Tuesday, October 27, 2015

మా జైహింద్ సెకండరీ స్కూల్ ... కొన్ని ఆకుపచ్చని జ్ఞాపకాలు!


జైహింద్ స్కూల్ పిలుస్తోంది... వెళ్దాం పదండి!

జైహింద్ సెకండరీ హైస్కూల్ పూర్వ విద్యార్థులంతా ఈ నెల 11వ తేదీ మచిలీపట్నంలో కలుస్తున్నారట! నేను వెళుతున్నాను.... మీరు వస్తున్నారా!?

జైహింద్ స్కూల్ తో నా అనుబంధం ఐదేళ్ళ పాటు సాగింది. ఆరవ తరగతి నుండి పదో తరగతి వరకూ! నాతో పాటు చదివిన చాలామందికి బహుశా పేరు కూడా గుర్తుండి ఉండకపోవచ్చు. ఎందుకంటే అప్పట్లో వ్యక్తి పేరును బట్టి కాకుండా ఇంటి పేరును బట్టే చాలా మంది పిలిచే వారు... పలకరించేవారూ. చివరకు టీచర్స్ కూడా 'వడ్డి' అనే పిలిచే వాళ్ళు. మా అత్తయ్యలు, బాబాయిలు, అక్కయ్య కూడా నా ముందు ఆ స్కూల్లోనే చదివారు. నా తర్వాత మా తమ్ముడు, చెల్లి కూడా అదే స్కూల్లో చదవడం జరిగింది. 
జైహింద్ స్కూల్ అనగానే ఎన్నో పాత సంగతులు జ్ఞప్తికి వస్తుంటాయి. ఆరవ తరగతిలో చేరిన కొత్తలో... మా తరగతి గది వెనకే... ప్రహరి అవతల ఓ ముసలామె ఉండేది. ఓసారి నా స్నేహితులతో కలిసి... ఆవిడ ఉండే గుడిసె దగ్గరకు వెళ్ళాను. ఓ అడుగు పొడవుండే బద్ద మీద మందులేని అగ్గిపులల్ని పేర్చుతూ కనిపించింది. ఏమిటని అడిగితే... ఒక్కో బద్ద మీద దాదాపు పాతిక పుల్లలు పేర్చాలని, అలాంటి ఇరవై బద్దల్ని ఓ ఫ్రేమ్ గా బిగించి ఇస్తే... సదరు అగ్గిపెట్టె కంపెనీ వాళ్లు ఫ్రేమ్ కు పదిపైసలు చొప్పున ఇస్తారని చెప్పింది. అగ్గిపెట్టె ధరే అప్పట్లో పది పైసలు ఉండేది కాబట్టి. దానికి సంబంధించి పని చేస్తున్న వాళ్ళకు అంత తక్కువ డబ్బులు ఇచ్చేవాళ్ళేమో... 'అమ్మో... ఈవిడ ఎన్ని ఫ్రేములు బిగిస్తే... ఓ రూపాయి వస్తుందో... ఎన్ని రూపాయలు వస్తే ఓ రోజు గడుస్తుందో?' అని అనిపించింది. అప్పటి నుండి నాతో పాటు నా మిత్రులు కొందరు స్కూల్ ఇంటర్వెల్ సమయంలో ఆమె గుడిసెకు వెళ్ళి అగ్గిపుల్ల ముక్కల్ని చెక్కబద్ద మీద పేర్చి ఆవిడకు సహాయం చేస్తుండేవాళ్ళం. ఏడవ తరగతికి వచ్చే సరికీ మా క్లాస్ రూమ్ మారిపోయింది. దానికి తోడు ప్రహరీ వెనకవైపు తలుపు తీసేసి... గోడ కట్టేశారు. దానితో ఆవిడ దగ్గరకు వెళ్ళాలంటే... స్కూల్ చుట్టుతిరిగి వెళ్ళాల్సి వచ్చేది. ఇంటర్వెల్లో వెళ్ళి రావడానికి సమయం సరిపోయేది కాదు... దాంతో మా దృష్టి ఆటల మీద పడిపోయింది. నిదానంగా మా స్మృతిపథం నుండి ఆమె చెరిగిపోయింది. ఇవాళ మా స్కూల్ ను అందులోకి నేను అడుగుపెట్టిన రోజుల్ని తలుచుకుంటే... ఆ అవ్వ... ఆవిడ పేర్చిన అగ్గిపుల్ల బద్దలు... మేం చేసిన ఉడుత సాయం కళ్ళ ముందు మెదిలాయి. (2015)

No comments:

Post a Comment