Tuesday, April 9, 2013



కలగూరగంపగా 'బాద్‌ షా'

కోట్లు ఖర్చుపెట్టే నిర్మాత, భారీ పారితోషికానికి ఆశపడి డేట్స్‌ ఇచ్చే హీరో... ఈ ఇద్దరూ ఉంటే చాలు ఎంత భారీ చిత్రమైనా ఇట్టే సిద్ధం అయిపోతుంది. కథారచయిత కసరత్తు చేయాల్సిన పనిలేదు, మాటల రచయిత మధనపడాల్సిన అవసరం లేదు, సంగీత దర్శకుడికి సమయం ఇవ్వక్కర్లేదు. డబ్బు, డేట్స్‌ ఈ రెండు సమకూరితే, పిల్లాడికి నిమిషంలో మ్యాగీ చేసిపెట్టినంత తేలిగ్గా భారీ చిత్రాలను వండి వార్చేస్తున్నారు. పాత దినుసులు ఎలానూ ఉంటాయి, స్టోర్‌లో కొన్ని ట్యూన్స్‌ కాస్త అటూ ఇటూ చేసెయొచ్చు. కావలసిన కామెడీ, కాస్త సెంటిమెంట్‌, కనుల విందు చేసే ఫారిన్‌ లొకేషన్లు, పెద్ద హీరో కాబట్టి కాస్త సామాజిక అంశాలు ఇవన్నీ మిక్సీలో వేసి రుబ్బేస్తే సినిమా సిద్ధం. ఇలాంటి కలగూరగంపే తాజాగా వచ్చిన జూనియర్‌ ఎన్టీయార్‌ 'బాద్‌షా' కూడా!

ఇలాంటి సినిమాల కథల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. ఎందుకంటే పాత కథలను కొత్తగా చెప్పడం కంటే ఇంకేమీ ఇందులో ఉండదు. అయినా కథా ప్రస్తావన అవసరం కాబట్టి చెప్పుకుందాం. అనగనగా ఓ బాద్‌షా. అతని తండ్రి విదేశాలలో జూదశాల నిర్వహిస్తుంటాడు. అండర్‌ వరల్డ్‌ డాన్‌తోనూ అతనికి సంబంధాలు ఉంటాయి. ఆ డాన్‌ ఆషామాషీ వాడు కాదు. దేశ సమగ్రతకు ముప్పువాటిల్లేలా ప్రవర్తించే పరమ కిరాతకుడు. భారతదేశాన్ని అతలాకుతలం చేస్తూ బాంబ్‌ బ్లాస్ట్‌లకు పాల్పడుతుంటాడు. బాద్‌షా ఓ ఆపరేషన్‌ నిమిత్తం ఇటలీ వెళతాడు. అక్కడ కథానాయిక బంతి జానకితో అనుబంధం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. ఆమె వివాహం వేరే వాడితో నిశ్చయం అయిందని తెలుసుకుని దానిని చెడగొట్టడానికి జానకితో కలిసి భారతదేశానికి వస్తాడు. పెళ్ళి నిర్వాహకుడి ముసుగుతో జానకి ఇంట్లో తిష్టవేస్తాడు. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యుల మెప్పుపొందుతాడు. జానకి కాబోయే భర్త, మావ భరతం పట్టడంతో పాటు, దారి తప్పిన తండ్రిని దారిలోకి తెస్తాడు, పనిలో పనిగా దేశద్రోహులనూ తుద ముట్టిస్తాడు. ఇంతా చేస్తే 'బాద్‌షా' ఎవరో కాదు అండర్‌ కాప్‌ అనే విషయాన్ని శ్రీను వైట్ల చల్లగా చివరిలో రివీల్‌ చేస్తాడు.

