Wednesday, August 2, 2023

MLC and MP

 


Cartoon on Threads

 


Karthik with Martinoz

 


కుర్రాళ్ళోయ్... కుర్రాళ్ళు!

జూన్ 29న మా రవి పాడి బావ ఫోన్ చేసి... ‘మీ మేనల్లుడు ప్రణీత్ పూనే లోనే ఉన్నాడా?’ అని అడిగారు. వాడికి ఫోన్ చేస్తే... అంబర్ నాథ్ లో వాళ్ళ పాప మొక్కులు తీర్చుకునే పనిలో ఉన్నానని చెప్పాడు. అదే మాట బావకు చెప్పాను. ‘సర్లే... నా పని బెంగళూరుకు మారిందన్న మాట’ అని చెప్పి ఫోన్ కట్ చేశారు. ఆ తర్వాత పదిరోజులకు నా వాట్సప్ కు ఓ ఫోటో వచ్చింది. అందులో రవి పాడి బావ వాళ్ళ పెద్దబ్బాయి కార్తికేయ అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్ తో దిగిన ఫోటో ఉంది. దాన్ని చూడగానే నేను ఆశ్చర్యపోయాను... మా అబ్బాయి కార్తికేయకు దాన్ని చూపిస్తే... ‘కార్తీక్ అన్న... మార్టినెజ్ తో ఫోటో దిగాడా? ఆయన ఎంత గొప్ప ఫుట్ బాల్ ప్లేయరో తెలుసా?’ అనేశాడు.
నిజం చెప్పాలంటే... ఆ క్షణం వరకూ నాకు ఎమిలియానో మార్టినెజ్ గురించి ఏమీ తెలియదు. అదే మాటను మా రవి పాడి బావతో చెబితే, అర్జెంటీనా దేశాన్ని విశ్వవిజేతగా నిలపడంలో మార్టినెజ్ పాత్ర ఏమిటనేది ఆయన వివరిస్తే... నోరెళ్ళబెట్టాను. మా బావ కొడుకు కార్తికేయ ప్రస్తుతం డాక్టర్ బి. వి. రాజు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజరీనింగ్ చదువుతున్నాడు. చిన్నప్పటి నుండి ఫుట్ బాల్ ప్లేయర్. స్కూల్ లోనూ, కాలేజీలోనూ ఫుట్ బాల్ ఆడాడు. సంగీతమంటే అభిరుచి ఉన్న కార్తికేయ రాయల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ (లండన్)లో ఓకల్ వెస్ట్రన్, పియానో 5వ గ్రేడ్ ఉత్తీర్ణత కూడా సాధించాడు.
ఇక జూలై ఫస్ట్ వీక్ మార్టినెజ్ కోల్ కతాలోని మోహన్ బగాన్ క్లబ్ లో జరిగే ఓ ప్రైవేట్ ఈవెంట్ కు వస్తున్నాడని తెలుసుకున్న మా బావ కొడుకు కార్తికేయ అక్కడకు వెళ్ళి మార్టినెజ్ ను కలుసుకుని, 2022 వరల్డ్ కప్ రిప్లికా తో ఫోటో దిగాడు. అర్జంటీనా జెర్సీపై ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నాడు. హైదరాబాద్ నుండి ఓ ఫుట్ బాల్ క్రీడాకారుడు తనను కలుసుకోవడానికి కోల్ కతా వచ్చాడని తెలుసుకున్న మార్టినెజ్ కూడా కార్తీకేయను చక్కగా రిసీవ్ చేసుకున్నాడు. కార్తికేయలోని ఈ ఉత్సాహం, చొరవ, తెగింపు చూసిన తర్వాత అప్పుడెప్పుడో ‘అందమైన అనుభవం’ సినిమాలోని ‘’కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళోయ్ కళ్ళాలే లేనోళ్ళు’’ అనే పాట గుర్తొచ్చింది.
ఇంతకూ జూన్ నెలాఖరులో మా బావ నాకు పూనేలో పనుందని ఫోన్ చేసింది అక్కడ నుండి అర్జెంటీనా జెర్సీని తెప్పించడానికట! ఆ రోజు మా మేనల్లుడు పూనే లో లేకపోవడంతో... బెంగళూరులో తెలిసినవాళ్ళకు ఫోన్ చేసి... హుటాహుటిన అక్కడ నుండి హైదరాబాద్ కు జెర్సీ తెప్పించి, తన కొడుక్కి ఇచ్చి, కోల్ కతా పంపారన్న మాట!!

