినప్పుడు కాసేపు సేద తీర్చుకుంటూ, ప్రతి గడప దగ్గర ఆగుతూ ఈ ఊరేగింపును ఈ బృందం కొనసాగిస్తుంటుంది. ఉదయానే అమ్మవారిని పూజించి, ఉపవాసంతో మొదలయ్యే ఈ ఊరేగింపు తంతు... ప్రధాన కూడళ్ళను చుట్టి, సాయంత్రంకు తిరిగి గుడిని చేరడంతో ముగుస్తుంది. శక్తి పటాలు ఎత్తుకునే వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు సైతం అతనితో పాటు ఈ ఊరేగింపులో పాల్గొంటారు. ఇలా భక్తి శ్రద్ధలతో చేసే ఈ ఊరేగింపుతో కోరిన కోరికలు తీరతాయని వారి నమ్మకం.

అసలీ సంప్రదాయం ఎలా మొదలైందని మా తమ్ముడిని అడిగితే ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. ''శతాబ్దానికి ముందే ఇది మొదలైందట. కలకత్తా నుండీ వచ్చిన బుద్దా సింగ్ అనే ఆయన... అక్కడ జరిగే శక్తి పటాల ఊరేగింపుకు ప్రభావితుడై... ఇక్కడ కూడా ఆ సంప్రదాయం మొదలెట్టాడట. ఈడేపల్లిలోని ఓ చిన్న గుడిసెలో కాళికామాత చిత్రాన్ని పెట్టుకుని ఆరాధించేవాడట. శరన్నవరాత్రుల సమయంలో శక్తి పటాన్ని స్వయంగా తయారు చేసుకుని, ఆరేడు వీధుల్లో తిరిగే వాడట. అతను మొదలు పెట్టిన ఆ సంప్రదాయాన్ని ఆ తర్వాత అతని వారసులూ కొనసాగించారట. అప్పుడు ఏర్పడిన ఈడేపల్లిలోని చిన్న శక్తి గుడి ఇప్పుడు పెద్దదిగా రూపొందింది" అని చెప్పాడు.
ఈ వందేళ్ళ కాలక్రమంలో ఈ శక్తిపటాల ఊరేగింపు అనేది బందరులోని అన్ని వాడలకూ వ్యాపించేసిందట. చిత్రం ఏమంటే... కలకత్తా తర్వాత ఆ స్థాయిలో శక్తిపటాల ఊరేగింపు జరిగేది బందులోనే అని తమ్ముడు చెబుతుంటే ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టాను.

దసరా తొమ్మిది రోజులు జరిగే ఊరేగింపులు ఓ ఎత్తు అయితే... విజయదశమి రోజు రాత్రి అన్ని వాడల శక్తి పటాలు బందరు పట్టణ ప్రధాన కూడలి అయిన కోనేరు సెంటర్ కు వచ్చి అక్కడో జాతరను తలపింపచేయడం మరో ఎత్తు! ఊరిలోని అన్ని ప్రాంతాల శక్తి పటాలను చూడటానికి ఆ రోజు రాత్రి బందరు వాసులంతా... కోనేరు సెంటర్ కు చేరుకుంటారు. గతంలో రాత్రి రెండు గంటల వరకూ ఈ జాతర సాగుతుండేది. కానీ ఇప్పుడది ఏకంగా తెల్లవారు ఝాము వరకూ కొనసాగుతోంది. నేను విజయదశమి మర్నాడు పొద్దునే కోనేరు సెంటర్ కు
తమ్ముడితో కలిసి వెళ్ళేసరికీ పది పన్నెండు శక్తి పటాలు అక్కడ అప్పటికీ ఉన్నాయి. పోలీసులు వాళ్ళకు నచ్చచెప్పి... వారి వారి ప్రాంతాలకు పంపే పనిలో బిజీగా ఉన్నారు. రాత్రంతా జాగారం చేసిన జనాలు సైతం చుట్టూ ఉన్న భవంతుల పై నుండీ ఈ శక్తి పటాలను చూస్తూనే ఉన్నారు. మనుషులు యాంత్రికంగా తయారైపోయి... ఎవరి గూటిలో వారు గడిపేస్తున్నారని మనం అనుకుంటున్నాం కానీ సామూహిక సంబరాలు, ఇలాంటి సంప్రదాయాలు ఇంకా చాలా చోట్ల కొనసాగుతూనే ఉన్నాయి.

