50 యేళ్ళకూ చెక్కుచెదరని ‘నర్తనశాల’
అత్యంత సుందరాంగుడు నందమూరి తారకరామారావు పేడి ముఖంతో వెండితెరపై
కనిపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా!?
వయసుకు మించిన శరీరభారంతో ఉన్న సావిత్రిని పాండవుల సతీమణి ద్రౌపతిగా
సినీ వీక్షకులు అంగీకరించగలరా!?
అహంకారానికి, అధికార దర్పానికి నిలువెత్తు నిదర్శనంగా ఎస్వీరంగారావును
తెలుగువారు ఊహించుకోగలరా!?
సాంఘికాలను రూపొందించి, విజయం సాధించిన కమలాకర కామేశ్వరరావు పౌరాణిక
గాథకు న్యాయం చేయగలరా!?
ఈ ప్రశ్నలన్నింటికి లభించిన చక్కని సమాధానం ‘నర్తనశాల’!
తెలుగువారికి మాత్రమే వరమైన పద్యం తొలిటాకీ చిత్రాలలో విరివిగా వినిపించేది.
అటువంటి పద్యాలు, అద్భుతమైన పాటల సమాహారంగా తెరకెక్కిన సినిమా ‘నర్తనశాల’!
రాజ్యం పిక్చర్స్ బ్యానర్ లో శ్రీధరరావు,లక్ష్మీ రాజ్యం నిర్మించిన
ఈ సినిమా 11 అక్టోబర్, 1963న విడుదలై, అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇవాళతో యాభై
వసంతాలను పూర్తి చేసుకుంది. తెలుగు సినిమా ఖ్యాతిని, తెలుగు నటుని సత్తాను ప్రపంచదేశాలకు
తెలియచేసిన సినిమాగా ‘నర్తనశాల’ చరిత్రలో నిలిచిపోయింది.
భారతీయులకు సంస్కృతి, సంప్రదాయాలంటే ఎనలేని మక్కువ అనే విషయం అందిరికీ
తెలిసిందే. అందుకే సినిమా మాధ్యమంలోనూ వాటికే మనవాళ్ళు అధిక ప్రాధాన్యమిచ్చారు. మూకీ
సమయంలోనే కాదు… టాకీలు ప్రారంభమైనా అదే ఒరవడి
కొనసాగింది. నర్తనశాల కథాంశంతోనే 1918లోనటరాజ మొదలియార్ ‘కీచకవధ’ పేరుతో ఓ
మూకీ తీశారు. 1937లో ‘విజయదశమి లేక
కీచకవధ’ పేరుతోనూ ఓ టాకీ చిత్రం వచ్చింది.
నిజానికి కీచకవథ’ కథను ఇప్పుడు తలుచుకుంటే ఇది
చిరపురాతనం నిత్యనూతనం అనిపిస్తుంది. ఇప్పటికీ ఇదే ఫార్ములాలో భారతీయ సినిమాలు తెరకెక్కుతుండటం
విశేషం. మాయాజూదంలో కౌరవుల చేతిలో ఓడిపోయినందుకు గానూ పన్నెండేళ్లు అరణ్యవాసం, ఆపై
ఓ యేడాది అజ్ఞాతవాసం చేయడానికి అంగీకరించిన పాండవులు, చివరి యేడాది విరాట రాజు కొలువులో
మారువేషాలతో గడిపిన సందర్భంలో జరిగే కథే ఈ చిత్రం!
పౌరాణిక పాత్రలంటే ప్రాణం పెట్టే ఎన్టీయార్ తో పాండవమధ్యముడు అర్జునిడి
పాత్ర చేయించాలనుకున్నారు. అందులో ఇబ్బందిలేదు. అయితే ఆ అర్జునుడు ఇప్పుడే ధనుర్ధారి
కాదు, నాట్యాచార్యుడు అదీ ఆడామగా కానీ వ్యక్తి! ఆ పాత్రను చేయమని ఎన్టీయార్ ను అడగడానికి
ఎంత సాహసం కావాలి. అయినా ఆయనతో ఉన్న పరిచయం,చనువుతో లక్ష్మీరాజ్యం, శ్రీధరరావు దంపతులు
ఎన్టీయార్ ను కలిసి, సంప్రదించారు. తొలుత ఆయన
సందేహించినా, కళాదర్శకుడు టివియస్ శర్మ వేసిన చిత్రాలను చూసి తన అంగీకారం తెలిపారు.
