Saturday, October 26, 2013

శ్రుతి హాసన్ రికార్డ్!


ప్రముఖ నటుడు కమల్ హాసన్ తనయి శ్రుతి హాసన్ ఇటీవల ఓ కొత్త రికార్డును నెలకొల్పింది. ఒకే పేరుతో వచ్చిన రెండు సినిమాలలో ఆమె నాయికగా నటించింది. హిందీలో వచ్చిన 'రామయ్యా వస్తావయ్యా' (ఇది తెలుగు సినిమా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' కు రీమేక్) కాగా, మరొకటి తెలుగులో ఎన్టీయార్ హీరోగా దిల్ రాజు నిర్మించిన 'రామయ్యా వస్తావయ్యా'. కథలు వేరైనా టైటిల్ మాత్రం ఒక్కటే! ఈ రెండు సినిమాలలోనూ శ్రుతి నటిస్తోందనగానే అందరూ 'ఆహా...' అనుకున్నారు. అదో రికార్డ్ అయితే...  ఒకదాని వెనుక ఒకటిగా వచ్చిన ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడం మరో రికార్డ్! ఏదేమైనా తండ్రి కమల్ మాదిరే శ్రుతి జయాపజయాల్లోనూ తనదైన శైలి కనబరుస్తోంది!

Saturday, October 12, 2013

Ramayya... vasthavayya movie review



                                         

                             వచ్చిన రామయ్య నచ్చలేదు!



బృందావనం వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ఎన్టీయార్ దిల్ రాజు కాంబినేషన్ లో సినిమా అంటే ఎలా ఉండాలి!? గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీశ్ శంకర్ సినిమా అంటే ఎలా ఉండాలి!? ఎన్టీయార్, హరీశ్ శంకర్ తొలిసారి సినిమా చేస్తున్నారంటే ఏ రేంజ్ లో ఉండాలి!? కానీ రామయ్యా వస్తావయ్యా ఆ స్థాయిలో లేకుండా పోయింది!

బహుశా దానికి కారణం దర్శక నిర్మాతలతో సహా హీరో ఆడియెన్స్ కు ఇచ్చిన భరోసా కావచ్చు. సినిమా విడుదలకు ఐదారు రోజుల ముందు నిర్మాత దిల్ రాజు ఈ యేడాది టాలీవుడ్ టాప్ త్రీ మూవీస్ లో ఇదీ ఒకటి అవుతుందని చెబితే ఓహో అంటూ అభిమానులు అంచనాలు పెంచేసుకున్నారు. ఆడియో ఆవిష్కరణలో ఎన్టీయార్ ను ఇలా గతంలో ఎప్పుడూ చూడలేదు అని హరీశ్ శంకర్ చెబితే, నిజమే కాబోలు అనుకున్నారు. రావు రమేశ్ కనిపించేది కాసేపే అయినా ఇరగదీసేశాడు. శబాష్ అని సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయడు కితాబిస్తే నిజమని నమ్మేశారు.

కానీ రామయ్యా వస్తావయ్యా చూసిన ఆడియెన్స్ ఇదేమిటీ! ఎప్పుడో ఇరవై యేళ్ళ క్రితం తయారు చేసుకున్న కథను ఇప్పుడు తీసినట్టుగా ఉంది అని అనుకుంటూ థియేటర్ నుండి బయటకు వస్తున్నారు. రామయ్య ఎప్పుడొస్తాడా అని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అభిమానుల్ని నిరాశకు గురిచేసే విధంగానే ఈ సినిమా ఉంది.

ఇక కథ విషయానికి వస్తే

నందు కాలేజీ స్టూడెంట్. సరదాగా జీవితాన్ని గడిపేస్తుంటాడు. అతని జీవితంలోకి ఊహించని విధంగా ఆకర్ష ప్రవేశిస్తుంది. ఆమెను ఇంప్రస్ చేసి, ప్రేమలో పడేస్తాడు. అంతేకాదు. ఆమె బామ్మకూ దగ్గరైపోతాడు. ఆమె కోరిక మేరకు ఆకర్ష అక్క పెళ్ళికి ఇతనూ అతిధిగా వెళతాడు. బిజినెస్ మేగ్నెట్ అయిన ఆకర్ష తండ్రిని చంపేస్తాంటూ కొందరు ఫోన్ చేసి బెదిరిస్తూ ఉంటారు. మీరేమీ భయపడకండి అంకుల్, నేనున్నాను అని హామీ ఇస్తాడు నందు. తనపక్కనే నందుని కూర్చోపెట్టుకుని నిమిషాలు లెక్కిస్తున్న ఆకర్ష తండ్రిని నందూనే అతి క్రూరంగా హతమార్చుతాడు. తన ప్రియురాలి తండ్రిని అతను ఎందుకు చంపాల్సి వచ్చింది, అంతటి ఘోరం అతనేం చేశాడు అసలు నందు ఎవరు!? ఈ ప్రశ్నలకు సమాధానంగా ద్వితీయార్థం సాగుతుంది.