అయితే బాధకరమైన విషయం ఏమంటే... ఇలాంటి జాతరలలో క్రమశిక్షణ మృగ్యమవుతోంది. భక్తి ముసుగులో కొందరు తాగుడు లాంటి వ్యసనాలకు బానిస అవుతున్నారు. ముఖ్యంగా కుర్రకారుకు ఇలాంటి కార్యక్రమాలతో ఓ లైసెన్స్ ఇచ్చినట్టుగా అయిపోతోంది. శక్తి పటం వెనుక పగలంతా తిరగడం, నృత్యం చేయడం అంత తేలికైన విషయం కాదు! సో  ఆ కష్టం తెలియకుండా ఉండాలంటే... చుక్క పడాల్సిందే! అన్నట్టుగా కొందరు వ్యవహరిస్తున్నారు. దీనిని అదుపు చేయకపోతే మాత్రం... యువతరాన్ని మనం తెలిసి తెలిసి చెడగొట్టినట్టే అవుతుంది!
మనిషి సన్మార్గంలో సాగడానికి భక్తి ఉపయోగపడాలి కానీ... వ్యసనాలకు బానిస కావడానికి కాదనే విషయాన్ని ఎవరో ఒకరు వారికి తెలియచెప్పాల్సి ఉంది!

- వడ్డి ఓంప్రకాశ్‌ నారాయణ








https://sanchika.com/bandarulo-shakti-pataalu/

Sunday, September 7, 2014

పోర్ బందర్ మీదుగా రెండు జ్యోతిర్లింగాల దర్శనం!