అలానే బృహన్నల వేషధారణను తన అభిమాన దర్శకుడు కె.వి. రెడ్డికి చూపించి, ఆయన భేష్ అన్నతర్వాతనే
ముందుకెళ్ళారు ఎన్టీయార్. అలానే ద్రౌపదిగా నటించిన సావిత్రి సైతం ముందు ససేమిరా అన్నారు.
అంతకుముందు ఈ సంస్థ నిర్మించిన ‘సంసారం’ చిత్రం నుండి ఆమెను తొలగించడంతో కినుక వహించారు. తాను కాస్త లవుగా ఉన్నానంటూ సాకు చూపించారు. కానీ
దర్శక నిర్మాతల ఒత్తిడి, ఎన్టీయార్ ప్రోత్సాహం కారణంతో ఆమె కాదలేక ద్రౌపది పాత్ర పోషణకు
సుముఖత వ్యక్తం చేశారు. ఇక కీలకమైన కీచకుడి పాత్రకు ఎస్వీయార్ ఎన్నుకోవడంతో దర్శక నిర్మాతలకు
ఉన్న దూరదృష్టి ఏమిటో అందరికీ అర్థమైపోయింది. కీచకుడిగా ఎస్వీయార్ తెరపై కనిపించేది
కొద్దిసేపే అయినా, తన ప్రతిభాపాటవాలతో ఆయన ప్రేక్షకుల్ని విస్మయానికి గురిచేశారు. అయితే
కేవలం నటీనటుల ఎంపికతోనే విజయలక్ష్మి నర్తనశాలలో నర్తించలేదన్నది వాస్తవం. సాంకేతిక
నిపుణుల ప్రతిభ, నటీనటుల అంకితభావానికి తోడైంది. నృత్యంలో అనుభవంలేని ఎన్టీయార్ నాట్యాచారుడిగా
నటించడం కోసం ఎంతో కృషి చేశారు. పైగా ఎల్.
విజయలక్ష్మి లాంటి చక్కని నృత్యకళాకారిణికి తాను నాట్యం నేర్పు తున్నట్టు నటించాలంటే
కొంత సాధన అవసరమని ఆయన భావించారు. అందుకనే వెంపటి పెదసత్యంగారి వద్ద నెల రోజుల పాటు
నాట్యాన్ని అభ్యసించారు. సావిత్రి అయితే ద్రౌపది పాత్రలో లీనమైపోయారు. తండ్రికి అంతగా ఆరోగ్యం బాగోకపోవడంతో సముద్రాల జూనియర్
కీచక స్వగతానికి సంభాషణలు రాశారు. ‘సంధాన సమయమైనది.. ఇంకనూ సైరంధ్రి రాలేదే’ అంటూ సాగే ఆ మాటలను చదివి ఎస్వీయార్ పరమానందభరితులైపోయారు.
ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేశారు. ఈ సినిమాలో మరో కీలకమైన పాత్ర భీముడిది. ఈ పాత్రకోసం
పన్నెండు సంవత్సరాల పాటు హెవీ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ అయిన, ఇండియన్ టార్జాన్ దండమూడి
రాజగోపాల్ ను ఎంపిక చేశారు దర్శక నిర్మాతలు. ఆయన కూడా తనకిచ్చిన తొలి అవకాశాన్ని చక్కగా
వినియోగించుకున్నారు. అలానే జీమూతమల్లుడిగా నటించిన నెల్లూరు కాంతారావు సైతం పేరున్న
మల్లయోధుడే కావడం మరో విశేషం. ఇక ఇతర ప్రధాన పాత్రలలో ధర్మరాజుగా మిక్కిలినేని, దుర్యోధనుడిగా
ధూళిపాళ, దుశ్శాసనుడిగా కైకాల సత్యనారాయణ, విరాట రాజుగా ముక్కామల, సుధేష్ణగా సంధ్య,
ఉత్తరగా ఎల్.విజయలక్ష్మి, అభిమన్యుడిగా శోభన్ బాబు, సుభద్రగా లక్ష్మీరాజ్యం, శ్రీకృష్ణుడిగా
కాంతారావు, ఉత్తరకుమారుడిగా రేలంగి, ఊర్వశిగా పద్మినీ ప్రియదర్శిని నటించారు. ఈ సినిమా
విజయంలో సుసర్ల దక్షిణామూర్తి సంగీతానికీ ప్రధాన పాత్ర ఉంది. సుసర్లవారి బాణీలకు తగ్గట్టుగా
సముద్రాల, కొసరాజు, శ్రీశ్రీ చక్కని గీతాలను అందించారు. ‘జననీ శివకామినీ’ అనే భక్తి
గీతం నేటికి తెలుగు వారి నోళ్ళలో నానుతూనే ఉంది. ‘ఎవరికోసం ఈ
మందహాసం’ గీతాన్ని ఆలపించని యువతీయువకులు అప్పట్లో
లేరంటే అతిశయోక్తి కాదు. అలానే ‘సలలిత రాగ
సుధారససారం’ పాట పాడని వర్ధమాన గాయనీ గాయకులు
ఉండేవారే కాదు. ‘సఖియా వివరించవే’, ‘నరవరా ఓ కురువరా’ వంటి పాటలూ ఆపాతమధురాలుగా మిగిలిపోయాయి.