Sriramana garu



 శ్రీరమణ గారిని తొలిసారి లోయర్ ట్యాంక్ బండ్ లోని ఆంధ్రప్రభ వీక్లీ ఆఫీస్ లో చూశాను. నేను సూపర్ హిట్ నుండి వార్త డైలీకి వెళ్ళినప్పుడే... మిత్రుడు వల్లూరి రాఘవ ఆంధ్రప్రభ వీక్లీకి ఎడిటర్ అయ్యారు. ఓసారి ఫోన్ చేసి... ‘మా వీక్లీకి కార్టూన్లు గీయొచ్చు కదా!’ అని అడిగారు. ఓ ఐదు కార్టూన్లు గీసి ఆఫీస్ కు తీసుకెళితే... ‘ఓం ఏం అనుకోకూ... ఇక్కడ కార్టూన్లను శ్రీరమణ గారే సెలక్ట్ చేస్తున్నారు. ఆయనకు చూపించు’’ అన్నారు. ఆయన టేబుల్ దగ్గరకు వెళ్ళితే... నన్ను కూర్చోపెట్టి... ఐదు కార్టూన్లలో మూడు తీసుకుని, రెండు వెనక్కి ఇచ్చారు. అలా మొదటిసారి ఆయనతో పరిచయభాగ్యం కలిగింది.