రొటీన్ రివేంజ్ డ్రామా! రొటీన్ స్ర్కీన్ ప్లే!! పోనీ ఆర్టిస్టులకైనా ఇదేమైనా కొత్త పాత్రల అంటే అదీ లేదు. ఎన్టీయార్ గతంలో నరసింహుడులో చేసింది ఇదే తరహా పాత్ర! కాకపోతే ఇప్పుడు ఎన్టీయార్ కాస్త సన్నగా, నాజుగ్గా కథానుగుణంగా, కాలేజీ స్టూడెంట్ లానే ఉన్నాడు. ప్రధమార్థంలో ప్రేక్షకులకు కాస్త రిలీఫ్ కలిగిందంటే ఎన్టీయార్ పంచ్ డైలాగ్స్, అతని సరదా నటన వల్లే. ఇక ద్వితీయార్థం వచ్చేసరికీ ఎన్టీయార్ మార్క్ మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ హెవీ డోస్ లో బుర్రను హీటెక్కించేస్తాయి. దాంతో ప్రధమార్థంలోని ఫ్రెష్ నెస్ ను కూడా ఆడియెన్స్ మర్చిపోతారు. కోట శ్రీనివాసరావు కేంద్ర స్ర్తీ, శిశు సంక్షేమ శాఖామంత్రి అని ఒకచోట చెప్పిస్తారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ లో కాలు పెట్టినప్పుడు క్రీడాశాఖామంత్రిని అని చెబుతాడు. ఆ కాసేపట్లోనే పోర్టుఫోలియో మారిపోయిందేమో అర్థం కాదు. అలానే మీడియా వాళ్ళను ఆడిపోసుకోవడం కూడా కావాలని పెట్టినట్టు ఉంది తప్పితే, అవసరమైంది కాదు! హంసానందిని ఓ పాటలో మెరవడం కూడా సెంటిమెంట్ గా అనిపిస్తోంది. మిర్చి, అత్తారింటికి దారేది తర్వాత ఆమె ఈ సినిమాలోనూ ఐటమ్ సాంగ్లో మెరిసింది. ముఖ్యంగా అనంత శ్రీరామ్ రాసిన జాబిల్లి నువ్వే చెప్పమ్మా, సాహితి రాసిన నేనెప్పుడైన కలగన్నానా పాటలు ఆకట్టుకున్నాయి. శ్రీమణి, భాస్కరభట్ల గీతాలు మాస్ కు నచ్చుతాయి. తమన్ బాణీలలో కొత్తదనం కనిపించలేదు. నటీనటుల్లో ఎన్టీయార్ కు వంక పెట్టేది లేదు. బాగాచేశాడు. బృందావనంలో సమంత పాత్రను కాజల్ డామినేట్ చేసినట్టుగానే ఇక్కడా ఆ ఛాన్స్ శ్రుతిహాసన్ కొట్టేసింది. రావు రమేశ్ పాత్ర ఎంట్రీలో ఉన్న బిల్డప్ తర్వాత లేదు. కోట, ముఖేశ్ రుషి, రవిశంకర్, భరణి, నాగినీడు అందరివీ రొటీన్ క్యారెక్టర్లే. కాస్త వెరైటీ క్యారెక్టర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆమె రోహిణీ హట్టంగడీనే. ఈ యేడాది ప్రారంభంలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ప్రేమను పంచే బామ్మగా నటించిన ఆమె, ఇందులో యంగ్ జనరేషన్ తో పాటు తానూ అప్ డేట్ అయ్యే పాత్రను చక్కగా చేసి, ఆకట్టుకుంది. ఇందులో నాది డిఫరెంట్ క్యారెక్టర్ అని గట్టిగా చెప్పుకునే అర్హత ఆమె ఒక్కదానికే ఉందనిపిస్తుంది. చోటా కె నాయుడు కెమెరాపనితనం బాగానే ఉంది. 

