Friday, September 20, 2013

Sardesai Tirumala Rao book review



 జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు: పుస్తక సమీక్ష - వడ్డి ఓంప్రకాశ్ నారాయణ

పుస్తకం: జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు
వెల: 150/-
ప్రతులకు: కె. మురళీమోహన్, 9111, బ్లాక్ 9 ఎ, జనప్రియ మహానగర్, మీర్ పేట, హైదరాబాద్ – 500097.
            ఫోన్: 9701371256.

‘ఇలాంటి వ్యక్తి ఈ భూమ్మీద నడయాడాడంటే భావితరాలకు నమ్మకం కుదరదు’ అని మహాత్మాగాంధీ గురించి ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్ స్టీన్ అన్నమాట, సర్దేశాయి తిరుమలరావుకూ వర్తిస్తుందని చెప్పడం - ఆషామాషీ వ్యవహారం కాదు. ఆయన రాసిన అక్షరమక్షరాన్ని చదివి అర్థం చేసుకున్నవాళ్లు, ఆయన జీవన విధానాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు మాత్రమే ఆ మాట చెప్పడానికి సాహసిస్తారు. ‘జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు’ పుస్తక సంపాదకులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, కోడీహళ్లి మురళీమోహన్ ఈ విషయాన్ని పుస్తక ప్రారంభంలోనే ప్రస్తావించడంతో ఈ తరం వారికి కాస్త ఆసక్తి, మరికొంత సందేహం కలిగే అవకాశం ఉంది. పైగా సుమారు రెండు దశాబ్దాల క్రితం గతించిన వ్యక్తి గురించి ఇంత పెద్ద మాట అన్నారంటే ఆయనలో ఏదో గొప్పతనం ఉండే ఉంటుందనిపించడం సహజం. వీటన్నింటికీ చక్కని సమాధానమే ఈ 264 పేజీల పుస్తకం.

1928 నవంబర్ 28న జన్మించిన సర్దేశాయి తిరుమల రావు వృత్తిరీత్యా తైల పరిశోధనా శాస్ర్తవేత్త.  ప్రవృత్తిరీత్యా సాహితీ విమర్శకుడు. ఆజన్మ బ్రహ్మచారి. తిరుమలరావు గడిపిన సాదాసీదా జీవితాన్ని గమనిస్తే… ప్రకాశకుల ముందు మాటలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదని అర్థమౌతుంది. అటువంటి వ్యక్తి 1965 ప్రాంతం నుండి 1994లో కన్నుమూసేంత వరకూ భారతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, హిందూ, ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికలలో రాసిన వ్యాసాలను, లేఖలను, సాహితీ విమర్శలను సేకరించి పుస్తకంగా తీసుకొచ్చారు.

1954లో తైల సాంకేతిక పరిశోధనా సంస్థలో కెమిస్టుగా కెరీర్ ను ప్రారంభించి, 1983 జులై 31న డైరెక్టర్ గా పదవీ విరమణ చేసేంత వరకూ సర్దేశాయి తిరుమలరావు ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదనంటే ఆశ్చర్యం కలగక మానదు. వృత్తిపట్ల ఆయనకు ఉన్న అంకిత భావమే తైల సాంకేతిక రంగంలో నూతన ప్రక్రియలు కనుగొని, పదకొండు పేటెంట్లకు వీరు హక్కుదారులు కావడానికి కారణమైంది. అంతేకాదు వీరి అవిరళ కృషి ఫలితంగా ఐదు బంగారు పతకాలతో, సహా 13 అవార్డులు వారి సంస్థకు లభించాయి. వీరి హయాంలో అనంతపురం తైల సాంకేతిక పరిశోధనా సంస్థ అంతర్జాతీయ ఖ్యాతినార్జించుకుంది. తన సంస్థకు వెన్నెముకగా నిలిచిన సర్దేశాయి తిరుమల రావు తన జీవితమంతా అనంతపురం కమలానగర్ లో మంగళూరు పెంకులు కప్పిన ఒక చిన్న ఇంటిలో అద్దెకు ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. చుట్టూ పుస్తకాల మధ్య ఓ చిన్నగదిలో చాపమీదే ఆయన జీవితమంతా గడిపారన్న సంగతి తెలిస్తే రోమాంచితమౌతుంది. ఓ పాత రేడియో, తలదగ్గర ఓ బల్బు, ఎవరైనా వస్తే కూర్చోవడానికి మరో చాప… ఇవే ఆయన ఆస్తి అంటే నమ్మశక్యం కాదు. అత్యున్నతమైన ఆలోచనలతో, అతి సాదాసీదా జీవితాన్ని గడిపిన సర్దేశాయి తిరుమల రావును చూస్తే రుషిపుంగముడనే అనిపిస్తుంది. ‘నా మనస్సు విజ్ఞాన శాస్ర్తానికి అంకితమైంది. నా హృదయం సాహిత్యంతో నిండినది’ అని సీనియర్ పాత్రికేయులు జి. కృష్ణతో ఆయన చెప్పిన మాటలు అక్షర సత్యాలని ఆయన జీవన విధానాన్ని గమనిస్తే తెలుస్తుంది.