వీలైనన్ని పర్యాటక కేంద్రాలు చూడాలన్నది నా ఆశ. ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవాలన్నది మా బావగారి కోరిక. దాంతో మా రెండు కుటుంబాల అభిరుచికి తగ్గట్టుగా గుజరాత్ లోని సోమనాథ, నాగేశ్వరం జ్యోతిర్లింగాల పర్యటనను ఆయన గమ్మత్తుగా ప్లాన్ చేశారు. మాతో పాటు బావగారి చిరకాల మిత్రుడు, పొద్దుటూరుకు చెందిన రంగస్వామి గారి కుటుంబం  కూడా జత కలవడంతో పిల్లాపెద్దా కలిపి మొత్తం పదిహేను మందిమి అయ్యాం.
హైదరాబాద్ నుండి శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరే రాజ్ కోట్ ఎక్స్ ప్రెస్ లో రిజర్వేషన్ చేయించుకున్నాం. దాదాపు ఇరవై నాలుగు గంటల ప్రయాణం తర్వాత ఆదివారం మధ్యాహ్నం రెండున్నరకు రైలు అహ్మదాబాద్ కు చేరింది. రైల్వే స్టేషన్ లోని రెస్ట్ రూమ్ లో కాలకృత్యాలు తీర్చుకుని, సబర్మతీ ఆశ్రమంకు బైలుదేరడంతో మా యాత్ర మొదలైందని చెప్పాలి.
అహ్మదాబాద్ స్టేషన్ నుండి నాలుగు మైళ్ళ దూరంలో సబర్మతి నది ఒడ్డున ఉందా ఆశ్రమం. బయట నుండి చూడటానికి సాదా సీదాగా కనిపించినా… లోపలికి అడుగుపెట్టిన తర్వాత కానీ దాని గొప్పతనం మాకు అర్థం కాలేదు. గాంధీజీకి చెందిన ఛాయాచిత్రాలతో ఆ ఆశ్రమం మాకు స్వాగతం పలికింది. అంతేనా… ఆయన ఉపయోగించిన చేతికర్ర, ధరించిన చెప్పులు, నూలు వడికిన రాట్నం వంటివి  అక్కడ ప్రదర్శనకు ఉంచారు. వీటన్నిటింకంటే మమ్మల్ని అమితంగా ఆకట్టుకుంది. ఆయన నివసించిన హృదయ్ కుంజ్! గాంధీ ఉపయోగించిన గదికి తాళం వేసినా… ఆశ్రమంలో అతిథులు కూర్చొనే స్థలం, కస్తూరీబా గది, ఆమె వంటచేసిన ప్రదేశమూ వంటివి చూడగలిగాం. 1917 నుండి దండి ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించే వరకూ గాంధీ సబర్మతీ ఆశ్రమంలో ఉంటూనే తన కార్యకలాపాలను నిర్వర్తించారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ సబర్మతీ ఆశ్రమంలో కాలు పెట్టనని చెప్పి మరీ బయలు దేరిన ఆయన, స్వాతంత్రానంతరం ఆరు మాసాల్లోనే హత్యకు గురికావడంతో అక్కడకు తిరిగి రాలేకపోయారన్న విషయం తెలిసి మనసు విలవిలలాడింది.
హృదయ్ కుంజ్ వసారాలోనే ఓ పెద్దాయన రాట్నం ఎలా వడకాలో విదేశీయులకు ఓపికగా చూపెడుతుంటే ముచ్చటేసింది. భారత స్వతంత్రోద్యమంలో గాంధీజీ పాత్రను మననం చేసుకుంటూ ఆశ్రమానికి వీడ్కోలు పలికాం. రైల్వే స్టేషన్ కు వెళ్ళే దారిలో ఉన్న స్వామినారాయణ మందిరాన్ని, జైన్ టెంపుల్ ను వీక్షించాం. ఆ రోజు రాత్రి పది గంటలకు అహ్మదాబాద్ నుండి విరావల్ కు మా రైలు ప్రయాణం మొదలైంది.
త్రివేణీ ఘాట్ లో జలకాలాటలు!
ఆదివారం రాత్రి అహ్మాదాబాద్ లో ఎక్కిన రైలు సోమవారం ఉదయం ఏడు గంటలకు విరావల్ కు చేరింది. అక్కడ నుండి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సోమనాథ్ కు ఆటోలో బయలుదేరాం. దారిపొడుగుతా మాకు వందల సంఖ్యలో ఫిషింగ్ బోట్స్ కనిపించాయి. ప్రతి బోటు మీద మువ్వన్నెల జండా ఎగరడంతో పాటు స్కూల్ పిల్లలు యూనిఫామ్ ధరించినట్టుగా ఆ బోట్లన్ని ఒకే రంగులో ఉండటం విశేషం. బహుశా ఇవి భారతదేశానికి చెందినవని గుర్తించడం కోసం అలా చేశారేమోనని పించింది. ఇక సోమనాథ మందిర స్వాగత ద్వారం దాటి ముందుకు సాగే సరికీ అప్పటి వరకూ విశాలంగా ఉన్న రోడ్లు సన్నగా కుచించుకుపోయి కనిపించాయి. ఆటో వెనుక ఆటో వెళ్ళాల్సిందే తప్పితే… ఓవర్ టేక్ చేసే ప్రసక్తే లేదు.
సోమనాథ మందిరానికి దగ్గరలోనే మా బసకు ఏర్పాట్లు జరిగాయి. పక్కనే ఉన్న సముద్రంలో మూడు మునకలు వేయాలనే కోరిక బలంగాఉన్నా, జోరుగా కురుస్తున్న వర్షాల కారణంగా కలెక్టర్ అందుకు అనుమతించడం లేదని, కావాలంటే దగ్గరలో ఉన్న త్రివేణీ ఘాట్ కు తీసుకెళతానని మా ఆటో డ్రైవర్ చెప్పాడు. బసలో కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత అందరం ఛలో అంటూ అటుకేసి బయలుదేరాం. దట్టమైన చెట్ల మధ్య నుండి త్రివేణీ ఘాట్ వైపు వెళుతుంటే… పురివిప్పిన నెమళ్ళు అనేకం మాకు కనుల విందు చేశాయి.  
