Tuesday, December 17, 2013

Sanku Sir... Happy Birthday!

శంకుగారి పుట్టినరోజు సందర్భంగా ఓ రెండు మాటలు!

'మీ ఇంటికి రావచ్చా... మీతో కాస్త మాట్లాడాలి' అని ఎవరైనా ఫోన్ చేస్తే... నిజం చెప్పొద్దు సవాలక్ష ఆలోచిస్తాను (అతనికి నేను టైమ్ కేటాయింగలనా లేదా! అతను వస్తే నేను చేసుకుంటున్న పనికి ఏమైనా అంతరాయం కలుగుతుందా! లేక బయటకు వెళ్ళాల్సిన పనిని వాయిదా వేసుకోవాల్సి వస్తుందా... ఇలా).
కానీ పాతికేళ్ళ క్రితం పరిచయం అయిన శంకుగారితో నా అనుభవం వేరు. ఆయన స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్ కాబట్టి ఆదివారం ఉదయం నేను ఫోన్ చేసి... 'సార్ మీ ఇంటికి రావచ్చా... కాసేపు మాట్లాడదామని ఉంది' అని అంటే చాలు సెకన్ కూడా పాజ్ ఇవ్వకుండా 'ఓ యస్... తప్పకుండా రండీ' అని సమాధానం చెప్పేవారు. నారాయణగూడాలోని 'జాగృతి' పత్రిక ఆఫీసులో ఉండే నేను, బాగ్ అంబర్ పేటలోని ఆయన ఇంటికి ఆగమేఘాల మీద చేరుకునే వాడిని.
1984లో క్రోక్విల్ హాస్యప్రియ చూసి... దాని అభిమానిని అయిపోయి... ఆ పత్రిక ద్వారానే కార్టూనిస్టుగా తెలుగు పాఠకులకు పరిచయం అయిన వాడిని కాబట్టి... ఆ పత్రిక సంపాదకులైన శంకుగారిని, ఆ పత్రిక కార్యాలయాన్ని చూడాలనే కోరిక నాకు బలంగా ఉండేది. మచిలీపట్నం నుండి విద్య, ఉద్యోగ రీత్యా 1989లో హైదరాబాద్ వచ్చాక శంకు గారిని కలిశాను. కార్టూన్ల గురించి, వాటిని గీసే పెద్దల గురించిన నా అజ్ఞానమంతా ఆయన దగ్గర వెళ్లబోసుకునే వాడిని. ఆయన చక్కగా నవ్వుతూ, ఓపికగా సమాధానాలు ఇస్తూ ఉండేవారు. మధ్యలో ఆయన శ్రీమతి శోభా శంకర్ గారూ వేడి వేడి కాఫీని అందించేవారు.
''సార్... మన 'హాస్యప్రియ' కోసం నేనేమైనా చేయగలిగితే చెప్పండి. ఆనందంగా చేస్తాను. చివరకు ఫ్రూఫ్స్ చూడమన్నా సంతోషంగా చూస్తాను'' అని శంకు గారిని అడుగుతుండే వాడిని.
'ఫర్వాలేదు లెండీ... నేను చూసుకోగలను'... అంటుండేవారు. 'వన్ మ్యాన్ ఆర్మీ'గా ఆయన తన భుజస్కంధాల మీదే ఆ పత్రికను చివరి వరకూ నడిపారు. కొంత కాలానికి 'హాస్యప్రియ' ఆగిపోయింది.
అప్పటికే పత్రికా రంగంలో ఉన్న నేను ఓ పత్రికను సొంతంగా నడపడంలోని సాదక బాధకాలు తెలుసుకున్నాను కాబట్టి పరిస్థితిని అర్థం చేసుకోగలిగాను. అయితే నాకిష్టమైన, నన్ను కార్టూనిస్టుగా పరిచయం చేసిన 'హాస్యప్రియ' మూతపడిందనే బాధ ఇప్పటికీ మనసులో ఓ మూల ముల్లులా గుచ్చుకుంటూనే ఉంటుంది. ఆ పత్రికను శంకు గారు పునః ప్రారంభిస్తే చూడాలనే కోరిక అలానే ఉండిపోయింది. పాతికేళ్ళ మా పరిచయం ఇంకా తాజాగా ఉందంటే దానికి శంకూ గారే కారణం. 'హాస్యప్రియ' పత్రిక ఆగిపోయినా... తోటి కార్టూనిస్టులను ప్రోత్సహించే పని ఆయన ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు.

శంకుగారికి జన్మదిన శుభాకాంక్షలు!