ఎటొచ్చి కథలో బలం లేకపోవడంతో, స్ర్కీన్ ప్లే పరమ రొటీన్ గా ఉండటంతో ఈ సినిమా సాధారణ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలం అయింది. ఎన్టీయార్ ను అభిమానించేవారికి మాత్రమే నచ్చే సినిమా ఇది!

యాభై యేళ్ళకూ చెక్కుచెదరని 'నర్తనశాల'!


                  

                         50 యేళ్ళకూ చెక్కుచెదరని నర్తనశాల

అత్యంత సుందరాంగుడు నందమూరి తారకరామారావు పేడి ముఖంతో వెండితెరపై కనిపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా!?
వయసుకు మించిన శరీరభారంతో ఉన్న సావిత్రిని పాండవుల సతీమణి ద్రౌపతిగా సినీ వీక్షకులు అంగీకరించగలరా!?
అహంకారానికి, అధికార దర్పానికి నిలువెత్తు నిదర్శనంగా ఎస్వీరంగారావును తెలుగువారు ఊహించుకోగలరా!?
సాంఘికాలను రూపొందించి, విజయం సాధించిన కమలాకర కామేశ్వరరావు పౌరాణిక గాథకు న్యాయం చేయగలరా!?

ఈ ప్రశ్నలన్నింటికి లభించిన చక్కని సమాధానం నర్తనశాల!

తెలుగువారికి మాత్రమే వరమైన పద్యం తొలిటాకీ చిత్రాలలో విరివిగా వినిపించేది. అటువంటి పద్యాలు, అద్భుతమైన పాటల సమాహారంగా తెరకెక్కిన సినిమా నర్తనశాల!
రాజ్యం పిక్చర్స్ బ్యానర్ లో శ్రీధరరావు,లక్ష్మీ రాజ్యం నిర్మించిన ఈ సినిమా 11 అక్టోబర్, 1963న విడుదలై, అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇవాళతో యాభై వసంతాలను పూర్తి చేసుకుంది. తెలుగు సినిమా ఖ్యాతిని, తెలుగు నటుని సత్తాను ప్రపంచదేశాలకు తెలియచేసిన సినిమాగా నర్తనశాల చరిత్రలో నిలిచిపోయింది.