ఈ సినిమా చూస్తున్నంత సేపు మనకు ఈ మధ్యే వచ్చిన ఏవేవో సినిమాలు కళ్ళముందు మెదులుతాయి. 'హిట్‌ ఫార్ములానే పట్టుకున్నాం కాబట్టి సక్సెస్‌ ఖాయం' అనే ధీమాతో దర్శక నిర్మాతలు కోట్ల రూపాయలు గుమ్మరించారనిపిస్తుంది. కామెడీ పేరుతో అరాచకం సృష్టించడం ఇప్పుడు ఫ్యాషన్‌ అయిపోయింది. కమెడియన్లు, హీరోహీరోయిన్ల తాగుడు ప్రహసనం ఇప్పుడు ఫ్యామిలీ లేడీస్‌కూ పాకించేశాడు శ్రీను వైట్ల. కూల్‌ డ్రింగ్‌లో మందు కలిపి, హీరోయిన్‌ తల్లితో సహా ఆడవాళ్ళందరితో రికార్డింగ్‌ డాన్సులు చేయించడం పైత్యానికి పరాకాష్ట.

నటీనటుల విషయానికి వస్తే, ఎన్టీయార్‌కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. జస్టిస్‌ చౌదరిగా కనిపించడం, పెద్దాయనను అనుకరిస్తూ, ఆయన చేసిన ఐటమ్‌సాంగ్స్‌ను ఇమిటేట్‌ చేయడమూ నందమూరి అభిమానుల్ని తనవైపు తిప్పుకోవడానికి చేసిన ప్రయత్నంలో భాగమే. కాజల్‌ మొదటిసారి పూర్తి స్థాయి వినోదాత్మక పాత్రలో మెప్పించింది. నాజర్‌, బ్రహ్మానందం పాత్రలు అతిగా ఉన్నాయి. 'దూకుడు' తరహాలో ఎమ్మెస్‌ను ఉపయోగించుకోవాలని చూసినా, అది పెద్దగా పేలలేదు. కథలో సత్తాలేదని తెలిసే కాబోలు అదనపు హంగుల కోసం ఆరాటపడ్డారు. మహేశ్‌బాబు వాయిస్‌ తో కథ నడిపించడం, సిద్ధార్థ్‌ గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇవేవీ సినిమాకు ఉపయోగపడలేదు. ఇక తమన్‌ బాణీలు, నేపథ్యసంగీతం అంతంత మాత్రమే.

ఇదిలా ఉంటే... దర్శకుడు శ్రీను వైట్ల, రచయిత కోన వెంకట్‌, గోపీమోహన్‌ మధ్య కోల్డ్‌వార్‌ సినిమా విడుదలకు ముందు బయట పడింది. ఒకరి మీద ఒకరు మీడియాలో పరోక్ష వ్యాఖ్యలు చేయడం కొసమెరుపు. ఇదిలా ఉంటే మరోవైపు జూనియర్‌ ఎన్టీయార్‌ బొమ్మను వైసీపీ నేతులు ఫెక్సీలలో వాడుకోవడంతో అది మరో వివాదానికి తెర తీసింది. నందమూరి కుటుంబంలోని ఈ వింత ధోరణి ప్రభావం 'బాద్‌ షా' మీద కూడా పడింది. నందమూరి కుటుంబాన్ని కాదని జూనియర్‌ ఎన్టీయార్‌ ముందుకు వెళితే అతని సినిమాలను ఆదరించబోమని బాలకృష్ణ అభిమానులు పరోక్షంగా హెచ్చరికలు చేస్తున్నారు.

ఇప్పుడు 'బాద్‌ షా'లోని విషయం కంటే, వివాదాలే మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి. ఇంత గందరగోళ వాతావరణంలో, ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించి 'బాద్‌ షా' ముందుకు సాగడం కష్టమే అనిపిస్తోంది! నిర్మాత బండ్ల గణేశ్‌ మాత్రం 'బాద్‌షా బ్లాక్‌ బస్టర్‌' అంటున్నారు. మరికొన్ని రోజుల్లో ఇది 'బ్యాడ్‌ షో' నా... 'బాద్‌షా' నా అనేది తేలిపోతుంది!!

Baadshah movie review


శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది కార్టూన్లు !