ఘాట్ స్వాగత తోరణం నుండి లోపలకు వెళ్ళగానే… ఎదురుగా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ విగ్రహం కనిపించింది. 1967 నుండి 1995 వరకూ శ్రీ సోమనాథ ట్రస్ట్ అధ్యక్షుడిగా మొరార్జీదేశాయ్ బాధ్యతలను నిర్వర్తించారు. దేవాలయంతో పాటు ఈ ఘాట్ అభివృద్ధికి కృషి చేసినందుకు గానూ ఆయన విగ్రహాన్ని 2006లో ఆవిష్కరించారట. అక్కడ నుండి బోటులో త్రివేణీ సంగమ స్థలికి బయలు దేరాం.  రెండు కిలోమీటర్ల దూరంలో కపిల, హిరణ్య, సరస్వతి నదులు కలుస్తాయని బోటులోవాళ్ళు చెప్పారు. అంతర్వాహినిగా ఉన్న సరస్వతి మాట ఏమోగానీ, కపిల, హిరణ్య నదుల నీళ్ళు వేర్వేరు రంగుల్లో ఉండటంతో వాటి సంగమం చాలా స్పష్టంగా మాకు కనిపించింది. అక్కడ నుండి ఒడ్డుకు వచ్చి కాసేపు ఆ నదీతీరంలో జలకాలాడాం. ఆ తర్వాత దగ్గరలో ఉన్న గీతామందిరానికి వెళ్ళాం. శ్రీకృష్ణ పరమాత్ముని సోదరుడు, యాదవ రాజు బలరాముడు అవతారం చాలించిన పుణ్య తీర్థం అది. ఓ చిన్న గుహలో బలరాముడి విగ్రహం దర్శనమిచ్చింది. అక్కడ నుండే ఆయన ఆదిశేషుగా మారి అంతర్థానం అయ్యాడని అక్కడి వారు చెప్పారు.  శ్రీకృష్ణుడు కూడా తన అవతారాన్ని చాలించే సమయంలో అక్కడికే వచ్చాడని చెబుతూ, ఆయన పాదపద్మాలను చూపించారు. ఆ పక్కనే ఉన్న లక్ష్మీనారాయణ మందిరాన్నీ వీక్షించి, సోమనాథకు తిరిగి బయలుదేరాం.
హరహర మహాదేవ శంభో శంకర!
ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొట్టమొదటిది సోమనాథ. ముక్కంటి సోమనాథునిగా వెలసిన కథ స్కాంద పురాణంలో ఉంది. బ్రహ్మదేవుని మానసపుత్రుడైన దక్షప్రజాపతికి అశ్విని నుంచి రేవతి వరకు 27 మంది కుమార్తెలున్నారు. తన కుమార్తెలను చంద్రునికి ఇచ్చి ఘనంగ వివాహం జరిపించాడు దక్షుడు. అయితే చంద్రుడు రోహిణిని మాత్రం అనురాగంతో చూస్తూ, మిగిలినవారిని అలక్ష్యం చేయసాగాడు. మిగిలినవారు తండ్రితో ఈ విషయాన్నీ మొరపెట్టుకోగా, దక్షుడు అల్లుడైన చంద్రుడిని మందలిస్తాడు. అయినప్పటికీ, చంద్రుని ప్రవర్తనలో మార్పురాకపోవడంతో, క్షయ రోగగ్రస్తుడవు కమ్మని చంద్రుని శపిస్తాడు దక్షుడు. ఫలితంగా చంద్రుడు క్షీణించసాగాడు. చంద్రకాంతి లేకపోవడంతో ఔషధాలు, పుష్పాలు ఫలించలేదు. ఈ పరిస్థితిని చూసిన సమస్త లోకవాసులు, తమ కష్టాలు తీరేమార్గం చూపమని బ్రహ్మ దేవుని ప్రార్థించారు. బ్రహ్మ ఆదేశాన్ననుసరించి ప్రభాస క్షేత్రంలో మహామృత్యుంజయ మంత్రానుష్ఠానంగా శంకరుని ఆరాధించిన చంద్రుడు, పార్థివలింగాన్ని ప్రతిష్టించి పూజించగా, శంకరుడు ప్రత్యక్షమై, చంద్రుని రోగ విముక్తుని గావించి, కృష్ణపక్షంలో చంద్రకళలు రోజు రోజుకీ తగ్గుతాయనీ, శుక్లపక్షంలో దిన మొక కళ చొప్పున పెరుగుతుందని అనుగ్రహించాడు. ఆనాటి నుండి చంద్రుని కోరిక మేర, అతని కీర్తి దశదిశలా వ్యాపించేందుకై చంద్రుని పేరుతో సోమనాథునిగా, జ్యోతిర్లింగరూపునిగా పార్వతీదేవిసమేతంగా వెలసి భక్తులను కరుణిస్తున్నాడని ఆ పురాణంలో పేర్కొన్నారు.
సోమనాథ మందిరానికి బలమైన చారిత్రక నేపథ్యం కూడా ఉంది. ఈ దేశంపై దండయాత్ర చేయడానికి వచ్చిన ఎంతోమంది పరాయి రాజులు, పాలకులు సోమనాథ దేవాలయాన్ని అనేక పర్యాయాలు ధ్వంసం చేశారు. దాడి జరిగిన కొద్ది రోజులకే తిరిగి స్థానికులు ఇక్కడి శివలింగాన్నిప్రతిష్ఠించుతూ వచ్చారు. అలా మొత్తం ఏడు సార్లు ఇక్కడ సోమనాథుడి విగ్రహం పునః ప్రతిష్ఠించబడింది. భారతదేశం స్వేచ్ఛావాయువులను పీల్చుకున్న తర్వాత జూనాఘఢ్ సంస్థానాన్ని విలీనం చేయించడానికి అక్కడకు వచ్చిన అప్పటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్, సోమనాథ మందిరాన్ని పునర్నించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. మందిర ప్రాంతంలో ఉన్న మసీదును కొంత దూరానికి తరలించారు. 1951లో మందిర పునర్నిర్మాణానికి భూమి పూజ చేసిన అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ ‘ధ్వంసం కంటే పునర్నిర్మాణంలోని గొప్పతనానికి సోమనాథ దేవాలయం తార్కాణంగా నిలుస్తుంద’ని చెప్పడం విశేషం. సర్థార్ వల్లభాయ్ పటేల్ మరణానంతరం మందిర నిర్మాణ బాధ్యతలను మరో కేంద్ర మంత్రి కె.ఎం. మున్షీ తన భుజస్కందాలపై వేసుకున్నారు. సుదీర్ఘ కాలం సాగిన ఈ మందిర పునర్నిర్మాణం 1995తో పూర్తయ్యింది. అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ సోమనాథ దేవాలయాన్ని జాతికి అంకితమిచ్చారు.