Sunday, December 15, 2013

'Bunny n Cherry' movie review


బ్రెయిన్ సిమ్ ను డామేజ్ చేసేబన్ని ఎన్ చెర్రి’!
జంధ్యాల దర్శకత్వం వహించినరావు గోపాల్రావుసినిమా జ్ఞాపకం ఉందా! హిస్టరీ లెక్చరర్ అయిన రావు గోపాలరావు ఆత్మ, కాలేజీ స్టూడెంట్ చంద్రమోహన్ లోకిచంద్రమోహన్ ఆత్మ రావు గోపాలరావులోకి పరకాయ ప్రవేశం చేసేస్తాయి. అక్కడి నుండి ఎలాంటి పరిణామాలను చోటు చేసుకున్నాయన్నదే ఆ సినిమా ప్రధాన కథాంశం. సరిగ్గా అదే తరహా కథను తీసుకుని దానికో సైంటిఫిక్ రీజన్ కలరింగ్ ఇస్తూ తీసిన సినిమాబన్ని ఎన్ చెర్రి’.  రచయితగా గొప్ప పేరు తెచ్చుకున్న జంధ్యాల, ఆ తర్వాత దర్శకుడిగానూ ఎన్నో కమర్షియల్ సక్సెస్ లు ఇచ్చారు. అలాంటి వ్యక్తి సైతంరావు గోపాలరావుసినిమాను సక్సెస్ చేయలేకపోయారు. కానీ ఏ ధైర్యంతో ఆ తరహా కథాంశాన్ని, అదీ కొత్త దర్శకుడితో సినిమాగా తీసి సక్సెస్ ఇవ్వగలనని నిర్మాత భావించాడో ఆ దేవుడికే తెలియాలి!
బన్ని చక్కగా చదువుకుని, ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేసే బుద్ధిమంతుడు. చెర్రీ ఇంజరీనింగ్ పూర్తి చేసి స్నేహితులతో టైమ్ పాస్ చేసే కుర్రాడు. ఓ రోజు అర్థరాత్రి జరిగిన యాక్సిడెంట్ లో వీరిద్దరూ తీవ్రంగా గాయపడతారు. బ్రెయిన్ కూడా బాగా దెబ్బ తింటుంది. అయితే ఒకరి బ్రెయిన్లోని మెమొరీ సెల్స్ మరొకరికి మార్చితే బతికి బట్టకట్టే అవకాశం ఉందని న్యూరోసర్జన్ చెబుతాడు. ‘ప్రాణాలు కాపాడటం ప్రధానం, మెమొరీ ఛేంజ్ అయితే ఏమిలేఅని భావించిన డాక్టర్ ఆపరేషన్ చేసేస్తాడు. దాంతో రూపం చెర్రీదైనా బ్రెయిన్ మాత్రం బన్నీది. అలానే ఆకారం బన్నీది అయినాఅతని జ్ఞాపకాలన్నీ చెర్రీకి సంబంధించినవే. అతనిలా ఇతనూఇతనిలా అతనూ ప్రవర్తించడం చూసి కుటుంబ సభ్యులు, స్నేహితులు, వారి ప్రియురాళ్ళు కంగారు పడతారు. అక్కడ నుండి ఈ కుర్రాళ్ళ జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? తిరిగి వారు ఎలా మామూలు మనుషులు అయ్యారన్నదే మిగతా కథ.
ఓ అసాధారణ విషయాన్ని సామాన్య ప్రేక్షకుడికి అందించాలంటే ఎంతో హోమ్ వర్క్ చేయాలి. కానీ ఈ సినిమా చూస్తుంటే ఆడుతూ పాడుతూసరదా సరదాగా తీసేసినట్టుగా అనిపిస్తుంది. పోనీ నటీనటులతో అయినా ఏమైనా పరిపక్వత ఉందా అంటే అదీ లేదు. బన్ని గా ప్రిన్స్, చెర్రిగా మహత్ రాఘవేంద్ర  ఏ స్థాయిలోనూ మెప్పించలేదు. కథానాయికలో సభ కాస్త ఫర్వాలేదనిపిస్తుంది. కృతి ఓవర్ యాక్షన్ తట్టుకోవడం కష్టమే. మెమొరీ ఛేంజ్ ఆపరేషన్ గురించి యండమూరి లాంటి వ్యక్తితో చెప్పిస్తే ఆడియెన్స్ కన్వెన్స్ అవుతారని దర్శకుడి భావించాడేమో కానీఅది సఫలం కాలేదు. సుమన్, బ్రహ్మానందం, గౌతంరాజు, పోసాని, అపూర్వ, జూనియర్ ఎస్వీయార్ వంటి వారు ఉన్నా ఆ పాత్రలు ఏమాత్రం పండలేదు. శ్రీవసంత్ సంగీతమూ సోసోగానే ఉంది. మొత్తం మీద ఆడియెన్స్ బ్రెయిన్ సిమ్ ను డామేజ్ చేయడానికే ఈ సినిమా తీసినట్టున్నారు దర్శక నిర్మాతలు రాజేశ్ పులి, హారున్ గని!