బాపు, రమణగార్లతో ఆయనకు ఉన్న అనుబంధం ఎంత చిక్కనైనదో నేను ఆంధ్రజ్యోతి దిన పత్రికలో చేరిన తర్వాత కానీ తెలియలేదు. 2002లో ఆంధ్రజ్యోతి డైలీ రీ-ఓపెన్ అయిన తర్వాత కొంత కాలానికి శ్రీరమణగారి సంపాదకత్వంలో నవ్య వీక్లీ మొదలైంది. ఒకే బిల్డింగ్ కావడంతో తరచూ కలుస్తూ ఉండేవాళ్ళం. బాపు, రమణ గార్ల పట్ల నాకున్న అభిమానాన్ని తెలుసుకుని, తరచూ మా ఫిల్మ్ డెస్క్ దగ్గరకు వచ్చినప్పుడో లేదా ఆయన దగ్గరకు నేను వెళ్ళినప్పుడో వారి గురించి, వారితో తాను పని చేసినప్పటి అనుభవాలను గురించి చెబుతూ ఉండేవారు. ఆంధ్రజ్యోతి డైలీకి బాపు గారు వచ్చినప్పుడు ఫిల్మ్ డెస్క్ లోని మమ్మల్ని పిలిపించి, ఆయనతో ఫోటో తీయించారు. అలానే ముళ్ళపూడి గారితోనూ! కార్టూన్లు గీయడానికి నేను బద్ధకిస్తున్న టైమ్ లో ‘నవ్య’ వీక్లీకి కార్టూన్లు గీయించారు. నవ్య దీపావళి ప్రత్యేక సంచికకు పని కట్టుకుని నాతో రెండు మూడు సార్లు కథలు రాయించారు.
వేదాంతం శ్రీపతి శర్మ, కస్తూరి మురళీకృష్ణ, కొల్లూరి సోమశంకర్, నేను కలిసి ‘ఫోర్ ఇంటూ ఫైవ్’ పేరుతో కథా సంపుటిని 2004లో తీసుకొచ్చినప్పుడు రమణగారు ఆ ఆవిష్కరణ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన సరదాగా చెప్పిన మాట ఎప్పటికీ మర్చిపోలేదు. ‘ఇవాళ అపార్ట్ మెంట్ కల్చర్ వచ్చేసింది కదా. అలా వీళ్ళూ ఆర్థికభారం మీద పడుకుండా సొంతంగా ఇలా పుస్తకాన్ని ప్రచురించుకున్నారు’’ అని అన్నారు. అలానే నేను రాసిన ‘మనసు తడి ఆరనీకు’ పుస్తకాన్ని శ్రీరమణ గారు ‘ఆంధ్రప్రదేశ్’ మాస పత్రికలో సమీక్షిస్తూ, ‘’ఈ రచయిత ఎంత అమాయకుడంటే... విస్కీ బాటిల్ ను ఫ్రిజ్ లో పెట్టరని కూడా తెలియదు పాపం’ అని చమత్కరించారు. నా గురించి ఆయనకు బాగా తెలుసు కాబట్టి!
ఆయన ‘మిధునం’ కథను తనికెళ్ళ భరణీగారు సినిమాగా తీస్తున్నారని తెలిసి శ్రీరమణ గారిని అభినందిస్తే... నవ్వేస్తూ, ‘’అది సినిమా ప్రేక్షకులకు ఎక్కే కథ కాదు... వద్దని చెప్పినా భరణీ వినడం లేదు. పాపం ఆ నిర్మాతకు ఎంత నష్టం వస్తుందో... అనే నా దిగులంతా’’ అనేశారు. శ్రీరమణ గారంటే అది!! మిత్రుడు పులగం చిన్నారాయణతో కలిసి నేను రాసిన ‘వెండిచందమామలు’ పుస్తకానికి శ్రీరమణగారు అందించిన సహకారం అంతాఇంతా కాదు. అదో పీహెచ్డ్ పుస్తకం లాంటిదని చాలామంది అంటారు. దానికి గైడ్ ఆయనే అని చెప్పొచ్చు.
‘నవ్య’ వీక్లీలో ఉండగా తరచూ మాట్లాడుకునే మేం అందులో ఆయన మానేసిన తర్వాత కేవలం ఫోన్ కాల్స్ కే పరిమితం అయిపోయాం. ఎప్పుడైనా ఏదైనా పుస్తకావిష్కరణ సభలో కలిస్తే.. ఆత్మీయంగా, ఆప్యాయంగా పలకరించేవారు. తన కొత్త పుస్తకాలను నా అడ్రస్ అడిగి తీసుకుని మరి పంపి... ‘’చదివి ఎలా ఉందో చెప్పు’’ అనేవారు. నిజానికి అది నన్ను ఎడ్యుకేట్ చేయడానికే అని నాకు తెలుసు!
ఓ పదిహేను రోజుల క్రితం పెద్దలు ఎంవీయస్ ప్రసాద్ గారు ప్రెస్ క్లబ్ లో (పుస్తకావిష్కరణ సందర్భంగానే సుమా) కలిసినప్పుడు శ్రీరమణగారి గురించి వాకబు చేస్తే ఆయన ఆరోగ్యం అస్సలు బాగోలేదని చెప్పారు. ఇవాళ శ్రీరమణగారి మరణవార్త తెలియగానే నేను కంగారు పడలేదు. ఆయనకు విముక్తి లభించిందనే భావించాను. బాపు, రమణ గార్ల గురించే కాదు... మా ఆర్టిస్ట్ చంద్రగారి గురించి కూడా రమణగారు భలే మాట్లాడేవారు. ఆయన మాట్లాడుతుంటే... గంటల తరబడి అలా వింటూ ఉండిపోవాలనిపించేది. ఇక ఆయన మాటలు వినలేనంటే ఏంటోగా ఉంది!
శ్రీరమణ గారూ... మీ రచనలే ఇక మాకు దిక్కు!

Article On Sriramana


 

Nivaali to Sriramana

 


అచ్చ తెలుగు అక్షరం చిన్నబోయిన వేళ!