ప్రస్తుతం ఉన్న సోమనాథ మందిరానికి ఎడమవైపున రాణీ అహల్యాబాయి నిర్మించిన శివాలయం ఉంది. 1783లో ఆమె దీనిని నిర్మించారు. అక్కడ దర్శనం చేసుకుని, ఆ తర్వాత సోమనాధుడి దగ్గరకు వెళ్ళాలని స్థానికులు చెప్పడంతో అలానే చేశాం. సోమనాథ దేవాలయాన్ని వీక్షించడానికి రెండు కళ్లు సరిపోవంటే అతిశయోక్తి కాదు! సముద్రపు హోరు ఒకవైపు, ఆ సాగరుడిని కట్టడి చేస్తూ వేసిన పెద్దపెద్ద నల్లని రాళ్ళను తాకుతూ ఎగడిసడే అలల నుండి చిందే చిరుజల్లుల చల్లదనం మరోవైపు, ఆ ఆహ్లాదకర వాతావరణంలో ‘హర హర మహాదేవ’ అంటూ మది గదుల్లో ప్రతిధ్వనించే శివనామస్మరణ ఇంకోవైపు… వీటన్నింటినీ ఆస్వాదిస్తూ, దేవాలయ ప్రధాన ద్వారంలోకి ప్రవేశించగానే సోమనాథుని దర్శన భాగ్యం కలిగింది. అయితే ఇక్కడ శివలింగాన్ని తాకడం, దానికి స్వయంగా అభిషేకం చేయడం కుదరని పని. కాస్తంత దూరం నుండే ఆ ముక్కంటికి నమస్కరించి వెనుదిరిగాం. దేవాలయానికి వెనకగా ఉన్న  అరేబియా సముద్ర తీరాన్ని చూస్తుంటే భారతదేశానికి ఇటు పక్క ఉన్న మా స్వగ్రామం మచిలీపట్నంలోని బంగాళాఖాతం గుర్తొచ్చింది. దేశంలోని తూర్పు తీరం నుండి పడమర తీరానికి వచ్చి ఇక్కడి సముద్రాన్ని వీక్షించడం థ్రిల్ గా అనిపించింది. సోమనాథుడి దర్శనానంతరం భోజనం కానిచ్చి, చుట్టుపక్కల ప్రాంతాల్లోని దర్శనీయ స్థలాలను చూసేందుకు బైలుదేరాం.
కృష్ణావతారం చాలించిన చోటు!
విరావల్ నుండి సోమనాథ దేవాలయానికి వచ్చే దారిలోనే ప్రభాస పట్టణం ఉంది. అక్కడే శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారాన్ని చాలించాడని స్థానికులు తెలిపారు. యాదవరాజుల మధ్య సాగిన అంతర్యుద్ధాల కారణంగా ఖిన్నుడైన శ్రీకృష్ణ పరమాత్మ ప్రభాస పట్టణం చేరుకున్నాడట. ఓ రోజు రావి చెట్టు నీడలో కాలు మీద కాలు వేసుకని యోగసమాథిలో పరుండగా, ఆయన కాలి బొటనవేలును చూసి, జంతువుగా భ్రమించిన జరా అనే వేటగాడు విల్లు ఎక్కుపెట్టి బాణం వేశాడట! ఆ తర్వాత తాను చేసిన పొరపాటు గ్రహించి, మన్నించమని శ్రీకృష్ణుడిని శరణు వేడుకోగా… ఇదంత తన ఇఛ్ఛాపూర్వకంగానే జరుగుతోందని, బాధపడవద్దని శ్రీకృష్ణుడు సెలవిచ్చి, అవతారం చాలించాడని పురాణాలు చెబుతున్నాయి. ప్రభాస పట్టణంలోని శ్రీ భాలకా తీర్థంలో పవళించిన శ్రీకృష్ణుని విగ్రహంతో పాటు శరాన్ని సంధించిన వేటగాడి ప్రతిమ కూడా ఉంది.  శ్రీకృష్ణుని విగ్రహం చెంతనే ఓ రావిచెట్టు ఉంది. దాని నీడలోనే వటపత్రశాయి పవళించాడని అక్కడి వారు చెప్పారు.  ఈ తీర్థస్థలి పక్కనే ప్రజాపిత ఈశ్వరీయ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయంకు చెందిన ఆర్ట్ గ్యాలరీని చూసి… ఆ రాత్రి సోమనాథుడి హారతి సేవకు హాజరయ్యాం.
మంగళవారం ఉదయానే అహల్యాబాయి నిర్మిత శివాలయంలో శివలింగానికి అభిషేకం చేసి, ఆ తర్వాత ముచ్చటగా మూడోసారి సోమనాథుడిని  దర్శనం చేసుకుని, ద్వారక దిశగా ప్రయాణం మొదలు పెట్టాం! ద్వారకకు రైలు మార్గం ఉన్నా, దారిలో పోర్ బందర్ లోని గాంధీజీ ఇంటిని చూడాలన్నది మా ఆలోచన. అందుకే  ప్రైవేటు వాహనంలో బైలు దేరాం. సోమనాథ నుండి ద్వారక వెళ్ళే రోడ్డు మార్గం సముద్రపు ఒడ్డునే సాగుతుంది. దారిపొడుగునా ఉన్న విండ్ మిల్స్ ను చూస్తే… గుజరాత్ లో విద్యుత్ కొరత ఎందుకు లేదో అర్థమైంది. మార్గం మధ్యలో అవకాశం ఉన్న చోటల్లా సముద్ర తీరంలో కాసేపు ఆటలాడి తిరిగి ప్రయాణం కొనసాగించాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత దీరుభాయ్ అంబాయ్ స్వస్థలం చోర్వాద్ మీదుగా మా ప్రయాణం సాగింది. మధ్యాహ్యం రెండు గంటల ప్రాంతంలో పోర్ బందర్ లోకి మా వాహనం అడుగుపెట్టింది.
