Saturday, September 7, 2013

Toofan movie review

           
                  

                        ఉద్యమ సునామీలో తేలిపోయినతుఫాన్’!

‘’ ‘అల్లూరి సీతారామరాజుసినిమాను మీరు రీమేక్ చేస్తారా’’? అని అడిగితే ‘‘మా నాన్నగారు చేసిన క్లాసిక్ మూవీస్ లో అదొకటి. దాన్ని రీ-మేక్ చేయడం అంత బుద్ధితక్కువ పనిమరొకటి ఉండదు’’ అన్నాడు మహేశ్ బాబు.
‘’ ‘శివసినిమా రీ-మేక్ చేసే ఆలోచన ఉందా’’? అని నాగ చైతన్య ను అడిగితే… ‘‘టాలీవుడ్లో అదో ట్రెండ్ సెట్టర్. దాన్ని టచ్ చేయడం ఎంత మాత్రం సరైంది కాదు’’ అన్నాడు నాగచైతన్య.
అటువంటిందిఏకంగా యంగ్రీ యంగ్ మేన్ అమితాబ్ బచ్చన్ కెరీర్ లో ది బెస్ట్ అనిపించుకునే సినిమాల్లో ఒకటైనజంజీర్ను రీమేక్ చేయడానికి ఎంత ధైర్యం ఉండాలి! పైగా బాలీవుడ్ ఎంట్రీకి ఆ సినిమాను ఎంచుకోవడం అంటే ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి!! అవన్నీ తనకు ఉన్నాయని చిరంజీవి తనయుడు రామ్ చరణ్ భావించాడు. అందుకనే దర్శకుడు అపూర్వ లాఖియాతో కలిసిజంజీర్మూవీని రీమేక్ చేశాడు. అదే సినిమా కొందరు తెలుగు ఆర్టిస్టులతోతుఫాన్గానూ తెరకెక్కింది. 6వ తేదీ ఈ సినిమా రెండు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
ఇక సినిమా విషయానికి వస్తే
హైదరాబాద్లో పోలీస్ ఆఫీసర్ గా ఉన్న విజయ్ ఖన్నానడిరోడ్డు మీద ధర్నాకు దిగిన అధికారపార్టీ శాసన సభ్యుడి మీదే చెయ్యి చేసుకుంటాడు. దాంతో అతన్ని ముంబాయికి ట్రాన్స్ ఫర్ చేస్తారు. .సి.సి.గా బాధ్యతలు స్వీకరించిన విజయ్ దృష్టి ఆయిల్ మాఫియా మీద పడుతుంది. కల్తీ ఆయిల్ తో కోట్లు రూపాయలను అక్రమంగా సంపాదిస్తున్న తేజ ఆటలు కట్టించడానికి విజయ్ నడుం బిగిస్తాడు. అందుకోసం షేర్ ఖాన్ సాయం తీసుకుంటాడు. తేజ అనుచరులు ఓ సబ్ కలెక్టర్ ను సజీవ దహనం చేయడాన్ని ఎన్.ఆర్.. మాలా చూస్తుంది. ఆమెను సాక్షిగా కోర్టుకు హాజరు పరిచి తేజను అరెస్ట్ చేయాలనుకుంటాడు విజయ్. అయితే పోలీస్ కమీషనర్ అతన్ని విధుల నుండి తప్పిస్తాడుసస్పెండ్ అయిన విజయ్ ఖన్నా ఆయిల్ మాఫియా ఆటల్ని ఎలా కట్టించాడు? తన తల్లిదండ్రుల మరణానికి కారకుడైన వ్యక్తిని ఎలా హతమార్చాడు? అన్నదే మిగతా కథ.
ఇలాంటి సినిమాలు ఇప్పటికే వందల కొద్ది చూశాం కదా!’ మీకు సందేహం రావొచ్చు. అది నిజమే. అయితే నలభై ఏళ్ళ క్రితం ఇదే కథతో అమితాబ్, ప్రకాశ్ మెహ్రా ఓ సంచలన  విజయాన్ని నమోదు చేసుకున్నారు. దానికి సలీమ్- జావేద్ రచన తోడైంది. నాలుగు దశాబ్దాల తర్వాత కూడా పాత చింతకాయ పచ్చడి లాంటి కథతోనే విజయం సాధించాలను కోవడం, పైగా లార్జర్ దేన్ లైఫ్ ఇమేజ్ ఉన్న అమితాబ్ లాంటి వ్యక్తి సినిమా కథను తీసుకోవడం ఏ రకంగానూ తెలివైన ఆలోచన కాదు.