ప్రముఖ కథా రచయిత శ్రీరమణ ఇకలేరనే వార్త బుధవారం (జూలై 19) తెల్లవారు ఝామున సోషల్ మీడియా మీదుగా జనాలకు చేరేసరికీ కొందరు అప్పటికీ పక్క దిగి ఉండరు. మరికొందరు దంత ధావనం చేసి ఉండరు. ఇంకొందరు ఆ వర్షాకాలం ఉదయం వేడి వేడీ టీని ఆస్వాదిస్తూ ఉంటారు. ఎవరెవరు ఏ పనిలో ఎలా ఉన్నా... శ్రీరమణ నిష్క్రమణ వార్త వాళ్ళను హతాశయులను చేసిందనే చెప్పాలి! ఎందుకంటే శ్రీరమణ కేవలం 71 సంవత్సరాల వ్యక్తి మాత్రమే కాదు. ఐదు పదుల పాటు తెలుగు అక్షరంతో ప్రయాణం చేసిన అనుభవం ఆయనది.
21 సెప్టెంబర్ 1952న గుంటూరుజిల్లా వరాహ పురం అగ్రహారంలో జన్మించింది లగాయితూ 19 జూలై 2023లో తనువు చాలించే వరకూ ఆయన ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సాహితీ వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. పుట్టినప్పుడు పేరు వంకమామిడి రాధాకృష్ణ. దత్తతు వెళ్ళాక అది కాస్త కామరాజు రామారావు అయ్యింది. కాస్తంత ఆధ్యాత్మికత ఒంటబట్టిన తర్వాత రమణ మహర్షి మీద అభిమానంతో `శ్రీరమణ` అనేది కలంపేరుగా మారింది. అయినవారికి ఆయన రాధాకృష్ణ, రామారావు కావచ్చు కానీ సాహితీ రంగంలో మాత్రం శ్రీరమణగానే సుప్రసిద్థులు.
యుక్తవయసులోనే శ్రీరమణ కలం దన్ను గ్రహించిన నండూరి రామ్మోహనరావు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ ఆంధ్రజ్యోతి లోకి ఆహ్వానిస్తే... అందులో ఆయన `హాస్యజ్యోతి`ని వెలిగించారు. తెలుగు సాహితీ రంగంలో వ్యంగ్య రచనలు చేసే ఉద్ధండులకు కొదవలేదు. అయితే... వారి స్థాయికి తగ్గట్టు గానూ, అప్పటి తరాన్ని మెప్పించేలానూ, గత కాలపు సాహితీ వేత్తల రచనశైలికి భిన్నంగా, తనదైన వ్యంగ్యాన్ని జోడించిన శ్రీరమణ అందరికీ ఇష్టుడైపోయారు. ప్రముఖ ధ్వన్యానుకరణ సమ్రాట్ నేరెళ్ళ వేణుమాధవ్ ప్రముఖుల గాత్రాలను ఎలాగైతే తన గొంతు ద్వారా రీ-క్రియేట్ చేసేవారో, శ్రీరమణ అలా ప్రముఖుల శైలిని తన కలం ద్వారాగా పేరడీగా మలిచేవారు. అప్పట్లో ఆంధ్రజ్యోతి వార పత్రికలో వివిధ పండగల సందర్భంగా శ్రీరమణ అందించిన ఈ పేరడీలను మృష్ఠాన్నభోజనంలా ఆస్వాదించిన పాఠకులకు కొదవలేదు. బాపు గీత, రమణ రాత గురించి తెలియని వారు తెలుగు సాహితీ లోకంలో ఉండరు. అలాంటి వారి చెంత శ్రీరమణ ఉంటే బాగుంటుందని భావించిన నండూరి, పురాణం గార్లు ప్రత్యేకంగా సిఫారసు చేసి మరి చెన్నయ్ లో ఆ మిత్రద్వయం చెంతకు శ్రీరమణను చేర్చారు.
చిత్రం ఏమంటే... శ్రీరమణ అప్పటికే చేయి తిరిగిన రచయితైనా... బాపు రమణల సాన్నిహిత్యంలో దానికి మాత్రమే ఆయన పరిమితం కాలేదు. సినిమా ప్రొడక్షన్ కు సంబంధించిన వ్యవహారాలలోనూ చేయి చేసుకున్నారు. తద్వారా వచ్చిన అనుభవం ఆ తర్వాత ఆయనకు బాగా ఉపయోగపడింది. మద్రాసు రోజులను తలుచుకోవడం, అప్పటి ముచ్చట్లను నెమరవేసుకోవడం అంటే శ్రీరమణకు బోలెడంత ఇష్టం. మద్రాసు మెరీనా బీచ్ ముచ్చట్ల గురించి, బాపురమణలతో గోదావరి మీద చేసిన లాంచి ప్రయాణాలను గురించి చెప్పడం మొదలు పెడితే... సూర్యాస్తమయాలు తెలియకుండా