గాంధీ మహాత్ముడు పుట్టిన ఇంటిలోకి అడుగుపెడుతుంటే ఒడలు పులకరించాయి. గుజరాత్ లోని మారు మూల పల్లెలో పుట్టిన ఓ వ్యక్తి… యావత్ భారత జాతినీ మేల్కొలపడం అంటే మాటలా! అదీ అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాల ద్వారా! ఆ ఘనకార్యాన్ని నిర్వర్తించిన వ్యక్తిగా ప్రతి ఒక్కరికీ గాంధీజీపై అపరిమిత గౌరవం ఉండటం సహజం. అందుకే ఆయన జన్మించిన ఇల్లు ఇవాళ దర్శనీయ స్థలంగా మారింది. భారతదేశంలోని కొన్ని లక్షల గ్రామాలలో, మరుమూల పల్లెల్లో గాంధీజీ విగ్రహం ఉందంటే అతిశయోక్తి కాదు. ఆయన ఇంటి వీధి మొదట్లో ఉన్న గాంధీజీ విగ్రహం మమ్మల్ని ఎంతో ఆకట్టుకుంది.
నిజానికి పూర్వకాలంలో పోర్ బందర్ ను సుధామపురి అని పిలిచేవాళ్ళు. శ్రీకృష్ణుడి స్నేహితుడు సుధాముడు పుట్టిన ఊరు ఇదే!  గాంధీజీ ఇంటికి కొద్ది దూరంలోనే సుధాముడి స్మృతి మందిరం ఉంది. 12, 13వ శతాబ్దంలో చిన్నగా ఉన్న ఈ మందిరాన్ని 1900 సంవత్సరంలో పోర్ బందర్ కు చెందిన మహారాజా భావసింహజీ పునర్ నిర్మించారు. ఇదే ప్రాంగణంలో చాముండి మాత కొలువై ఉంది. ఆ తల్లిని దర్శించుకుని ద్వారకకు బయలుదేరాం.
అదిగో ద్వారక…
శ్రీకృష్ణుని పాదస్మర్శతో పునీతమైన భూమి ద్వారక. జరాసంధుడి బారినుండి యాదవులను రక్షించడం కోసం శ్రీకృష్ణుడు ఈ నగరాన్ని నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించిన తర్వాత ద్వారక సముద్రంలో మునిగిపోయిందంటారు. సూర్యాస్తమయానికి కాస్తంత ముందుగా ఆ నగరానికి మేం చేరుకున్నాం. హోటల్లో కాలకృత్యాలు తీర్చుకుని, ద్వాదశ జ్యోతిలింగాలలో ఆరవది అయిన నాగేశ్వర క్షేత్రానికి బయలుదేరాం. ద్వారక కు సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో అది ఉంది. ఈ క్షేత్రం గురించి పురాణాలలో ఇలా చెప్పబడింది. పశ్చిమ సముద్ర తీరాన, దారుకుడనే రాక్షసుడు, తన భార్య దారుకతో కలిసి ప్రజలను చిత్రహింసలకు గురిచేశాడట. యజ్ఞయాగాదులను నాశనం చేస్తూ, ముని జనులను హింసించాడట. వీరి హింసను తట్టుకోలేని ఋషులు ఔర్వమహర్షికి విన్న వించుకున్నారట. ఔర్వమహర్షి ఆ రాక్షస దంపతులను సతీసమేతంగా మరణించునట్లుగా శపించాడు. ఆ మునిశాపం భూమి పైనే పనిచేస్తుంది. కనుక, రాక్షదంపతులు సముద్రమధ్యంలో నివాసమేర్పరుచుకుని సముద్రయానం చేసేవారిని పీడించసాగారు. ఇలా కనబడిన ప్రయాణీకులందరి ధనవస్తువులను అపహరిస్తూ చెరసాలలో బంధించసాగారు. అలా బంధింపబడినవారిలో సుప్రియుడొకడు. ఇతడు పరమ శివభక్తుడు. రాక్షసబాధలను తట్టుకోలేక సుప్రియుడు ఆర్తనాదం చేయగా, దివ్యతేజః పుంజం కళ్ళు మిరిమిట్లు గొలుపుతూ ప్రకాశించింది. ఆ కాంతికి దారుకునితో పాటు సమస్త రాక్షసులు నేలకొరిగారు. అక్కడ పరమశివుడు నాగరూపమై జ్యోతిర్లింగమైవెలిశాడు. ఈ స్వామిని దర్శించి, సేవించుకున్నవారికి శాశ్వత పుణ్యలోకవాసం సిద్ధిస్తుందని ప్రతీతి. ఈ నాగేశ్వర జ్యోతిలింగ క్షేత్రం పక్కనే నలభై అడుగుల ఎత్తైన సింహ పీఠంపై 85 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహం ఉంది. ప్రసన్న వదనుడైన ఆ శివుడి విగ్రహం చుట్టూ ఓంనమః శివాయ అంటూ ఐదు సార్లు ప్రదక్షిణ చేస్తే… అనుకున్న కోరికలు నెరవేరతాయని స్థానికులు తెలిపారు.
నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనానంతరం… అక్కడికి సమీపంలోని రుక్మిణీ మందిరానికి వెళ్ళాం. ఆ మందిరంలోనే ఓ పక్కన రామనామం రాసిన రాయి నీటిలో తేలుతూ కనిపించింది. ఆ చెంతనే గోపీ తలాబ్ ఉంది. అక్కడే కృష్ణుడు గోపికలతో జలక్రీడలాడాడని అక్కడి వారు చెప్పారు. అక్కడి నుండి తిరిగి ద్వారక చేరుకున్నాక… కాస్తంత సమయం ఉండటంతో శ్రీకృష్ణ దర్శనానికీ వెళ్ళాం. అయితే మందిరంలో కృష్ణుడు పక్కన రుక్మిణీమాత లేకపోవడం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అలానే పట్టపు రాణుల భవంతిలోనూ రుక్మిణి విగ్రహం కనిపించలేదు. దానికి కారణం ఏమిటనేది ఆ మర్నాడు కానీ మాకు తెలియలేదు!