ఇవాళ ఈ సినిమాను ఉత్తరాది ప్రేక్షకులంతాజంజీర్తో పోల్చుతున్నారు. అంతేకాదుఅమితాబ్ జీవం పోసిన విజయ్ ఖన్నా పాత్రతోనే రామ్ చరణ్ పాత్రనూ చూస్తున్నారు. దాంతో ఏ స్థాయిలోనూ ఈ సినిమా మాతృకకు సమ ఉజ్జీ కాదని తేల్చేస్తున్నారు. మాటకారి ఎన్.ఆర్.. పాత్రను ప్రియాంక చోప్రా బాగానే చేసినా, ఆమె పాత్రలోని ఔచిత్యం మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఫేస్ బుక్ ఫ్రెండ్ పెళ్ళికని ఆమె అమెరికా నుండి రావడం, పెళ్ళిలో విపరీతంగా తాగేసి డాన్సు చేయడం, హోటల్ కు వెళ్ళే దారిలో ఓ మర్డర్ ను చూసి పోలీసులకు ఫోన్ చేయడం, ఆపైన సాక్ష్యం చెప్పలేనంటూ వెనుదిరగడంఅంతా ఆషామాషీ వ్యవహారంగానే కనిపిస్తుంది. చివరకు విజయ్ ఖన్నా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తర్వాత మనసు మార్చుకుని, కోర్టుకు హాజరవుతానని చెప్పడం, అతనితో ఫ్లాట్ లోనే దిగి, అతనికి శారీరకంగా దగ్గరకావడం చూస్తుంటేఈ పాత్ర ఎటునుండి ఎటుపోతోంది అనే సందేహం కలుగుతుందిఇక షేర్ ఖాన్ పాత్రలో శ్రీహరి తనదైన నటన కనబరిచాడు. అయితే అతను  పోలీస్ స్టేషన్ లోకి ప్రవేశించగానే ఎసిపి విజయ్ అతని కాలర్ పట్టుకోవడం ఎబ్బెట్టుగా ఉంది. హిందీలో ఈ పాత్రను సీనియర్ నటుడు సంజయ్ దత్ చేయడంతో అక్కడ మరింత విమర్శకు గురైంది. ‘తుఫాన్సినిమాలో కాస్త మార్కులు బాగా పడ్డాయంటే ప్రకాశ్ రాజ్ కే. తెలుగు ప్రేక్షకులు అతన్ని ఈ తరహా పాత్రలో చాలా సినిమాల్లోనే చూసినాప్రకాశ్ రాజ్ తనదైన శైలిని కనబరిచాడు. మోనా పాత్రలో మాహీగిల్ మెరిపించలేక పోయింది. చాలా సందర్భాలలో వీరిద్దరి మధ్య సంభాషణలు కూడా హద్దులు దాటాయి. జర్నలిస్ట్ గా నటించిన తనికెళ్ళ భరణీదీ రొటీన్ క్యారెక్టరే. చంద్రబోస్ పాటలూ ఆకట్టుకోలేదు. ఏ రకంగానూ, ఏ స్థాయిలోనూ ఈ సినిమా ఇటు తెలుగువారిని, అటు ఉత్తరాది వారిని మెప్పించలేకపోయింది. అక్కడి వారుజంజీర్తో పోల్చి పెదవి విరుస్తున్నారు. ఇక్కడి వారు ఉద్యమ సునామీ నేపథ్యంలోతుఫాన్ను పట్టించుకోవడం లేదు.
సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఈ సినిమా విడుదల కావడంతో తెలుగు చిత్రసీమ దృష్టి అంతా దీని మీదనే ఉంది. ‘తుఫాన్కు ప్రజల నుండి పెద్దగా వ్యతిరేకత రాకపోతే తమ సినిమాలూ విడుదల చేయొచ్చని అగ్ర చిత్రాల నిర్మాతలు ఆశగా ఎదురుచూశారు. . ప్రతికూల పరిస్థితులు ఉంటాయని తెలిసి కూడా తప్పని పరిస్థితుల్లో ఈ సినిమాను నిర్మాతలు విడుదల చేశారు. విచిత్రం ఏమంటే కేంద్ర మంత్రి పదవికి చిరంజీవి రాజీనామా చేయనందుకు అటు సీమాంధ్రలోనూ, హైదరాబాద్ ను యు.టి. చేయాలన్నందుకు ఇటు తెలంగాణాలోనూ పలు చోట్ల సినిమా ప్రదర్శనను ఆందోళన కారులు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని హీరో రామ్ చరణ్ అంగీకరిస్తూ, ‘తుఫాన్విడుదల రోజునేసినిమా కంటే ఉద్యమం పెద్దదిఅని స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఈ తెలివిజంజర్ను రీమేక్ చేసే ముందు ఉండి వుంటే బాలీవుడ్ ఎంట్రీ మరింత బాగుండేది.