గడిచిపోతాయి. శ్రీరమణలో ఉన్న గొప్పగుణం ఏమంటే... ఆయన ఎవరి గురించి మాట్లాడినా చాలా నిజాయితీతోనూ, నిబద్ధతతోనూ మాట్లాడినట్టుగా ఉంటుంది. మధ్యలో తనదైన పంథాలో చురకులు వేస్తూనే, అవతలి వారి బలం,బలహీనతల వివరిస్తూనే... వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టుగా చెబుతారు. అది బాపు కావచ్చు, రమణ కావచ్చు, చిత్రకారులు చంద్ర కావచ్చు... తన జీవనయానంలో ఎదురైన ప్రతి వ్యక్తికి సంబంధించిన ఉనికిని శ్రీరమణ చాలా జాగ్రత్తగా తన మనసు పొరల్లో దాచిపెట్టుకుంటారు. అందుకే వేదిక ఏదైనా... దానికి తగ్గట్టుగా, సందర్భోచితంగా శ్రీరమణ అద్భుతంగా మాట్లాడతారు. సహజంగా గొప్ప రచనలు చేసే వారికి గొప్పగా మాట్లాడటం చేతకాదు. గొప్ప వక్తలు గొప్ప రచయితలూ కాలేరు. కానీ ఈ రెండు లక్షణాలు ఉన్న అరుదైన వ్యక్తులలో శ్రీరమణ కూడా ఒక్కరు.
తెలుగు పత్రికా రంగం, సినిమా రంగంతో చక్కని, చిక్కని అనుబంధం ఉన్న శ్రీరమణ కేవలం పేరడీలు, వ్యంగ్య రచనలకు పరిమితం కాలేదు. ఆయన రాసిన `బంగారు మురుగు`, `ధనలక్ష్మి`, `సోడానాయుడు` , చివరగా రాసిన `నాలుగు ఎకరాలు` కథలు రచయితగా ఆయన ఏమిటనేది తెలియచేస్తాయి. ఇవన్నీ ఒక ఎత్తు కాగా `మిథునం` ఒక్కటీ మరో ఎత్తు. శ్రీరమణ కలం నుండి జాలువారిన ఆ అచ్చతెలుగు కథను చదివి పులకితులైపోయిన బాపు స్వదస్తూరితో దానిని తిరగరాస్తే... యథాతథంగా `రచన` శాయి తన మాసప్రతికలో ప్రచురించారు. ఆ కథను అలానే పుస్తకంగా ప్రచురిస్తే... లక్షల కాపీలు అమ్ముడుకావడమే కాదు... అనేక పెళ్ళిళ్ళలో ఉచిత కానుకగా అందించబడ్డాయి. శ్రీరమణ కథకు లభించిన అరుదైన గౌరవం అది. ఆ కథ ఎల్లలు దాటడంతో మలయాళంలో సినిమాగా రూపుదిద్దుకుంది. ఆ తర్వాత కొంతకాలానికి ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ళ భరణి తొలిసారి మెగా ఫోన్ చేతపట్టి `మిథునం`తో ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్ అయ్యారు. గాన గాంధర్వుడు బాలు, లక్ష్మీ నటించిన `మిథునం` ఓ క్లాసిక్ మూవీగా పేరు తెచ్చుకుంది.
శ్రీరమణ హాస్యజ్యోతి, శ్రీకాలమ్, చిలకలపందిరి, వెంకట సత్యస్టాలిన్, అక్షర తుణీరం వంటి శీర్షికలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు బాపురమణల శిష్యుడిగా... రామచరితను రాసి తన జీవితానికి సార్థకత చేకూర్చుకున్నారు. నవ్య వీక్లీ సంపాదకులుగా ఉన్న సమయంలో `శ్రీరామాయణం`ను అచ్చతెలుగులో పాఠకులకు అందించారు. పత్రిక మాస పత్రిక సంపాదకులుగా అద్భుతమైన కథలకు పట్టం కట్టారు. బాపు చిత్రాల వెండితెర నవలలను తొలుత ముళ్ళపూడి వెంకట రమణ తర్వాత ఎమ్వీయల్ రాయగా... చెన్నయ్ చేరిన తర్వాత ఆ బాధ్యతను తన కలాని కెత్తుకున్నారు. గొప్ప సంపాదకుడంటే తాను రాయడం కాదు... నలుగురితో రాయించడం అనే దాన్ని నమ్మి ఆచరించిన వ్యక్తి శ్రీరమణ. అందుకే ఆయన సంపాదకుడిగా ఉన్న సమయంలో లబ్దప్రతిష్ఠులతో తిరిగి రచనలు చేయించారు. కొత్త రచయితలను ప్రోత్సహించారు. అవసరం అయినప్పుడు తప్పితే ఆయన `కలం చేసుకున్న` దాఖలాలు లేవు!