బుధవారం ఉదయాన్నే మా ద్వారక నగర పర్యటన రుక్మిణీదేవి మందిర దర్శనంతో మొదలైంది. ఆ మందిరానికీ ఓ కథ ఉంది. ఓసారి కృష్ణుడు దుర్వాస మహామునిని ఆతిథ్యం స్వీకరించమని ఇంటికి పిలిచాడట. అతిథి భోజనం పూర్తయ్యే వరకూ ఆ ఇంటిలో మరెవ్వరూ ఏమీ ముట్టడానికి వీల్లేదన్నది అప్పటి నియమం. అయితే దుర్వాసుడు భోజనం చేస్తున్న సమయంలో రుక్మిణికి దాహం వేసి, కృష్ణుడిని నీళ్ళు ఇవ్వమని అర్థించిందట. దుర్వాసుడు చూడటం లేదనే నమ్మకంతో కృష్ణుడు కాలి బొటనవేలుని నేలపై నొక్కి పెట్టి పాతాళ గంగను పైకి తీసుకొచ్చి రుక్మిణి దాహం తీర్చాడట. దానిని చూసిన దుర్వాస మహాముని, రుక్మిణి మీద కోపంతో భార్యభర్తలిద్దరూ పన్నెండు సంవత్సరాల పాటు వేరువేరుగా ఉండాలని శపించాడట. అందుకే ద్వారకలోని ప్రధాన దేవాలయంలో కృష్ణుడి పక్కన రుక్మిణి దేవి ఉండదని, అలానే రుక్మిణి దేవి మందిరంలో కృష్ణుడు కనిపించడని అక్కడి పూజారి చెబుతుంటే విన్నాం.
అక్కడి నుండి బెట్ ద్వారకకు బయలుదేరాం. ద్వారకకు 30 కి.మీ. దూరంలో ఉన్న ఓఖా నుండి బోటులో బెట్ ద్వారకకు వెళ్ళాల్సి ఉంటుంది. ద్వీపంలో ఉండే శ్రీకృష్ణుని దేవాలయ దర్శనం కూడా ఎంతో పవిత్రమైనదిగా అక్కడి ప్రజలు భావిస్తారు. దాదాపు వందమందిని ఎక్కించుకుని ఓఖా నుండి బెట్ ద్వారకకు మా బోటు బయలుదేరింది. ఆ ద్వీపంలో కాస్తంత ఎత్తుమీద కృష్ణ మందిరం ఉంది. అందులోని కృష్ణుడి విగ్రహాన్ని రుక్మిణీదేవి వియోగ సమయంలో స్వయంగా ఇసుకతో చేసిందట.  బెట్ ద్వారకలోని కృష్ణమందిరం బయట పోలీసులు పహార కాయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. సహజ ఓడరేవు కూడా అయిన బెట్ ద్వారక చారిత్రకంగానూ ప్రధానమైనది. బహుశా అందుకే అక్కడ అంత కట్టుదిట్టమైన పోలీస్ పోస్ట్ ను ఏర్పాటు చేశారనిపించింది. బెట్ ద్వారకలోని దేవాలయ సముదాయాన్ని వీక్షించి, అక్కడ నుండి తిరిగి ద్వారకకు నాగేశ్వరం మీదుగా బయలుదేరాం. మేం అక్కడకు చేరేసరికీ హారతి కార్యక్రమం జరుగుతోంది. అది పూర్తికాగానే స్వయంగా నాగేశ్వరుడికి అభిషేకం చేసే అవకాశం మాకు కలిగింది. సోమనాథ క్షేత్రంలో తీరని కోరిక ఇక్కడ ఇలా నెరవేరడంతో మా బావగారి ఆనందానికి అవధులు లేవు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లోని మరోదానికి ఆయన స్వయంగా అభిషేకం చేయడంతో ఈ యాత్ర సఫలీకృతమైందిగా భావించారు. అక్కడ నుండి ద్వారకకు తిరుగుప్రయాణమయ్యాం.
ఆ సాయంత్రం భారతదేశానికి పశ్చిమాన సముద్రంలోకి జారిపోయే సూర్యగోళాన్ని కళ్ళారా చూడాలనే కోరిక మాకు కలిగింది. సాయంత్రం ఐదు గంటలకు సన్ సెట్ పాయింట్ కు వెళ్ళాం. అక్కడి పురాతన మందిరంలోని శివుడికి నమస్కరించి, సముద్ర తీరం వైపు దృష్టి సారించాం. సముద్ర మట్టానికి దాదాపు రెండు వంద అడుగుల ఎత్తులో ఉన్న మా మీదకు అలలు విరుచుకుపడుతుంటే… ఓ క్షణం భయం వేసింది. మందిరానికి అడ్డుగా వేసిన రాళ్ళను ఢీ కొడుతూ అలలు అంతెత్తున ఎగసి పడుతూ… మమ్మల్ని తడిపేస్తుంటే హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన దురదృష్టకర సంఘటన జ్ఞప్తికి వచ్చింది. ప్రకృతికి ఎదురీది మనిషి ఏమీ చేయలేడని, దానితో పాటు సహజీవనం చేయాల్సిందేననే విషయం బోధపడింది. అదే రోజు రాత్రి ద్వారక నుండి రోడ్డు మార్గంలో బయలు దేరి, గురువారం ఉదయానికి రాజ్ కోట్ చేరాం. అక్కడ నుండి ఉదయం ఐదు గంటలకు బయలుదేరిన రాజ్ కోట్- సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ లో మాకు రిజర్వేషన్ జరిగింది. శుక్రవారం ఉదయం పదిగంటలకు సికింద్రాబాద్ కు చేరుకోవడంతో ద్వాదశ జ్యోతిర్లింగాల్లోని మరో రెండు పుణ్య క్షేత్రాల దర్శనం పూర్తయినట్టయింది! ఇరవై నాలుగు గంటలపాటు సాగిన తిరుగు రైలు ప్రయాణంలో గడిచిన నాలుగు రోజుల యాత్రావిశేషాలను తలుచుకుంటూ, ప్రయాణ బడలికనూ తీర్చేసుకున్నాం. ఆ రకంగా గాంధీ నడయాడిన పుణ్యభూమి మీదుగా ద్వాదశ జ్యోతిర్లింగాల్లోని రెండింటిని దర్శించుకున్నాం.
                                                      ...........
          సోమనాథ దేవాలయం... ఎదురుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ నిలువెత్తు విగ్రహం