Sunday, September 1, 2013

Monday, August 12, 2013

The unsung hero... Sri K.V. Seshagiri Rao!


శ్రీ కె.వి. శేషగిరి రావు గారితో నాకు వ్యక్తిగత పరిచయం కావడానికంటే ముందే ఆయన రచనలతో పరిచయమైంది. నా చిన్నతనం నుండి జాగృతి వార పత్రిక మా ఇంటికి పోస్టులో వస్తుండేది. 1985 ప్రాంతంలో 'స్వాతి' అనే పేరుతో జాగృతిలో అనేక వ్యాసాలు వస్తుండేవి. అమెరికా, రష్యా, చైనా దేశాల దురాగతాల గురించి, ఇస్లామిక్ తీవ్రవాదం గురించి, క్రైస్తవుల మతమార్పిడి గురించి స్వాతి పేరుతో వచ్చే ఆవ్యాసాలు చదువుతూ, నేను ఆయన అభిమానిగా మారిపోయాను. నా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత జాగృతిలోనే సబ్ ఎడిటర్ గా చేరినప్పుడు స్వాతి అనే పేరుతో ఆర్టికల్స్ రాస్తోంది శ్రీ కె.వి. శేషగిరిరావు గారని తెలిసింది. ఆయన న్యూఢిల్లీలో వ్యవసాయ మంత్రిత్వ శాఖలో డైరెక్టర్ గా పనిచేస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగి అయిన కారణంగా 'స్వాతి' అనే కలం పేరుతో వ్యాసాలు రాస్తున్నారని మా ఎడిటర్ శ్రీ రామ్మోహనరావు గారు చెప్పారు. 

వారంలో క్రమం తప్పకుండా నాలుగైదు రోజులు ఆయన నుండి మాకు వ్యాసాలు వస్తుండేవి. జాతీయ, అంతర్జాతీయ అంశాల గురించి ఎంతో లోతైన భావాలను సైతం ఆయన సరళమైన భాషలో పాఠకులకు అందించేవారు. కేవలం వ్యాసాలు రాయడమే కాదు... నవభారతి ప్రచురణ సంస్థ కోసం వందలాది పుస్తకాలు రాశారు. తన కార్యాలయానికి వెళ్లే ముందు, అక్కడి నుండి ఇంటికి వచ్చే ముందు న్యూఢిల్లీలోని విదేశీ గ్రంథాలయాలకు వెళ్ళి సమాచారాన్ని సేకరించి, వాస్తవమైన విషయాలను అందించడానికి ఆయన ఎంతో శ్రమపడేవారు. స్కూటర్ మీదనే ఢిల్లీ వీధుల్లో రోజుకు ఇరవై ముప్ఫై కిలోమీటర్లు ప్రయాణం చేసేవారు. నేను జాగృతిలో ఉన్న నాలుగేళ్ళ కాలంలో ఆయన ఆర్టికల్ పోస్టులో రాగానే మొట్టమొదట నేనే చదివే వాడిని. ఆ రకంగా నేను వాటికి తొలి పాఠకుడిని. ఆయన పంపిన వ్యాసం అందిందని, ఫలానా సంచికలో ప్రచురిస్తున్నామని నేనే వారం వారం ఉత్తరాలు రాస్తుండేవాడిని. యేడాదిన్నర పాటు మా మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాక, వృత్తిరీత్యా ఢిల్లీ వెళ్ళినప్పుడు తొలిసారి, నా అభిమాన రచయిత శ్రీ కె.వి. శేషగిరి రావుగారిని రామకృష్ణాపురంలోని ఆయన ఇంటిలో కలిశాను. ఆయన చూపించిన అభిమానం కారణంగా వారి కుటుంబానికి మరింత చేరువయ్యాను.

ఏ విషయం గురించి అయినా హాయిగా చదువుకునేలా వ్యాసాన్ని రాయడంలో ఆయనకు ఆయనే సాటి. కానీ ఏ రోజునా పేరు కోసం, వ్యక్తిగత ప్రచారం కోసం ఆయన పాకులాడలేదు. స్వాతి అనే వ్యక్తి ఎవరో కూడా చాలామంది జాగృతి పాఠకులకు తెలియనే తెలియదు. సంపాదకులు శ్రీ రామ్మోహనరావుగారు తనకు అప్పగించిన పనిని ప్రతిఫలాపేక్ష లేకుండా, సంవత్సరాల తరబడి, అదే అంకితభావంతో నిర్వర్తించిన గొప్ప రచయిత శ్రీ శేషగిరిరావుగారు. ఉద్యోగ విరమణ తర్వాత హైదరాబాద్ మల్కాజ్ గిరి లో ఆయన స్థిరపడ్డారు. 
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను నెల రోజుల క్రితమే వెళ్ళి కలిసి. నా కథల పుస్తకం ఇచ్చి, ఆశీస్సులు తీసుకుని వచ్చాను. గొప్ప రచయిత, మానవతా వాది అయిన శ్రీ శేషగిరిరావు గారు ఈ రోజు సాయంత్రం స్వర్గస్థులయ్యారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు తన రచనలతో జాగృతి పాఠకులను అలరించిన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.