భారతీయులకు సంస్కృతి, సంప్రదాయాలంటే ఎనలేని మక్కువ అనే విషయం అందిరికీ తెలిసిందే. అందుకే సినిమా మాధ్యమంలోనూ వాటికే మనవాళ్ళు అధిక ప్రాధాన్యమిచ్చారు. మూకీ సమయంలోనే కాదు టాకీలు ప్రారంభమైనా అదే ఒరవడి కొనసాగింది. నర్తనశాల కథాంశంతోనే 1918లోనటరాజ మొదలియార్ కీచకవధ పేరుతో ఓ మూకీ తీశారు. 1937లో విజయదశమి లేక కీచకవధ పేరుతోనూ ఓ టాకీ చిత్రం వచ్చింది. నిజానికి కీచకవథ కథను ఇప్పుడు తలుచుకుంటే ఇది చిరపురాతనం నిత్యనూతనం అనిపిస్తుంది. ఇప్పటికీ ఇదే ఫార్ములాలో భారతీయ సినిమాలు తెరకెక్కుతుండటం విశేషం. మాయాజూదంలో కౌరవుల చేతిలో ఓడిపోయినందుకు గానూ పన్నెండేళ్లు అరణ్యవాసం, ఆపై ఓ యేడాది అజ్ఞాతవాసం చేయడానికి అంగీకరించిన పాండవులు, చివరి యేడాది విరాట రాజు కొలువులో మారువేషాలతో గడిపిన సందర్భంలో జరిగే కథే ఈ చిత్రం!
పౌరాణిక పాత్రలంటే ప్రాణం పెట్టే ఎన్టీయార్ తో పాండవమధ్యముడు అర్జునిడి పాత్ర చేయించాలనుకున్నారు. అందులో ఇబ్బందిలేదు. అయితే ఆ అర్జునుడు ఇప్పుడే ధనుర్ధారి కాదు, నాట్యాచార్యుడు అదీ ఆడామగా కానీ వ్యక్తి! ఆ పాత్రను చేయమని ఎన్టీయార్ ను అడగడానికి ఎంత సాహసం కావాలి. అయినా ఆయనతో ఉన్న పరిచయం,చనువుతో లక్ష్మీరాజ్యం, శ్రీధరరావు దంపతులు ఎన్టీయార్ ను కలిసి,  సంప్రదించారు. తొలుత ఆయన సందేహించినా, కళాదర్శకుడు టివియస్ శర్మ వేసిన చిత్రాలను చూసి తన అంగీకారం తెలిపారు. అలానే బృహన్నల వేషధారణను తన అభిమాన దర్శకుడు కె.వి. రెడ్డికి చూపించి, ఆయన భేష్ అన్నతర్వాతనే ముందుకెళ్ళారు ఎన్టీయార్. అలానే ద్రౌపదిగా నటించిన సావిత్రి సైతం ముందు ససేమిరా అన్నారు. అంతకుముందు ఈ సంస్థ నిర్మించిన సంసారం చిత్రం నుండి ఆమెను తొలగించడంతో కినుక వహించారు.  తాను కాస్త లవుగా ఉన్నానంటూ సాకు చూపించారు. కానీ దర్శక నిర్మాతల ఒత్తిడి, ఎన్టీయార్ ప్రోత్సాహం కారణంతో ఆమె కాదలేక ద్రౌపది పాత్ర పోషణకు సుముఖత వ్యక్తం చేశారు. ఇక కీలకమైన కీచకుడి పాత్రకు ఎస్వీయార్ ఎన్నుకోవడంతో దర్శక నిర్మాతలకు ఉన్న దూరదృష్టి ఏమిటో అందరికీ అర్థమైపోయింది. కీచకుడిగా ఎస్వీయార్ తెరపై కనిపించేది కొద్దిసేపే అయినా, తన ప్రతిభాపాటవాలతో ఆయన ప్రేక్షకుల్ని విస్మయానికి గురిచేశారు. అయితే కేవలం నటీనటుల ఎంపికతోనే విజయలక్ష్మి నర్తనశాలలో నర్తించలేదన్నది వాస్తవం. సాంకేతిక నిపుణుల ప్రతిభ, నటీనటుల అంకితభావానికి తోడైంది. నృత్యంలో అనుభవంలేని ఎన్టీయార్ నాట్యాచారుడిగా నటించడం కోసం ఎంతో కృషి చేశారు.  పైగా ఎల్. విజయలక్ష్మి లాంటి చక్కని నృత్యకళాకారిణికి తాను నాట్యం నేర్పు తున్నట్టు నటించాలంటే కొంత సాధన అవసరమని ఆయన భావించారు. అందుకనే వెంపటి పెదసత్యంగారి వద్ద నెల రోజుల పాటు నాట్యాన్ని అభ్యసించారు. సావిత్రి అయితే ద్రౌపది పాత్రలో లీనమైపోయారు.  తండ్రికి అంతగా ఆరోగ్యం బాగోకపోవడంతో సముద్రాల జూనియర్ కీచక స్వగతానికి సంభాషణలు రాశారు.  సంధాన సమయమైనది.. ఇంకనూ సైరంధ్రి రాలేదే అంటూ సాగే ఆ మాటలను చదివి ఎస్వీయార్ పరమానందభరితులైపోయారు. ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేశారు. ఈ సినిమాలో మరో కీలకమైన పాత్ర భీముడిది. ఈ పాత్రకోసం పన్నెండు సంవత్సరాల పాటు హెవీ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ అయిన, ఇండియన్ టార్జాన్ దండమూడి రాజగోపాల్ ను ఎంపిక చేశారు దర్శక నిర్మాతలు. ఆయన కూడా తనకిచ్చిన తొలి అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నారు. అలానే జీమూతమల్లుడిగా నటించిన నెల్లూరు కాంతారావు సైతం పేరున్న మల్లయోధుడే కావడం మరో విశేషం. ఇక ఇతర ప్రధాన పాత్రలలో ధర్మరాజుగా మిక్కిలినేని, దుర్యోధనుడిగా ధూళిపాళ, దుశ్శాసనుడిగా కైకాల సత్యనారాయణ, విరాట రాజుగా ముక్కామల, సుధేష్ణగా సంధ్య, ఉత్తరగా ఎల్.విజయలక్ష్మి, అభిమన్యుడిగా శోభన్ బాబు, సుభద్రగా లక్ష్మీరాజ్యం, శ్రీకృష్ణుడిగా కాంతారావు, ఉత్తరకుమారుడిగా రేలంగి, ఊర్వశిగా పద్మినీ ప్రియదర్శిని నటించారు. ఈ సినిమా విజయంలో సుసర్ల దక్షిణామూర్తి సంగీతానికీ ప్రధాన పాత్ర ఉంది. సుసర్లవారి బాణీలకు తగ్గట్టుగా సముద్రాల, కొసరాజు, శ్రీశ్రీ చక్కని గీతాలను అందించారు. జననీ శివకామినీ అనే భక్తి గీతం నేటికి తెలుగు వారి నోళ్ళలో నానుతూనే ఉంది. ఎవరికోసం ఈ మందహాసం గీతాన్ని ఆలపించని యువతీయువకులు అప్పట్లో లేరంటే అతిశయోక్తి కాదు. అలానే సలలిత రాగ సుధారససారం పాట పాడని వర్ధమాన గాయనీ గాయకులు ఉండేవారే కాదు. సఖియా వివరించవే, నరవరా ఓ కురువరా వంటి పాటలూ ఆపాతమధురాలుగా మిగిలిపోయాయి.
1963లో జాతీయ స్థాయిలో ద్వితీయ ఉత్తమ చిత్రంగా నర్తనశాల ఎంపికై, రాష్ర్టపతి అవార్డును అందుకున్నతొలి తెలుగు సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది. అలానే ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగిన చలన చిత్రోత్సవానికి భారతదేశం తరఫున ఎంపికయిన ఏకైక చిత్రం ఇది. అక్కడకు నిర్మాతలు శ్రీధరరావు, లక్ష్మీరాజ్యంతో పాటు ఎస్వీరంగారావు, రేలంగి, సావిత్రి వెళ్ళారు. కీచకుడిగా ఎస్వీయార్ నటన చూసి ముగ్థులైన అక్కడి ప్రేక్షకులు ఆయనను ఉత్తమ నటుడిగా ఎంపికచేసి, సత్కరించారు. అలానే కళాదర్శకుడు టివిఎస్ శర్మ ప్రతిభనూ వేనోళ్ళపొగిడారు.  విశేషం ఏమంటే ఆ రోజుల్లోనూ సినిమాకు లభించిన ఈ అరుదైన గౌరవాన్ని పాఠకులకు తెలియచేయడానికి ప్రతికలు విశేష కృషి చేశాయి. ఆంధ్రప్రభ దినపత్రిక ఏప్రిల్ 25, 1964న ఓ సప్లిమెంట్ ను ప్రచురించింది. అందులో సినిమాలోని విశేషాలు, నటీనటుల మనసులోని మాటలనే కాకుండా, సాంకేతిక నిపుణుల గొప్పదనాన్ని తెలిసిందీ. అంతేకాదు ఈ సినిమా విషయంలో వచ్చిన రెండు విమర్శలకూ నిర్మాత సహేతుకమైన సమాధానాలను పత్రిక ముఖంగా ఇవ్వడం మరీ విశేషం!

సినీ విమర్శకుడిగా జీవితాన్ని ప్రారంభించి, దర్శకుడిగా ఎదిగిన కమలాకర కామేశ్వరరావును పౌరాణిక బ్రహ్మగా తీర్చిదిద్దిన చిత్రరాజాలలో నర్తనశాలది అగ్రతాంబూలం! ఆపైన ఆయన ఎన్నో అపురూపమైన పౌరాణిక చిత్రాలను రూపొందించి, తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.
నర్తనశాల కథాంశం మీద మక్కువతోనే ఎన్టీయార్ తన నట విశ్వరూపాన్ని సంపూర్ణంగా ఆవిష్కరిస్తూ 1979లో శ్రీమద్విరాటపర్వం సినిమా రూపొందించారు. అందులో ఆయన శ్రీకృష్ణుడు, అర్జునుడు, బృహన్నల, కీచకుడు, దుర్యోధనుడిగా నటించి అలరించారు.