                             అహ్మదాబాద్ లోని సబర్మతీ ఆశ్రమ ముఖద్వారం

     సోమనాథ దేవాలయం నుండి త్రివేణీ సంగమానికి వెళ్ళే దారిలో ఎదురైన జాతీయ పక్షి! 
  
                  త్రివేణీ సంగమ స్థలికి సమీపంలోని బలరామ అంతర్థాన స్థలం

               త్రివేణీ సంగమ స్థలిలో మా చినబావ బాలసుబ్రహ్మణ్యం ఆనంద హేల!

                    సబర్మతీ ఆశ్రమంలో గాంధీ విగ్రహం చెంతన మా చిరంజీవులు

           సోమనాథ పక్కనే ఉన్న అహల్యాబాయి నిర్మిత దేవాలయంలోని శివలింగం

                       పోర్ బందర్ లోని మహాత్మ గాంధీ ఇంటి ముఖద్వార చిత్రం

                     నా శ్రీమతి మాధవితో గాంధీజీ పుస్తక పఠన మందిరంలో....

                                ద్వారక సమీపంలోని నాగేశ్వర జ్యోతిర్లింగం

                      నాగేశ్వర జ్యోతిర్లింగం పక్కనే ఉన్న మహా శివుని భారీ విగ్రహం

                  గుజరాతీ ప్రయాణీకుల ఆటోని డ్రైవ్ చేస్తున్న చిరంజీవి కార్తికేయ

                             ద్వారక సమీపంలోని రుక్మిణీమాత మందిరం

                                మర పడవలో బెట్ ద్వారకకు వెళుతూ....

                      ప్రభాస పట్టణంలోని నిర్యాణ స్థలంలో శ్రీకృష్ణుడి విగ్రహం

                ద్వారకలోని సన్ సెట్ పాయింట్ దగ్గర అరేబియా సముద్ర తీరంలో....


                                   ద్వారకలోని శ్రీకృష్ణ మందిరం



-      వడ్డి ఓంప్రకాశ్ నారాయణ