ప్రకృతిలో ఉన్నది ఉన్నట్టు చిత్రించడం కవి పని కాదని, అది ఫోటోగ్రాఫర్ ది అని, ఉన్నదానిని సృజనాత్మకంగా చెప్పడమే కవి పని అని సర్దేశాయి అంటారు. అందుకనే కవి లేదా రచయితల సృజనలో ఏమాత్రం పొరపాటు జరిగిన విమర్శించడానికి ఆయన వెనుకాడలేదు. అది ప్రముఖ కవి శేషేంద్ర శర్మ అయినా ఆయన మొహమాటపడలేదు. అలానే పుట్టపర్తి నారాయణాచార్యుల ‘జనప్రియ రామాయణం’ గురించి విమర్శనాత్మక వ్యాసాన్ని అదే నిబద్ధతతో విశ్లేషించారు.  వ్యక్తిగా తిరుమలరావు వామనాకారుడే కావచ్చు, కానీ సాహితీ విమర్శకుడిగా నిర్మొహమాటంతో, నిర్భీతితో ఆయన తన విశ్వరూపాన్ని అనేక పర్యాయాలు ప్రదర్శించారన్నది వాస్తవం. ప్రతి రచననూ విమర్శనాత్మక దృష్టితో చూసే సర్దేశాయి తిరుమలరావుకు నచ్చిన గ్రంథాలూ మూడున్నాయి. గురజాడ రచించిన ‘కన్యాశుల్కం’ నాటకాన్ని, ఉన్నవ లక్ష్మీనారాయణ రాసిన ‘మాలపల్లి’ నవలను, గడియారం వేంకట శేష శాస్ర్తి రాసిన ‘శివభారతం’ కావ్యాన్ని ఆయన ఎంతో ఇష్టపడేవారు. అంతేకాదు… ‘కన్యాశుల్క నాటక కళ’, ‘సాహిత్య తత్త్వము-శివభారత దర్శనము’ అనే పుస్తకాలను రాశారు. ‘మాలపల్లి’ మీద రచన పూర్తి చేయకుండానే ఆయన కన్నుమూశారు.

‘జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు’  గ్రంథంలో ఏడు విభాగాలు ఉన్నాయి. ‘విలక్షణ మూర్తిమత్వం’ అనే విభాగంలో తిరుమలరావు గురించి నాగసూరి వేణుగోపాల్, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, హెచ్.ఎస్. బ్రహ్మానంద, రావినూతల శ్రీరాములు, సూర్యదేవర రవికుమార్ రాసిన వ్యాసాలు, జానమద్ది హనుమచ్ఛాస్ర్తి జరిపిన సంభాషణ ప్రచురించారు. మిగిలిన విభాగాలలో తిరుమలరావు రాసిన విమర్శనా వ్యాసాలు, లేఖలు, ముందుమాటలు వగైరాలు చోటుచేసుకున్నాయి. అలానే ఆంగ్లంలోనూ తిరుమలరావు గురించి పలువురు రాసిన వ్యాసాలను, ఈయన ఆంగ్ల దినపత్రికలకు రాసిన లేఖలను ఓ విభాగంలో పొందుపరిచారు. ఆయన అందుకున్న అవార్డులు, రివార్డులు, చిత్రమాలిక అదనం… అంతేకాదు భారతి పత్రికలో రెండున్నర్ర దశాబ్దాల పాటు ప్రచురితమైన తిరుమలరావు రచనలను పట్టికగా అందించారు. ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత ‘సర్దేశాయి తిరుమలరావు కళాహృదయమున్న మేధావి, రసతత్త్వ మెరిగిన వైజ్ఞానికుడు, దార్శనికదృక్పథం ఉన్న స్వాతంత్రుడు’ అంటూ ఆచార్య హెచ్. ఎస్. బ్రహ్మానంద చెప్పిన మాటతో మనమూ ఏకీభవిస్తాం. వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా, రచయిత హోదాను దృష్టిలో పెట్టుకోకుండా, సైధ్ధాంతికపరంగా విమర్శ చేసే తిరుమలరావు వంటి వ్యక్తులు ఇవాళ మనకు అరుదుగా కనిపిస్తున్నారు. ‘ఇదీ విమర్శ అంటే’ అని తెలియచెప్పే ఎన్నో వ్యాసాలు ఈ పుస్తకంలో మనకు కనిపిస్తాయి, కనువిప్పు కలిగిస్తాయి.

గత యేడాది విద్వాన్ విశ్వం గురించిన పుస్తకాన్ని ప్రచురించిన అబ్జా క్రియేషన్స్ ఇప్పుడీ ‘జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు’ పుసక్తాన్ని విడుదల చేసింది. రాయలసీమలో మరుగున పడిన సాహితీ రత్నాలను వెలికి తీసి, వెలుగులోకి తెస్తున్న డా. నాగసూరి వేణుగోపాల్, కోడీహళ్లి మురళీమోహన్ కృషి ప్రశంసనీయమైంది. నిరంతర సాహితీ శ్రామికులైన వీరిద్దరి ఆధ్వర్యంలో మరిన్ని మంచి పుస్తకాలు వస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

No comments:

Post a Comment