Monday, November 14, 2011

నిను మరువలేము మిత్రమా!

చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ వచ్చింది... ఉమేశ్ లేడు!

ఎప్పటిలానే రెండేళ్లకు ఒకసారి వచ్చే
బాలల చలన చిత్రోత్సవం వచ్చేసింది.
కానీ మిత్రుడు ఉమేశ్ మాత్రం లేడు!
పాత్రికేయుడిగా అతని బీట్ ఏదైనా..
చలన చిత్రోత్సవాల్లో పాల్గొనటం అతనికి ఇష్టం!
చిన్నారి పిల్లలతో కలిసి సినిమాలు చూడటం మరీ ఇష్టం!!
ఒకే పత్రికలో పనిచేస్తూ కూడా బిజీ షెడ్యూల్ కారణంగా 
ఆఫీసులో కలిసినా కలవక పోయినా
ఫిలిం ఫెస్టివల్ జరిగే వారం రోజుల్లో 
కనీసం మూడు రోజులైనా కలిసేవాళ్ళం.
చూసిన, చూడబోయే సినిమాలను గురించి ముచ్చటించుకునే వాళ్ళం. 
తాను చూసిన మంచి సినిమాల గురించి గొప్పగా చెప్పేవాడు.
అవి ఏ భాషా చిత్రాలైనా భుజానికి ఎత్తుకుని మోసేవాడు.
తప్పకుండా చూడమని సూచించే వాడు.
దాదాపు పన్నెండు ఏళ్లుగా అతను హాజరుకాని ఫిలిం ఫెస్టివల్ లేదేమో!
ఇప్పుడు మరోసారి చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ వచ్చింది.
ఉమేశ్ మాత్రం లేడు.

అలవాటుకొద్దీ అతని కోసం నలువైపులా  కళ్ళు వెదుకుతుంటే...
'అతను నా దగ్గర వున్నడులే' అని మనసు ఊరడిస్తోంది!!

చలన చిత్రోత్సవ ప్రేమికుడు, మిత్రుడు 
ఉమేశ్ కు 
అశ్రునయనాలతో...

Monday, August 29, 2011

తెలుగు సినిమా మరో సారి చిన్నబోయింది...

తమిళ సినిమా 'మదరాసి పట్టణం' ను తెలుగులో '1947 ఏ లవ్ స్టొరీ' గా అనువదించారు. తమిళ వారు చక్కగా తమ ఊరు పేరు పెట్టుకుంటే, మనవాళ్ళకు తెలుగు పేరు పెట్టాలని కూడా అనిపించలేదు. '1947 ఓ ప్రేమకధ' అని పెట్టినా బాగుండేది కదా! తమిళ ప్రభుత్వం సినిమాలకు తమిళ పేరు కాకుండా ఇంగ్లీష్ పేర్లు పెడితే రాయతీలు ఇవ్వక పోగా, అధిక టాక్స్ వసూలు చేస్తుంది. అందుకే అక్కడ వాళ్ళు బుద్దిగా తమిళ్ పేర్లు పెడుతున్నారు. తమిళ వాళ్ళు రజనీకాంత్ సినిమాకు  'యంతిరన్' అని పెడితే, మనవాళ్ళు 'రోబో' అని అనువదించారు. ఇక్కడ కూడా ప్రభుత్వం సినిమా పేర్ల విషయంలో కాస్త గట్టిగా వుంటే గాని మన సినిమావాళ్ళు దారికి రారు.