Sunday, November 23, 2014

'Pilla Nuvvuleni Jeevitham' Movie review


'
రేయ్'తో ఎంట్రీ ఇవ్వాల్సిన చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ 'పిల్లా నువ్వులేని జీవితం'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రెజీనా హీరోయిన్ గా నటించిన సినిమాకు అల్లు అరవింద్, దిల్ రాజు నేతృత్వంలో బన్నీవాసు, హర్షిత్ నిర్మించారు. మెగా క్యాంప్ నుండి వచ్చిన లేటెస్ట్ హీరో సాయిధరమ్ తేజ్ ఎలాంటి మెప్పు పొందుతున్నాడో చూద్దాం.

అధికారపార్టీకి చెందిన ప్రకాశ్ రాజ్, షయాజీ షిండే ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీపడుతుంటారు. అయితే అదే సమయంలో షయాజీ షిండే చేసిన స్కామ్ లను ఛానెల్ లోని ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ షఫీ బయటపెట్టడంతో అతని చేతుల్లోకి రావలసి సీ.ఎం. పదవి చేజారిపోతుంది. రిపోర్టర్ షఫీని చంపేయమని జగపతిబాబుకు సుపారీ ఇస్తాడు పోలీస్ అధికారి. ఇదిలా ఉంటే... సాయిధరమ్ తేజ తన తోటి స్టూడెంట్ శైలజను ప్రేమిస్తాడు. అనాథ అయిన ఆమె తన గతం గురించి షఫీకి తెలియడంతో అతన్ని వెతుకులాడే పనిలో పడుతుంది. ఆమెకు తనవంతు సాయం అందించడానికి సాయిధరమ్ సహాయం చేసినా... శైలూ అపార్థం చేసుకుంటుంది. పైగా శైలుకు జగపతిబాబు ద్వారా ప్రాణాపాయం ఉందని తెలిసి...అతనితో ఢీ కొట్టడానికీ సాయిధరమ్ సిద్ధపడతాడు. శైలు గతం తెలిసిన జర్నలిస్ట్ షఫీ బతికే ఉన్నాడా? శైలుని చంపాల్సిన అవసరం జగపతిబాబుకు ఎందుకొచ్చింది? సి.ఎం. సీటు కోసం పోటీపడుతున్న ఇద్దరు ప్రత్యర్థుల్లో నీతిమంతులు ఎవరు? తన ప్రేమను గెలిపించుకోవడం కోసం... హీరో ఏం చేశాడన్నది సినిమా ద్వితీయార్ధం!

ఆద్యంతం ఆసక్తికరంగా కథను నడపడంలో దర్శకుడు .ఎస్. రవికుమార్ చౌదరి సక్సెస్ సాధించాడు. మరీ ముఖ్యంగా ప్రథమార్ధంలో హీరో తన కథను జగపతిబాబుకు చెప్పడం, ద్వితీయార్థంలో జగపతిబాబు తన కథను ప్రకాశ్ రాజ్ కు చెప్పడం చాలా ఆసక్తికరంగా ఉంది. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఊహకందని ట్విస్టులతో, కడుపుబ్బ నవ్వించే కామెడీతో చకచకా సాగిపోయింది. అయితే ద్వితీయార్ధంకు వచ్చేసరికీ కథ కాస్తంత తప్పటడుగులు వేసింది. ప్రకాశ్ రాజ్ నిజ స్వరూపం తెలియచేయడంతో నిజానికి సినిమా పూర్తయిపోయింది. అతనిలో పరివర్తన రావడం కోసం హీరో చేసే ప్రయత్నమే సినిమాకు గుదిబండగా మారిపోయింది! ఎపిసోడ్ మొత్తం ప్రేక్షకులకు చికాకు తెప్పించేదిగా ఉంది. విషయంలో దర్శక నిర్మాతలు కాస్తంత జాగ్రత వహించి ఉంటే... సినిమా రేంజ్ మరింత పెరిగేది. 

ఇక నటీనటుల విషయానికి వస్తే... సాయిధరమ్ తేజ నటుడిగా నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. డాన్సులు, ఫైట్స్ బాగానే చేశాడు. కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ ఫర్వాలేదనిపిస్తాయి. అయితే మావయ్యలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ నుండీ వీలైనంత త్వరగా బయటకు వస్తే మంచిది. లేకపోతే... ప్రేక్షకులు మొనాటనీ ఫీలయ్యే ప్రమాదం ఉంది. ఇది రెండో సినిమా అనే దృష్టితో హీరో ఇంట్రడక్షన్ కు ఓవర్ హైప్ ఇవ్వకపోవడం కూడా కాస్తంత కలిసివచ్చింది. రెజీనా ఎప్పటిలానే క్యూట్ గా అలరించింది. జెపీ, చంద్రమోహన్, రజిత, దువ్వాసి మోహన్ సినిమా ప్రారంభంలో చక్కని నవ్వులు పంచారు. తర్వాత బాధ్యతల్ని రఘుబాబు, ప్రభాస్ శ్రీను, సత్యకృష్ణ కంటిన్యూ చేశారు. 'లెజెండ్' తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతిబాబు మళ్ళీ అంత చక్కగా నటించిన సినిమా ఇదే! కామెడీ కూడా బాగా పండించారాయన. బహుశా శ్రీహరి పాత్ర పూర్తి చేసి ఉంటే... రొటీన్ గా ఉండేది. అనూప్ రూబెన్స్ బాణీలు, గౌతంరాజు ఎడిటింగ్ బాగున్నాయి. దర్శకుడు .ఎస్. రవికుమార్ చౌదరే చిత్రానికి కథ, మాటలు, చిత్రానువాదం కూడా సమకూర్చాడు. అన్ని విభాగాలను సమర్థవంతంగా నిర్వహించాడు. క్లయిమాక్స్ విషయంలో కాస్తంత జాగ్రత్త పడిఉంటే మరింత బాగుండేది! ఏదేమైనా నటుడిగా సాయిధరమ్ తేజ తొలి చిత్రంతోనే పాస్ మార్కులు సంపాదించుకున్నాడు.