Sunday, July 28, 2013

శ్రీ అక్కినేని రవిశంకర్ ప్రసాద్… కొన్ని జ్ఞాపకాలు!

ఒక వ్యక్తిని ఎప్పుడు ఎక్కడ ఎలా కలుస్తామో… ఏ రకంగా ఆయన మన జీవితంలో మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోతారో నిజంగానే ఓ మిస్టరీ! ఇటీవల కన్నుమూసిన ప్రముఖ నిర్మాత రవిశంకర్ ప్రసాద్ గారితో నా అనుబంధం అలాంటిదే. చిరంజీవి హీరోగా నటించిన ‘శంకర్ దాదా ఎం.బి.బి.యస్.’ చిత్రానికి ఆయన నిర్మాత. ఆంధ్రజ్యోతి దిన ప్రతిక ఫిల్మ్ రిపోర్టర్ గా ఆయన ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది. రవిశంకర్ ప్రసాద్ ఉండేది చెన్నైలో, అయితే సినిమా విడుదల సందర్భంగా 2004 అక్టోబర్ మాసంలో ఆయన హైదరాబాద్ వచ్చారు. పి.ఆర్.ఓ. వేణుగోపాల్ ద్వారా ఆయన అపాయింట్ మెంట్ తీసుకున్నాను.

జెమినీ టీవీ ఛానెల్ అధినేత, పెద్ద బిజినెస్ మేగ్నేట్, అన్నింటినీ మించి నేను ఎంతో గౌరవించే, భారతదేశం గర్వించే సినీ ప్రముఖుడు స్వర్గీయ ఎల్.వి. ప్రసాద్ గారికి రవిశంకర్ ప్రసాద్ స్వయాన మనవడు. ఈ కారణాల చేత కాస్త నెర్వస్ గానే ఆయన గదిలోకి అడుగుపెట్టాను. నన్ను చూడగానే లేచి నిలుచుకుని ఆప్యాయంగా షేక్ హ్యాండ్ ఇచ్చారు. దాంతో సగం టెన్షన్ తగ్గిపోయింది. ఆ తర్వాత సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూ సరదాగా సాగిపోయింది. ఈలోగా టీ వచ్చింది. దానిని తాగుతూ ఉంటే, ఆయన రాజమండ్రిలో తాను ప్రారంభించిన ఆనందీ రెసిడెన్సి హోటల్ గురించి చెప్పారు. ఎన్నో సౌకర్యాలను కల్పిస్తున్నా… కస్టమర్ల ను హోటల్ కు తీసుకు రాలేకపోతున్నామని, ఆ అంశం రైల్వేస్టేషన్ లోనూ, బస్ స్టేషన్ లోనూ ఉండే రిక్షావాళ్ళ చేతుల్లో ఉంటుందని అన్నారు. తాను ఓ సారి స్వయంగా రిక్షాలో తన హోటల్ కు వెళ్ళినప్పుడు ఈ విషయం బోధపడిందని చెప్పారు.

ఈ విషయాన్ని తీసుకుని కథ ఎందుకు రాయకూడదూ అని నా మనసుకు అనిపించింది. ఆయన సమస్యకు నాదైన పరిష్కారాన్ని ఆలోచించి… ‘అదీ సంగతి’ అనే పేరుతో ఓ చిన్న కథ రాశాను. దానిని నవ్య వీక్లీ ఎడిటర్ శ్రీరమణగారు చదివి బాగుందని, 2005 ఫిబ్రవరి 9, సంచికలో ప్రచురించారు.

తర్వాత ఎప్పుడైనా కలిసినప్పుడు రవిశంకర్ ప్రసాద్ గారికి ఈ విషయాన్ని చెప్పాలని అనుకున్నాను. కానీ నాకు ఆ అవకాశం కలగలేదు. ఈ నెల 8వ తేదీ భగవంతుడు ఆ అవకాశాన్ని శాశ్వతంగా దూరం చేశాడు.



Monday, July 8, 2013

సివిఆర్ న్యూస్ ఛానెల్ బిజినెస్ బ్యూరో చీఫ్ నాగేంద్ర సాయి 'నేను నా పైత్యం' బ్లాగ్ లో 'మనసు తడి ఆరనీకు' పుస్తకం గురించి వెలుబుచ్చిన అభిప్రాయం!



"మనసు తడి ఆరనీకు "
ముఖపరిచయమే కానీ.. పెద్దగా మాట్లాడిందీ లేదూ.. పెద్దగా స్నేహం చేసిందీ లేదు. హలో అంటే హలో అనేయటమే తప్ప ఓం ప్రకాశ్ గారితో నాకేమీ అంత సాంగత్యం లేదు. కానీ ఈ మధ్య ఆయన ఓ పుస్తకం లాంఛ్ చేశారని ఫేస్ బుక్ లో చూసి ఏదో అనుకున్నా. సినిమా రిపోర్టింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్లకు ఇలాంటి తరహా పైత్యం ఉంటుందిలే అని అప్పట్లో అనుకున్నా. కానీ రెండు రోజుల క్రితం ఆయన మా శ్రీమతికి తను రాసిన "మనసు తడి ఆరనీకు" అనే పుస్తకాన్ని ఇచ్చి ప్రియమిత్రుడు నాగేంద్రసాయి అని సంబోధించారు. నాకే అశ్చర్యం వేసింది. సరే కథల పుస్తకమే కదా.. చదివేస్తే పోలా అంటూ.. కూర్చున్నా.. ఏకబిగిన పుస్తకాన్ని చదివేశానని నాకే ఆ తర్వాత అర్థమైంది. ఎందుకంటే నేను అలా చదివిన పుస్తకాలు వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఎందుకంటే నాకు చదవడం నా ఒంటికి అంతగా పడదని మొదట్నుంచీ ఫీలవుతాను.

