Friday, April 17, 2020

Megastar : The legend book review at andhra jyothy website


మెగాస్టార్ ది లెజెండ్ : మెగా మథనం!

నటరత్న ఎన్టీయార్, నటసమ్రాట్ ఎఎన్నార్‌ తర్వాత కాలంలో చిరంజీవి మీద వచ్చినన్ని పుస్తకాలు తెలుగులో మరే హీరో మీద వచ్చినట్టు లేదు. ఆయన సినీ ప్రస్థానాన్ని, వ్యక్తిత్వాన్ని తెలియచేస్తూ వచ్చిన పుస్తకాలు ఎన్నె..ఎన్నెన్నో. ఇప్పటికే చిరంజీవి మీద పదుల సంఖ్యలో పుస్తకాలు వచ్చాక... మళ్ళీ 'మెగాస్టార్ ది లెజెండ్‌' పుస్తకాన్ని సీనియర్ జర్నలిస్ట్‌ యు. వినాయక రావు తీసుకొస్తున్నారంటే... అందులో ఏదో ప్రత్యేకత ఉండేవుంటుందనే భావన సినీ జనానికి కలగడం సహజం. దానికి సమాధానంగా ఇటీవల 'మెగాస్టార్ ది లెజెండ్‌' పుస్తకం జనం ముందుకు వచ్చింది. ఎ 4 సైజులో 470 పేజీల పుస్తకాన్ని చేతిల్లోకి తీసుకోగానే చాలా భారంగా అనిపించడం ఖాయం. అయితే... సరళమైన భాష, చదివించే శైలి కారణంగా పేజీలు చకచకా తిప్పేయడం జరుగుతుంది.
సుమారు నాలుగు దశాబ్దాల క్రితం చిత్రసీమలోకి అనామకుడిగా ప్రవేశించిన వ్యక్తి తదనంతర కాలంలో పద్మభూషణ్‌ పురస్కారం పొందడం, కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేయడం మరి ముఖ్యంగా కోట్లాదిమంది అభిమాన గణాన్ని సంపాదించుకోవడం సామాన్యమైన విషయం కాదు. ఆ ఎదుగుదల వెనుక వెలకట్టలేని కష్టం ఉంది, నిరంతరం తనను తాను సానబెట్టుకోవడం ఉంది. వ్యక్తి వ్యవస్థగా మారడం రాత్రికి రాత్రి జరిగిపోయేది కాదు. అది నిరంతర ప్రక్రియ. నాయకుడు తనలాంటి మరికొందరు క్రియాశీల వ్యక్తులను కార్యోన్ముఖులను, కర్తవ్య పరాయణులను చేసి, వారికి సరైన దిశా దర్శనం చేయగలిగితేనే వ్యవస్థగా మారడమనేది జరుగుతుంది. చిరంజీవి విషయంలో అదే జరిగింది. తానొక్కడే ముందుకు సాగడం కాకుండా తన మిత్రులను, దర్శక నిర్మాతలను, సహచర నటీనటులను, వారసులను కూడా వెంట తీసుకుని ప్రయాణం సాగించారు. అదే ఆయనకు ఇవాళ లభిస్తున్న గౌరవానికి ప్రధాన కారణం. అంతేకాదు.... గడిచిన మూడు దశాబ్దాల కాలంలో అభిమానులను ఏనాడూ విస్మరించింది లేదు! యు. వినాయకరావు రాసిన 'మెగాస్టార్ ది లెజెండ్‌' పుస్తకాన్ని చదివితే పై అంశాలన్నీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. చిరంజీవి నటించిన 151 చిత్రాలకు సంబంధించిన సమాచారంతో పాటు... తెరవెనుక జరిగిన ముచ్చట్లను తెలియ చెప్పడం తీయని పాయసంలో నేతిలో వేయించిన జీడిపప్పుల రుచిని ఆస్వాదించిన అనుభూతిని కలిగిస్తుంది.  అలానే కేవలం తెలుగు చిత్రాలకు పరిమితం కాకుండా చిరంజీవి నటించిన పరభాషా చిత్రాల వివరాలు, ఆయన పోషించిన అతిథి పాత్రలు, మరీ ముఖ్యంగా ఆగిపోయిన చిరంజీవి చిత్రాల ముచ్చట్లు తెలియచేయడం ఆసక్తిని రేకెత్తించింది. ఆయనతో కలిసి నటించిన కథానాయికలు, చిత్రాలు రూపొందించిన దర్శకులు, సినిమాలు నిర్మించిన నిర్మాతల వివరాలను ఇందులో పేర్కొన్నారు. 1977లో చిరంజీవి చెన్నయ్‌లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు హైదరాబాద్‌లో అత్యాధునిక వసతులతో కూడిన సువిశాల భవనాన్ని నిర్మించుకున్నంత వరకూ ఆయన ఎక్కడెక్కడ నివాసం ఉన్నారో సవివరంగా అందించడం మరో ఆసక్తికరమైన అంశం. చిరంజీవి తన తల్లిదండ్రుల గురించి ఇచ్చిన ఇంటర్వ్యూ, పవన్ కళ్యాణ్ అన్నయ్య గురించి చెప్పిన ముచ్చట్లు అదనపు ఆకర్షణ. ఇప్పటి వరకూ చిరంజీవి మీద అనేక పుస్తకాలు వచ్చి ఉండొచ్చు... కానీ ఇంత సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా, అరుదైన ఛాయా చిత్రాలతో  వచ్చిన పుస్తకం ఇదే. నటుడు చిరంజీవి గురించి, ఆయన సినిమాల గురించిన పుస్తకం మాత్రమే ఇది అనుకుంటే పొరపాటు. దీనినో విజేత ప్రస్థాన గ్రంథంగా భావించాలి. ఈ పుస్తకాన్ని పూర్తి చేసిన చదువరికి... సీనియర్‌ జర్నలిస్ట్ యు. వినాయకరావు నాలుగేళ్ళ పాటు పడిన కష్టం కళ్ళముందు మెదలడం ఖాయం. వినాయకరావు మెగామధనం జరిపి... మనకీ అమృతాన్ని అందించారనిపిస్తుంది.

- మెగాస్టార్ ది లెజెండ్‌
రచన: యు. వినాయకరావు
ప్రతులకు: జయా పబ్లికేషన్స్, ఫ్లాట్‌ నం: 102 శ్రీశ్రీ శ్రీనివాస నిలయం, 7-1-303/డి/2, బాలయ్య నగర్, సంజీవరెడ్డి నగర్, హైదరాబాద్‌ - 500038, ఫోన్‌: 98851 79428, 75698 79605.
వెల: రూ. 750.00

- వడ్డి కార్తికేయ


No comments:

Post a Comment