వెండితెర మీద హాస్యాన్ని పండించడం చాలా కష్టం అంటారు. హాస్యనటుడిగా రాణిస్తే... ఏ పాత్ర అయినా అవలీలగా చేయగలడని భావిస్తారు. సాహిత్యానికీ అదే వర్తిస్తుంది. సెటైర్ రాయగలిగే వారు ఏదైనా రాయగలరు. శ్రీరమణ కూడా అందుకు మినహాయింపు కాదు. సుతిమెత్తగా తన కలంతో ఎదుటి వారికి చురకలు అంటించే శ్రీరమణ, తన అక్షరాలను ఆర్తిలో ముంచి తీసి కథలుగా రాశారు. ఆయన రాసిన `బంగారు మురుగు`లోని ఈ వాక్యాలే అందుకు నిదర్శనం. ``చెట్టుకు చెంబెడు నీళ్ళు... పక్షికి గుప్పెడు గింజలు.. ఆకలితో ఉన్నవాడికి ఇంత అన్నం`` ఇదీ ఆ కథలోని బామ్మ చెప్పే మాట. బంగారు బాటలాంటి ఈ మాటను ఆచరిస్తే... ఇక విప్లవానికి, వైషమ్యాలకు తావెక్కడ ఉంటుంది! ఇంతకంటే ఏ మనిషి అయినా ఆచరించాల్సిన ఆదర్శం ఏముంటుంది!?
సాహితీ మేరునగధీరులతో సాన్నిహిత్యం ఉన్నా... శ్రీరమణ ఎప్పుడూ, ఎక్కడా గొప్పలు ప్రదర్శించేవారు కాదు. లోకం పోకడ తెలిసిన మనిషిగా, సమాజం నాడిని పట్టిన వ్యక్తిగా ఆచితూచి మాట్లాడేవారు. నిశ్శబ్దంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలన్నదే శ్రీరమణ అభిలాష. అనాయాస మరణాన్ని ఆయన కోరుకున్నా... అనారోగ్యం కారణంగా కొన్ని నెలల పాటు మంచానికే పరిమితం కాక తప్పలేదు. జూలై 19 బుధవారం వర్షం కురుస్తున్న ఉదయాన ఆయన ఈ లోకం నుండి నిశ్శబ్దంగా నిష్క్రమించారు. అయితే... జూలై 20న హైదరాబాద్ మహాప్రస్థానంలో జరిగిన అంత్యక్రియలను తలుచుకుంటే బాధ కలగక మానదు. శ్రీరమణ అక్షరాన్ని ప్రేమించిన వారు లక్షలలో ఉంటారు. ఆయన ద్వారా రచయితలుగా గుర్తింపు తెచ్చుకున్నవారు వేలల్లో ఉంటారు. ఆయనతో తమ కథా సంపుటాలకు ముందు మాట రాయించుకున్న వారు వందలలో ఉంటారు. కానీ వీరెవరూ ఆ రోజు మహాప్రస్థానంలో కనిపించలేదు. లక్షలాది మంది పాఠకులను తన అక్షరంతో మరిపించిన ఆ మహా కథకుడిని అంతిమంగా దర్శించుకుని అంజలి ఘటించిన కథకులు కమలాకర్ రెడ్డి, ఎమ్మెస్ నాయుడు, ప్రముఖ చిత్రకారుడు అన్వర్ వంటి వారిని వేళ్ల మీద లెక్కించొచ్చు. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం శ్రీరమణను ఆఖరిసారి చూడలేకపోవడానికి కొందరికి సాకు, మరికొందరికి అడ్డంకి! (ఈ వ్యాస రచయితతో సహా).
మానవ సంబంధాల గురించి, వాటిని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత గురించి శ్రీరమణ తన కథలలో పదే పదే ప్రస్తావించారు. కానీ వాటిని ఒంటపట్టించుకోని పాఠకులు, అభిమానులు, అనుయాయులు, మిత్రులు కేవలం సోషల్ మీడియాలో నివాళులు అర్పించడానికే పరిమితం అయిపోవడం తెలుగు కథను అవమానించడమే!
- వడ్డి ఓంప్రకాశ్ నారాయణ
(ఆంధ్రప్రభ దినపత్రిక సౌజన్యంతో...)
జూలై 24 సాహితీ గవాక్షంలో ప్రచురితం

Kalki 2898 AD movie

 


Baby movie reivew

 


Samajavaragamana movie review

 


Spy movie Review

 


Prekshakula Naadi

 


Star War

 


Ahimsa movie review


 

Hopes on Adipurush

 


Anni Manchi Sakunamule movie review

 


Spy movies