'Second Hand' Movie review


సెకండ్హాఫ్హ్యాండ్ఇచ్చింది!
కిశోర్ తిరుమలను దర్శకుడిగా పరిచయం చేస్తూ పూర్ణ నాయుడు నిర్మించిన సినిమాసెకండ్ హ్యాండ్’. రచయితగా మంచి పేరు తెచ్చుకుని, ‘వాంటెడ్మూవీతో దర్శకుడిగానూ మారిన బివియస్ రవి ఈ సినిమాకు సహ నిర్మాత! ఓ రచయిత సొమ్ములు పెట్టి సినిమా తీశాడనే సరికీ అందులో ఏదో విషయం ఉంటుందను కోవడం సహజం. పైగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా సింగిల్ షాట్ లో తీసినసుబ్బారావు…’ పాట గురించి సినీ ప్రముఖులు ఊదర గొట్టేశారు. ఇవన్నీ చూసిన వాళ్లకు పేరుకుసెకండ్ హ్యాండేఅయినాఇదేదో ఫస్ట క్లాస్ మూవీ అయి ఉంటుందనే నమ్మకం కలిగింది. అయితేఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలమైంది.
కథ విషయానికి వస్తేఇది మూడు జంటల ప్రేమ కథ. ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ సంతోష్ బాగా డబ్బున్న దీపు అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. అతనిలోని సిన్సియారిటీని చూసి, ఆమె కూడా ప్రేమలో పడిపోతుంది. తండ్రి ఓ పెద్ద సంబంధం చూపించినా, సంతోష్ ను పెళ్ళి చేసుకోవడానికే సిద్ధపడుతుంది. అయితే దీపు తనను ఎక్కడ రిజెక్ట్ చేస్తుందోననే అనుమానంతో, శారీరకంగా ఆమెకు దగ్గరవ్వాలని సంతోష్ ప్రయత్నిస్తాడు. ఆ పథకం బెడిసికొట్టి దీపు అతనికి దూరమవుతుంది. దాంతో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అదే సమయంలో అతని జీవితంలోకి సుబ్బారావనే అపరిచితుడు ప్రవేశిస్తాడు. స్వేచ్ఛ అనే అమ్మాయితో తను జరిపిన ప్రేమాయణం గురించి వివరించి, ఆత్మహత్య చేసుకోవాల్సి అవసరం లేదని, అటువంటి అమ్మాయిలకు బుద్ధిచెప్పాలని మందలిస్తాడు. అప్పుడే వీరిద్దరికీ సహస్ర తారసపడుతుంది. ఓ చిన్న పాటి గొడవ తారస్థాయికి చేరుకుని వీరు ముగ్గురూ ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడి డాక్టర్ పోసానికి సహస్ర తన ప్రేమకథను చెబుతుంది. ఇద్దరు స్నేహితులలో ఎవరిని పెళ్ళి చేసుకోవాలో తెలియక ఎలా సతమతమౌందీ వివరిస్తుంది.  సంతోష్, సుబ్బారావు, సహస్ర సమస్యలకు పోసాని ఎలాంటి పరిష్కారం చూపించార్నదే సినిమా పతాక సన్నివేశం.

ప్రధమార్థంలో సంతోష్, సుబ్బారావు ప్రేమకథలను చాలా సరదాగా నడిపిన దర్శకుడు ద్వితీయార్థంలో సహస్ర కథను ఆకట్టుకునే రీతిలో నడపడంలో విఫలమయ్యాడు. దాంతోసెకండ్ హ్యాండ్ద్వితీయార్థం ఆడియెన్స్ కు హ్యాండిచ్చినట్టుగా అయిపోయిందిఈ సినిమాలోని కొత్తదనం ఏమంటే దీపు, స్వేచ్ఛ, సహస్ర పాత్రలను ఒకే అమ్మాయితో చేయించడం.  విశేషం ఏమంటే మూడు పాత్రలను ధన్య బాలకృష్ణ సమర్థవంతంగా పోషించింది. ‘సెవెన్త్ సెన్స్’, ‘లవ్ ఫెయిల్యూర్వంటి డబ్బింగ్ సినిమాలలోనూ, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’, ‘చిన్ని చిన్ని ఆశచిత్రాలలో ప్రాధాన్యం ఉన్న పాత్రలను పోషించిన ధన్య ఈ సినిమా మొత్తం తానే అయి నడిపింది. ఇక ప్రధాన పాత్రలను సుధీర్ వర్మ, కిరీటి, శ్రీవిష్ణు, అనోజ్ రామ్ పోషించారు. నటీనటులంతా పాత్రల పరిధి మేరకు చక్కగానే నటించారు. రవిచంద్ర సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. సినిమా టైటిల్ కార్డులో ప్లేచేసేసుబ్బారావు…’ సాంగ్ ట్యూన్ బాగుందిమూడు ప్రేమకథలను కొత్తగా తెరపై చూపించాలనే దర్శకుడి ఆలోచన మంచిదే అయినాదానిని ప్రేక్షకామోదకర రీతిలో చూపించడంలో విఫలమయ్యాడు!