1963లో జాతీయ స్థాయిలో ద్వితీయ ఉత్తమ చిత్రంగా ‘నర్తనశాల’ ఎంపికై, రాష్ర్టపతి
అవార్డును అందుకున్నతొలి తెలుగు సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది. అలానే ఇండోనేషియా
రాజధాని జకార్తాలో జరిగిన చలన చిత్రోత్సవానికి భారతదేశం తరఫున ఎంపికయిన ఏకైక చిత్రం
ఇది. అక్కడకు నిర్మాతలు శ్రీధరరావు, లక్ష్మీరాజ్యంతో పాటు ఎస్వీరంగారావు, రేలంగి, సావిత్రి
వెళ్ళారు. కీచకుడిగా ఎస్వీయార్ నటన చూసి ముగ్థులైన అక్కడి ప్రేక్షకులు ఆయనను ఉత్తమ
నటుడిగా ఎంపికచేసి, సత్కరించారు. అలానే కళాదర్శకుడు టివిఎస్ శర్మ ప్రతిభనూ వేనోళ్ళపొగిడారు. విశేషం ఏమంటే ఆ రోజుల్లోనూ సినిమాకు లభించిన ఈ అరుదైన
గౌరవాన్ని పాఠకులకు తెలియచేయడానికి ప్రతికలు విశేష కృషి చేశాయి. ఆంధ్రప్రభ దినపత్రిక
ఏప్రిల్ 25, 1964న ఓ సప్లిమెంట్ ను ప్రచురించింది. అందులో సినిమాలోని విశేషాలు, నటీనటుల
మనసులోని మాటలనే కాకుండా, సాంకేతిక నిపుణుల గొప్పదనాన్ని తెలిసిందీ. అంతేకాదు… ఈ సినిమా విషయంలో వచ్చిన రెండు విమర్శలకూ నిర్మాత సహేతుకమైన
సమాధానాలను పత్రిక ముఖంగా ఇవ్వడం మరీ విశేషం!
సినీ విమర్శకుడిగా జీవితాన్ని ప్రారంభించి, దర్శకుడిగా ఎదిగిన కమలాకర
కామేశ్వరరావును ‘పౌరాణిక బ్రహ్మ’గా తీర్చిదిద్దిన చిత్రరాజాలలో ‘నర్తనశాల’ది అగ్రతాంబూలం!
ఆపైన ఆయన ఎన్నో అపురూపమైన పౌరాణిక చిత్రాలను రూపొందించి, తెలుగు ప్రేక్షకుల మనసుల్లో
సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.
‘నర్తనశాల’ కథాంశం మీద మక్కువతోనే ఎన్టీయార్ తన నట విశ్వరూపాన్ని
సంపూర్ణంగా ఆవిష్కరిస్తూ 1979లో ‘శ్రీమద్విరాటపర్వం’ సినిమా రూపొందించారు. అందులో ఆయన శ్రీకృష్ణుడు, అర్జునుడు,
బృహన్నల, కీచకుడు, దుర్యోధనుడిగా నటించి అలరించారు.
No comments:
Post a Comment