వెండి చందమామలు (పుస్తక సమీక్ష)
@@@
సినిమాకబుర్ల చదువరులందరికి శ్రీ పులగం చిన్నారాయణ, శ్రీ వడ్డి ఓంప్రకాష్ నారాయణ సుపరిచితులు. గత మూడు దశాబ్దాలుగా వీరు అనేక సినిమా పత్రికలలో పాత్రికేయులుగా, రచయితలుగా పనిచేసి లబ్ధప్రతిష్టులైనారు. అనేక పురస్కారాలు అందుకున్నారు. ముఖ్యంగా హాస్య సంగీత పత్రికలో వీరు అనేక ధారావాహికలు రాసారు. "జంధ్యామారుతం, సినీ పూర్ణోదయం, స్వర్ణయుగ సంగీత దర్శకులు, సినిమా వెనుక స్టోరీస్, మాయాబజార్ మధురస్మృతులు గ్రంధాల ద్వారా పులగం చిన్నారాయణ, సాక్షి, సూపర్ హిట్, ఆంధ్రజ్యోతి మొదలైన ప్రసిద్ధ పత్రికలలో పాత్రికేయునిగా వడ్డి ఓం ప్రకాష్ ప్రసిద్ధులు. సుప్రసిద్ధ రచయితలు, దర్శకులు ముళ్ళపూడి వెంకట రమణ, వంశి, బాపు, బాలసుబ్రమణ్యం లాంటి కళాకారులకు వీరు అత్యంత సన్నిహితులు.
వీరిద్దరికీ ఒక ప్రశస్తమైన ఆలోచన వచ్చింది. తెలుగు సినిమా ప్రారంభం నుంచి నేటివరకు వచ్చిన వెండితెర నవలల మీద పరిశోధనాత్మక సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించాలని కోరిక కలిగింది. ఇప్పటివరకు ఎంతమంది ఎన్ని వెండితెర నవలలు రాసారు, వారంతా ఎక్కడున్నారు అని గవేషణ సాగించారు. సాధికారిక సమాచారాన్ని సేకరించారు.
వారి అన్వేషణలో భాగంగా అయిదారు నెలల క్రితం నాకు ఫోన్ చేసారు. ఎందుకంటే, ఎప్పుడో పదిహేడేళ్ల క్రితం "హాసం" పత్రికలో నేను బాపు రమణల "పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళాం" సినిమాలకు వెండితెర నవలలు సీరియల్ గా రాసాను. దాన్ని గుర్తు పెట్టుకుని ఓంప్రకాష్ గారు నాకు ఫోన్ చేసి నా సందేశాన్ని అడగడం ఎవరెస్ట్ ఎక్కినంత సంబరాన్ని కలిగించింది. నాకు తోచింది రాసి పంపించాను. దాన్ని ఈ అందమైన పుస్తకంలో రమ్యతిరమ్యంగా ముద్రించారు వారు. శ్రీయుతులు కాట్రగడ్డ నరసయ్య, వేమూరి సత్యనారాయణ, సింగీతం శ్రీనివాసరావు, శ్రీరమణ, నవోదయ రామ్మోహన రావు, డాక్టర్ దివాకర్ రావు లాంటి హేమాహేమీల సరసన నాకు కూడా స్థానం లభించడం పద్మశ్రీ నా మెడలో అలంకరించబడినంత విశేషం కదా!
ఈ పుస్తకంలో ఇప్పటివరకు వెలువడిన వెండితెర నవలలు, ఆయా సినిమాల నిర్మాతాదర్శకులు. సంస్థల పేర్లు, సినిమాలు వెలువడిన సంవత్సరం వివరాలు అన్నింటినీ పొందుపరచి "వెండి చందమామలు" మకుటంతో విందుభోజనంలా అందించారు. సినిమాల మీద ఆసక్తి కలిగిన ప్రతిఒక్కరు 'కొని' చదవాల్సిన పుస్తకం ఇది. పుస్తకానికి ఉపయోగించిన కాగితం, ముద్రణ అంతర్జాతీయస్థాయిలో ఉన్నాయి. ఎక్కడా ఒక్క ముద్రారాక్షసం కూడా ప్రచురించారంటే, వీరు ఈ పుస్తకం కోసం ఎంత తపన పడ్డారో, ఎంత శ్రమించారో అర్ధం చేసుకోవచ్చు.
ఇద్దరు పాత్రికేయ మిత్రులకు మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
No comments:
Post a Comment