Sunday, May 22, 2011

sri kandarpa ramachandrarao garu

సీనియర్ జర్నలిస్ట్ శ్రీ కందర్ప రామచంద్రరావు గారు (80)  ఈ నెల 17న పరమపదించారు. 1950 ప్రాంతంలో జాగృతిలో సహా సంపాదకులుగా పాత్రికేయ జీవితం ప్రారంభించిన రామచంద్రరావు గారు ఆ తర్వాత 1975 లో ఆంధ్రపభలో సంపాదక మండలిలో పనిచేశారు. మొన్నటి వరకు గాయత్రి పరివార్ పత్రిక యుగశక్తి గాయత్రీకి సంపాదకులుగా వ్యవహరించారు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు... ఏ పౌరాణిక విషయాన్నైనా పామరులకు సైతం అర్ధమయ్యేలా రాయగలగడం ఆయన గొప్పతనం. చివరి శ్వాస వరకు రచనల్ని కొనసాగిస్తూనే వున్నారు. ఆంగ్లం నుండి తెలుగులోకి, హిందీ నుండి తెలుగులోకే కాదు స్వయంగా ఆంగ్లంలోనూ రచనలు చేశారు. పండిత్ దీనదయాల్ ఉపాద్యాయ ప్రవచించిన 'ఏకాత్మ మానవతా వాదం' ను 'ఇంటిగ్రల్ హ్యుమనిజం' పేరుతో ఆంగ్లంలో రాశారు.
జర్నలిస్టుగా నా జీవితాన్ని ప్రారంభించినపుడు ఎంతో సహనంతో సలహాలను ఇచ్చిన గురువులలో కందర్ప గారూ ఒకరు. ఎప్పుడు ఎక్కడ కనిపించినా 'ఎలా వున్నావ్, ఎక్కడ వున్నావ్' అంటూ ఆప్యాయంగా భుజంతట్టి అభినందించే వారు.
ఆ విద్వన్మణి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను.


Tuesday, May 17, 2011

ఓ పెళ్లి... కొన్ని (చేదు) జ్ఞాపకాలు!

ఎన్టీఆర్ పెళ్లి గురించి మీడియాలో ఆహ ఓహో అంటూ వచ్చింది. నిజంగానే పెళ్లి చాలా బాగా జరిగింది. కానీ ఆహుతులు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు. స్టార్స్ పెళ్ళిలో ఇలాంటివి సహజమే అనే వాళ్ళు లేకపోలేదు. అయితే భోజనాల దగ్గర జరిగిన అరాచకం అంత ఇంత కాదు. టేబుల్ మీల్స్ పెట్టడం తో పెద్ద గందర గోళం  ఏర్పడింది. మీడియా పీపుల్ భోజనానికి వెళుతుంటే సెక్యురిటి సిబ్బంది పాసులు లాగేసుకుని దురుసుగా ప్రవర్తించారు. మీడియా నిరసన వ్యక్తం చేయడంతో కళ్యాణ్ రామ్ సారీ చెప్పారు. గొడవ సద్దుమణిగి భోజనాలకు వెళితే అక్కడ ఎవరికీ భోజనాలే లేవు. కనీసం మంచి నీళ్ళు లేవు. ఎన్టీఆర్ పెళ్ళిలో విందు కోసం 'అక్కడ నుండి పూత రేకులు, ఇక్కడ నుండి హల్వా, వేరెక్కడ నుండో బొబ్బట్లు, ఇంకెక్కడ నుండో సున్నుండలు వస్తున్నాయని' చెవిలో ఇల్లు కట్టుకుని చావగొట్టిన మీడియా వాళ్ళకు ఆ పెళ్లిలో చివరకు పస్తే దిక్కైంది.  ఆ కాళరాత్రి ... ఎన్టీఆర్ కళ్యాణ మండపం వెనక జాగారం చేస్తున్న మీడియా మిత్రుల ఫోటో ఇది...