సరే ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకు కానీ.. డైరెక్టుగా పాయింట్ కు వచ్చేస్తున్నా. ఓం ప్రకాశ్ నారాయణ వడ్డి గారు ప్రస్తుతం ఎబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఫిల్మ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నారు. నేను సాక్షి టీవీలో పనిచేసినప్పుడు కొద్దిగా పరిచయం. కానీ ఈ పుస్తకం చదివిన తర్వాత అనిపించి.. అరే.. ఇంతకాలం అంత పెద్ద 'కథా'నాయకుడు పక్కన ఉండి కూడా పెద్దగా పట్టించుకోలేదే అని. అంత బావున్నాయి ఇందులో కథలన్నీ. మొత్తం 23 కథలు.. ఒక్కో కథ ఒకొక్కరి హృదయాన్ని తాకుతుంది అనడంలో అతిశయోక్తి కానేకాదు. మనసు తడి ఆరనీకు అని టైటిల్ పెట్టారే కానీ.. అందులో.. ప్రతీ ఒక్క కథ చదువుతున్నప్పుడు.. మనసు తడుస్తూనే ఉంది.. తెలిసో... తెలియకో... ! వయస్సులో ఉన్న అమ్మాయిలకు, అబ్బాయిలకు, ఉద్యోగం చేసుకుంటున్నవాళ్లకు, ఫెమినిస్టులని చెప్పుకునే వాళ్లకు, భార్యలకు - భర్తలకు, అమ్మలకు.. అమ్మమ్మలకూ.. ఏ ఒక్కరినీ వదలకుండా.. ప్రతీ ఒక్కరికీ ఇందులో స్థానం కల్పించారు ఓం. కథలే కదా చెప్పడం ఈజీ అనుకున్నా.. కానీ పూర్తైన ప్రతీ కథ వెనుకా ఏదో ఒక పరమార్థం దాగే ఉంది. ఏదో ఒక మెసేజ్ బాటమ్ లైన్లో ఉండనే ఉంది. కొన్నింటికి అర్థాలు మనకే స్వయంగా బోధపడ్తాయి. రెండు కథలు సినిమాకు సంబంధించినవి కూడా ఉన్నాయి. బహుశా ఇవి తన జీవితంలో ఎదురైన సంఘటనలు కాబోలు. స్టాక్ మార్కెట్ కు సంబంధించిన కథ కూడా ఒకటుంది.. ఆశ్చర్యంగా.. !  సమాజంలో ఉన్న మనుషులను కొన్ని చోట్ల సుతిమెత్తగా చీవాట్లు పెడుతూనే మరికొన్ని చోట్ల కన్నతల్లి హృదయ వేదనను "అమ్మ అమ్ముడుపోలేదు " అని రాశాడు. జాతి, మతం వంటి జాడ్యాలను ఎత్తిపొడుస్తూ.. "మనవాడేనా" అనే కథలో పొందుపరిచారు. భర్తకు సేవలు చేయడమే భార్యకు దిక్కా.. అంటూ ఓ స్త్రీలో ఉన్న ఫెమినిస్టును నిద్రలేపి.. మళ్లీ కుటుంబంలో ఆమె పాత్రేంటి.. ఆమెను భర్తా, పిల్లలు ఎలా చూసుకుంటున్నారో సవివరింగా చెప్పి మేలుకునేలా చేస్తారు. డబ్బు, హోదా, ఉరుకులు - పరుగులు, టార్గెట్లు ఇదేనా జీవితం.. ఇంతకంటే ఇంకా చాలా ఉందనే మెసేజ్ చాలా కథల్లో కనిపిస్తుంది మనకు. కొన్ని కథల్లో మరాఠీ వాసన కూడా గుభాళించింది. చివర్లో అందరి ఇళ్లల్లో ఉండే మార్నింగ్ వాక్ టాపిక్.. హాట్ టాపిక్ అయింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు. పొట్ట తగ్గించమని భార్య నసుగుడు.. వాకింగ్ వెళ్లమంటూ సాధింపుల వంటివి ఎంత కామనో.. హాస్యంగా చెప్పి ముగించారు ఓం.

మొత్తానికి ఒక్కో కథ ఒక్కో సందేశం. అలా అని ఇదేదో జాతిని ఉద్ధరించే పుస్తకం మనం చదవలేం అనుకోవడానికి లేదు. అన్నీ అలతి అలతి మాటలతో అందరికీ అర్థమయ్యేట్టు.. ప్రతీ ఒక్కరీ జీవితంలో ఎప్పుడో ఏదో ఒక చోట జరిగిన సంఘటన ఆధారంగా గుదిగుచ్చినట్టు ఉండే కథల దండ ఈ "మనసు తడి ఆరనీకు".
( ఈ కథలన్నీ ఈనాడు, జ్యోతి, ప్రభ, జాగృతి వంటి పత్రికల్లో ప్రచురితమైనవే.. )

పుస్తకం పేరు - మనసు తడి ఆరనీకు
రచయిత - ఓం ప్రకాశ్ నారాయణ వడ్డి
ప్రతులకు -
సాహిత్యనికేతన్, కేశవ నిలయం, బర్కత్ పురా, హైదరాబాద్ 040 27563236
సాహిత్యనికేతన్, గవర్నర్ పేట్, ఏలూరు రోడ్, విజయవాడ - 0866 - 6667421

పేజీలు - 153
వెల రూ. 90

- నాగేంద్ర సాయి