Tuesday, October 27, 2015

Any body is there! (నా చదువుల బడి...కొన్ని జ్ఞాపకాలు)


ఎనీ బడీ ఈజ్ దేర్!?

బ్రేకింగ్ న్యూస్ ల నుండి స్క్రోలింగ్ వార్తల నుండి….
ఫోన్ ఇన్ ల నుండి వన్ టు వన్ ఇంటర్వూల నుండి…
యాంకర్ పార్టుల నుండి… రెండు నిమిషాల ప్యాకేజీల నుండి…
నన్ను వదిలేయండి… నా బాల్యాన్ని వెతుక్కోవడానికి వెళుతున్నాను…
ఏనీ బడీ ఈజ్ దేర్!


ఐదేళ్ళ పాటు అలుపు సొలుపు లేకుండా తిరగాడిన ప్రాంతం…
చదువుతోపాటు ఆటపాటలకు, లలితకళలకు చోటిచ్చిన సమయం..
దశాబ్దాల తర్వాత ఆ అనుభూతుల్ని స్పృశించేందుకు బయలుదేరుతున్నాను…
మదిలోతుల్లోని మధురస్మృతుల్ని ఓసారి పోగేసుకుందుకు కదులుతున్నాను…
ఎనీ బడీ ఈజ్ దేర్!


తరుచూ కలిచే స్నేహితులతో మరోసారి కరచాలనం చేయాలి…
ఫోన్ లో మాత్రమే టచ్ లో ఉన్న మిత్రులను ఆలింగనం చేసుకోవాలి…
పాత నెచ్చెలులను కళ్ళతోనే కుశలం అడగాలి…
మా ఉపాధ్యాయుల పాదధూళిని తలకు దాల్చాలి….
ఎనీబడీ ఈజ్ దేర్!


స్కూల్ ప్రాంగణంలోకి అడుగుపెడుతుంటే… గుండెలోతుల్లో…
‘ఎన్నాళ్ళో వేచిన ఉదయం…’ పాట మారు మోగింది!
తరగతి గదిలో ఆనాటి పాత టేబుల్…
‘రారమ్మని… రారా రమ్మని’ ఆహ్వానం పలికింది!
తొలిసారి నాటిక వేసినప్పుడు మాదిరే వేదిక పైకి ఎక్కుతుంటే
ఇప్పుడూ అలానే గొంతు వణికింది… కాళ్ళు తడబడ్డాయి!
ఎనీ బడీ ఈజ్ దేర్!


వందలాది విద్యార్థులు… మరెందరో ఉపాధ్యాయులు…
ప్రతి ఒక్కరి ముఖంలోనూ కాస్తంత అనుమానం… మరికాస్తంత ఆశ్చర్యం!
వాడు మా బ్యాచేనా… వీడు మన తరగతేనా… ఈవిడ… ఆ అమ్మాయేనా!
వ్యక్తుల్ని పోల్చుకునేందుకు వయసు మరిచి బాల్యంలోకి పరిగెత్తాల్సి వచ్చింది!
‘నన్ను గుర్తుపట్టలేదా!’ అని ఆశ్చర్యపోయే వాడొకడు!
‘మేమెందుకు గుర్తుంటాం?’ అంటూ నిష్ఠూరమాడేవాడు మరొకడు!
ఇంటిపేరు, వీధిపేరు, విలాసంతో సహా వివరాలు ఏకరువు పెట్టే వాడొకడు!
‘ఓహో… నువ్వా’ అనగానే కళ్ళలో వెయ్యి కాంతుల వెలుగు!
ఎనీ బడీ ఈజ్ దేర్!


తెలుగు మీడియంలో చదివి కూడా ఇంతవాడినయ్యానన్నాడొ మిత్రుడు!
మీరిచ్చిన సంస్కారంతోనే అవినీతి చెదపట్టని నిప్పులా ఉన్నానన్నాడో స్నేహితుడు!
పెద్ద పెద్ద ఉద్యోగాలను తృణప్రాయంగా భావించి వదిలేసి…
ఉపాధ్యాయుడిగా స్థిరపడి రుణం తీర్చుకుంటున్నానన్నాడో ఆత్మీయుడు!
పూర్వ విద్యార్థుల కలయిక మా అందరిలో ఆనందాన్ని నింపింది!
మా ఉపాధ్యాయులకు మాత్రం మరి కాస్తంత ఆయుష్షును పెంచింది!
ఎనీ బడీ ఈజ్ దేర్!
మళ్ళీ మరోసారి కలుద్దాం… మన క్రీడా మైదానాన్ని కాపాడుకోవడానికి,
అరాచక శక్తుల, అసాంఘిక వ్యక్తుల బారిన పడకుండా రక్షించుకోవడానికి.
జైహింద్ సెకండరీ హై స్కూల్ తో మనకున్న అనుబంధాన్ని అనుభూతుల్నీ…
రూపాయలుగా మార్చి…. ఇటుకలుగా పేర్చి… ఓ బలమైన ప్రహరీ గోడను నిర్మిద్దాం!
భావితరాలకు కానుకగా అందిద్దాం… ఇదే ఈ (అ)పూర్వ విద్యార్థుల సమ్మేళన తీర్మానం!!
ఎనీ బడీ ఈజ్ దేర్!!


- వడ్డి ఓంప్రకాశ్ నారాయణ
(హైదరాబాద్)


('ఎనీ బడీ ఈజ్ దేర్' అన్న శీర్షిక రాత్రి బందరులో రైలు ఎక్కిన దగ్గర నుండి నా మనసులో సుడులు తిరుగుతూ ఉంది. ఉదయమంతా స్కూల్ ఆవరణలో జరిగిన సంఘటనలు... మనం దిగిన ఫోటోలు కలిసిన వ్యక్తులు... రాని వాళ్ళ గురించి జరుపుకున్న ముచ్చట్లు... టీచర్ల ఆనందం... వెరసీ... ఈ అనుభూతుల మాలిక అయ్యింది. సమూహంలో ఉన్నా మనం ఒంటరే! తప్పిపోయిన మనిషి 'ఎనీ బడీ ఈజ్ దేర్' అంటూ ఆక్రోశిస్తాడు... తోడు కోసం పరితపిస్తాడు... ఎప్పుడో బాల్యాన్ని కోల్పోయిన నేను సైతంచేసిన ఆ ఆక్రందనే 'ఎనీ బడీ ఈజ్ దేర్' అన్నది. వచ్చిన వాళ్ళు తక్కువ.. రాని వాళ్ళు ఎక్కువ... ఆర్థిక కారణాల వల్లనో, అత్యవసరమైన పనుల వల్లనో ఎంతోమంది ఈ కార్యక్రమానికి రాలేదు. సమాచారం అందక కొందరు... అందినా రాలేని అశక్తతతో మరికొందరు... వాళ్ళందరి కోసం... వారిని వెతిక్కున్న నా మనసు... నా కనుల పిలుపు ' ఎనీ బడీ ఈజ్ దేర్'!)

No comments:

Post a Comment