Monday, June 10, 2013

'సూర్య' సాహిత్యం పేజీలో 'మనసు తడి ఆరనీకు' గురించి...

ఇలా ఎవరూ రాయలేదు!

ఇతనే- ఈ రచయితే- అన్ని కథల్లో ఉన్నాడు. తనను తాను అన్ని కథల్లో పరచుకున్నాడు. తన శక్తి, యుక్తి, వ్యక్తిత్వం కథలకు పంచి ఇచ్చాడు. తనలోని ఇంతింత ఈ కథలు కొల్లగొట్టాయి. ఇలా ఈ కథలు రాద్దామని కూర్చున్నా ఎవరూ రాయలేరు. అంతా అమాయకత్వం. ఏ డాబుసరీ లేదు. ఏ అహంకారం లేదు. ప్రేమ... త్యాగం... జాలి... దయ. మనుషులు బాగుండాలి. మానవత్వం పండాలి. ఈ కథల్లో విలన్‌లు ఉండరు. హీరోలందరూ ప్రేమైక మూర్తులు. ఇంత ప్రేమ సాధ్యమా? అసాధ్యం అనిపించదు. అసహజం అనిపించదు. ఈ సమాజం ఇంత ఉన్నతంగా ఉంటే ఎంత బాగుంణ్ణు! రచయిత మనల్ని ఆశాజీవుల్ని చేస్తాడు. మన గుండె తలుపులు తడతాడు. అదీ ఏదో పెద్ద ప్రయత్నంగా చేయడు. అలవోకగా చేస్తాడు. ఉపన్యాసాలివ్వడు. మీరీ కథలు చదవండి. ముందుగా మీరు మీ భార్యని కొత్తగా చూస్తారు. ప్రేమగా చూస్తారు. మీ భర్తను అనురాగంతో చూస్తారు. ఆరాధిస్తారు. మీరు భర్తగా ‘పాల మనిషి వచ్చాడు, పాలు తీసుకురా’ అని భార్యకు చెప్పరు. మీరు పోయి పాలు తీసుకు వస్తారు. బూట్లు తుడవమనరు, తుడుచుకుంటారు. రాత్రి వంట చేస్తారు, వడ్డిస్తారు.

ఇంటిపనిలో, వంటపనిలో, పిల్లల పనిలో, పై పెచ్చు ఆఫీసుపనితో అలిసిపోయే భార్యకు సహాయం చేస్తారు. అలిసిపోనివ్వరు. మీకో అదృష్టం కూడా కలిసి వస్తుంది. అలిసిపోని భార్య మీకిచ్చే ఆనందం అమృతంలా జుర్రుకొంటారు. ఇది పురుష దృష్టి. మీరు గుర్తుంచుకోవలసింది స్ర్తీ దృష్టి కూడా. మీ యోగక్షేమాల కంటే ఆమెకేదీ ముఖ్యం కాదు. ఎంత త్యాగమైనా చేస్తుంది. ఎంతయినా ఓర్చుకుంటుంది. ఓంప్రకాశ్‌ తన కథల్లో ఎంతో మంచి స్ర్తీ పురుషుల్ని నిలబెట్టాడు. వాళ్ళను చూస్తుంటే మనకు సంతోషం కలుగుతుంది. మనం కూడా ఈ స్ర్తీ పురుషులులాగా ఉందామని ఆశ పుడుతుంది.

 
మనసు తడి ఆరనీకు
కథలు 23
ఓంప్రకాశ్‌ నారాయణ వడ్డి
వెల: రూ. 90
ప్రతులకు
అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలు
- ఆచార్య కొలకలూరి ఇనాక్‌

Saturday, June 1, 2013

ఆంధ్రభూమి దిన పత్రికలో 'మనసు తడి ఆరనీకు' సంక్షిప్త పరిచయం!

అందరికీ శుభోదయం!
ప్రచురించాలా వద్దా... అన్నట్టుగా దినపత్రికలు ఆదివారం అనుబంధంలో నాలుగు పేరలతో పుస్తకాల సమీక్షలు చేస్తున్న రోజులివి. అటువంటి సమయంలో ఆంధ్రభూమి దిన పత్రిక ఏకంగా పుస్తకాల సమీక్ష కోసం ఓ పూర్తి పేజీని (వారంలో ఒక రోజు) కేటాయించడం నిజంగా అభినందించదగ్గది. ఆ పత్రికలో నా కథల పుస్తకానికి సంబంధించి కూలంకషమైన సమీక్ష వస్తుందని భావించాను. కానీ ఈ రోజు వచ్చిన దిన ప్రతికలో కేవలం 'పరిచయం' మాత్రం చేశారు. (ఇక సమీక్ష చేయకపోవచ్చునేమో తెలియదు). 'మీ కథలు భేష్' అంటూ భుజం తట్టి వదిలేయడం బాధగానే ఉంది. అయినా అవి మంచి మాటలు కాబట్టి మీతో పంచుకుంటున్నాను. ఈ పరిచయంలో పేర్కొన్న ముగ్గురు మూర్తుల ముందు మాటల సారాన్నీ మీరీ చివరి అట్టలో చూడొచ్చు! ఈ పుస్తకం ఎక్కడ లభ్యమౌతుందని కొందరు మిత్రులు అడుగుతున్నారు. www.kinige.com ద్వారా e-book పొందవచ్చు. లేదా సాహిత్యనికేతన్, 3-4-852, కేశవ నిలయం, బర్కత్ పురా, హైదరాబాద్ - 27, ఫోన్: 04027664525 లో పుస్తకాన్ని కొనుక్కోవచ్చు!