Wednesday, August 2, 2023

Sriramana garu



 శ్రీరమణ గారిని తొలిసారి లోయర్ ట్యాంక్ బండ్ లోని ఆంధ్రప్రభ వీక్లీ ఆఫీస్ లో చూశాను. నేను సూపర్ హిట్ నుండి వార్త డైలీకి వెళ్ళినప్పుడే... మిత్రుడు వల్లూరి రాఘవ ఆంధ్రప్రభ వీక్లీకి ఎడిటర్ అయ్యారు. ఓసారి ఫోన్ చేసి... ‘మా వీక్లీకి కార్టూన్లు గీయొచ్చు కదా!’ అని అడిగారు. ఓ ఐదు కార్టూన్లు గీసి ఆఫీస్ కు తీసుకెళితే... ‘ఓం ఏం అనుకోకూ... ఇక్కడ కార్టూన్లను శ్రీరమణ గారే సెలక్ట్ చేస్తున్నారు. ఆయనకు చూపించు’’ అన్నారు. ఆయన టేబుల్ దగ్గరకు వెళ్ళితే... నన్ను కూర్చోపెట్టి... ఐదు కార్టూన్లలో మూడు తీసుకుని, రెండు వెనక్కి ఇచ్చారు. అలా మొదటిసారి ఆయనతో పరిచయభాగ్యం కలిగింది.

బాపు, రమణగార్లతో ఆయనకు ఉన్న అనుబంధం ఎంత చిక్కనైనదో నేను ఆంధ్రజ్యోతి దిన పత్రికలో చేరిన తర్వాత కానీ తెలియలేదు. 2002లో ఆంధ్రజ్యోతి డైలీ రీ-ఓపెన్ అయిన తర్వాత కొంత కాలానికి శ్రీరమణగారి సంపాదకత్వంలో నవ్య వీక్లీ మొదలైంది. ఒకే బిల్డింగ్ కావడంతో తరచూ కలుస్తూ ఉండేవాళ్ళం. బాపు, రమణ గార్ల పట్ల నాకున్న అభిమానాన్ని తెలుసుకుని, తరచూ మా ఫిల్మ్ డెస్క్ దగ్గరకు వచ్చినప్పుడో లేదా ఆయన దగ్గరకు నేను వెళ్ళినప్పుడో వారి గురించి, వారితో తాను పని చేసినప్పటి అనుభవాలను గురించి చెబుతూ ఉండేవారు. ఆంధ్రజ్యోతి డైలీకి బాపు గారు వచ్చినప్పుడు ఫిల్మ్ డెస్క్ లోని మమ్మల్ని పిలిపించి, ఆయనతో ఫోటో తీయించారు. అలానే ముళ్ళపూడి గారితోనూ! కార్టూన్లు గీయడానికి నేను బద్ధకిస్తున్న టైమ్ లో ‘నవ్య’ వీక్లీకి కార్టూన్లు గీయించారు. నవ్య దీపావళి ప్రత్యేక సంచికకు పని కట్టుకుని నాతో రెండు మూడు సార్లు కథలు రాయించారు.
వేదాంతం శ్రీపతి శర్మ, కస్తూరి మురళీకృష్ణ, కొల్లూరి సోమశంకర్, నేను కలిసి ‘ఫోర్ ఇంటూ ఫైవ్’ పేరుతో కథా సంపుటిని 2004లో తీసుకొచ్చినప్పుడు రమణగారు ఆ ఆవిష్కరణ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన సరదాగా చెప్పిన మాట ఎప్పటికీ మర్చిపోలేదు. ‘ఇవాళ అపార్ట్ మెంట్ కల్చర్ వచ్చేసింది కదా. అలా వీళ్ళూ ఆర్థికభారం మీద పడుకుండా సొంతంగా ఇలా పుస్తకాన్ని ప్రచురించుకున్నారు’’ అని అన్నారు. అలానే నేను రాసిన ‘మనసు తడి ఆరనీకు’ పుస్తకాన్ని శ్రీరమణ గారు ‘ఆంధ్రప్రదేశ్’ మాస పత్రికలో సమీక్షిస్తూ, ‘’ఈ రచయిత ఎంత అమాయకుడంటే... విస్కీ బాటిల్ ను ఫ్రిజ్ లో పెట్టరని కూడా తెలియదు పాపం’ అని చమత్కరించారు. నా గురించి ఆయనకు బాగా తెలుసు కాబట్టి!
ఆయన ‘మిధునం’ కథను తనికెళ్ళ భరణీగారు సినిమాగా తీస్తున్నారని తెలిసి శ్రీరమణ గారిని అభినందిస్తే... నవ్వేస్తూ, ‘’అది సినిమా ప్రేక్షకులకు ఎక్కే కథ కాదు... వద్దని చెప్పినా భరణీ వినడం లేదు. పాపం ఆ నిర్మాతకు ఎంత నష్టం వస్తుందో... అనే నా దిగులంతా’’ అనేశారు. శ్రీరమణ గారంటే అది!! మిత్రుడు పులగం చిన్నారాయణతో కలిసి నేను రాసిన ‘వెండిచందమామలు’ పుస్తకానికి శ్రీరమణగారు అందించిన సహకారం అంతాఇంతా కాదు. అదో పీహెచ్డ్ పుస్తకం లాంటిదని చాలామంది అంటారు. దానికి గైడ్ ఆయనే అని చెప్పొచ్చు.
‘నవ్య’ వీక్లీలో ఉండగా తరచూ మాట్లాడుకునే మేం అందులో ఆయన మానేసిన తర్వాత కేవలం ఫోన్ కాల్స్ కే పరిమితం అయిపోయాం. ఎప్పుడైనా ఏదైనా పుస్తకావిష్కరణ సభలో కలిస్తే.. ఆత్మీయంగా, ఆప్యాయంగా పలకరించేవారు. తన కొత్త పుస్తకాలను నా అడ్రస్ అడిగి తీసుకుని మరి పంపి... ‘’చదివి ఎలా ఉందో చెప్పు’’ అనేవారు. నిజానికి అది నన్ను ఎడ్యుకేట్ చేయడానికే అని నాకు తెలుసు!
ఓ పదిహేను రోజుల క్రితం పెద్దలు ఎంవీయస్ ప్రసాద్ గారు ప్రెస్ క్లబ్ లో (పుస్తకావిష్కరణ సందర్భంగానే సుమా) కలిసినప్పుడు శ్రీరమణగారి గురించి వాకబు చేస్తే ఆయన ఆరోగ్యం అస్సలు బాగోలేదని చెప్పారు. ఇవాళ శ్రీరమణగారి మరణవార్త తెలియగానే నేను కంగారు పడలేదు. ఆయనకు విముక్తి లభించిందనే భావించాను. బాపు, రమణ గార్ల గురించే కాదు... మా ఆర్టిస్ట్ చంద్రగారి గురించి కూడా రమణగారు భలే మాట్లాడేవారు. ఆయన మాట్లాడుతుంటే... గంటల తరబడి అలా వింటూ ఉండిపోవాలనిపించేది. ఇక ఆయన మాటలు వినలేనంటే ఏంటోగా ఉంది!
శ్రీరమణ గారూ... మీ రచనలే ఇక మాకు దిక్కు!

No comments:

Post a Comment