Friday, November 29, 2013

18వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం - ఓ విహంగ వీక్షణం!


తెలుగు సినిమా దుస్థితి!

    'హమ్ తుమ్... దిల్ దివానా! ఫస్ట్ లవ్... సెకెండ్ హ్యాండ్! బాయ్ మీట్స్ గర్ల్... లవ్ ఇన్ మలేసియా'! ఈ పేర్లన్నీ హిందీ సినిమాలవో... లేదా ఇంగ్లీష్ మూవీస్ వో అనుకుంటే మీరు పొరపడినట్టే... తెలుగు సినిమాలకు మన దర్శక నిర్మాతలు పెట్టిన పేర్లివి!! కొత్త కథలను ఎంపిక చేసుకునే సంగతి ఏమో కానీ, పరభాషా పదాలతో సినిమా పేర్లు పెట్టడంలో మాత్రం మనవాళ్ళు ముందున్నారు!!
    హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని వీధులకు అంటించిన వాల్ పోస్టర్స్ చూసిన ఎవరికైనా తాము ముంబైలో ఉన్నామనే భావన కలుగుతుంది. ఫిల్మ్ ఛాంబర్ చుట్టుపక్కల గోడలన్నీ తాజా చిత్రాల పోస్టర్స్ తో నిండిపోవడం, ఆ సినిమాల పేర్లన్నీ హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఉండటమే దానికి కారణం. అయితే చదువుకునేందుకు వీలుగా ఈ సినిమాల పేర్లు మాత్రం తెలుగు లిపిలో ఉంటాయి. గతంలో తమిళ, కన్నడ భాషా చిత్రాలను డబ్బింగ్ చేసే నిర్మాతలు సైతం... 'ఆ సినిమా తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉంది కాబట్టి డబ్ చేశామ'ని ఘనంగా చెప్పుకునే వారు. మరి కొందరు నిర్మాతలైతే, తమ సినిమాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడతాయని ఊదరగొట్టేవారు. ఇప్పుడదంతా పాత చింతకాయ పచ్చడైపోయింది. ట్రెండ్ కు అనుగుణంగా సినిమాకు పేరు పెట్టడం సాధారణ విషయమై పోయింది.  అందుకనే తెలుగు పదాలకు తిలోదకాలిచ్చి... క్యాచీ వర్డ్స్ అంటూ చిత్ర విచిత్రమైన పేర్లు పెడుతున్నారు. తాజాగా క్రికెటర్ కపిల్ దేవ్ ఆడియోను ఆవిష్కరించిన ఓ సినిమా పేరు 'దిల్ దివానా'. ఇది తెలుగు సినిమానే అయినా... కథానుగుణంగా ఆ పేరు పెట్టామన్నది నిర్మాతల మాట.
    'ఈ రోజుల్లో...' తో తెలుగు సినిమా రంగంలో కొత్త పోకడలకు తెర లేపిన దర్శకుడు మారుతీ ఆ తర్వాత మాత్రం ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టడం మీదే ఆసక్తి చూపుతున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలతో పాటు... తను నిర్మాణ భాగస్వామిగా ఉన్న పలు చిత్రాలకు అలాంటి పేర్లే పెడుతున్నాడు. 'అంతకుముందు ఆ తర్వాత' సినిమాతో విజయ పథంలోకి అడుగుపెట్టిన సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా, నందిని కథానాయికగా మారుతీ నిర్మించే సినిమాకు 'లవర్స్' అనే పేరు పెట్టారు. అలానే మారుతీ సమర్పణలో రుద్రపతి రమణారావు నిర్మిస్తున్న సినిమాకూ 'గ్రీన్ సిగ్నల్' అనే పేరు ఖరారు చేశారు. నాలుగు యువ జంటలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ డిసెంబర్ లో విడుదల కాబోతోంది. గతంలో 'ఇట్స్ మై లవ్ స్టోరీ', 'బ్యాక్ బెంచ్  స్టూడెంట్' చిత్రాలకు దర్వకత్వం వహించిన మధుర శ్రీధర్ ఇప్పుడు నిర్మాతగా మారారు. అయినా సినిమాలకు పేర్లు పెట్టే విషయంలో ఆయన తన పంథా మార్చుకోలేదు. సైబర్ క్రైమ్ నేపథ్యంలో, పి.బి. మంజునాథ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ మధుర శ్రీధర్ నిర్మించే తాజా చిత్రం పేరు 'లేడీస్ అండ్ జంటిల్మాన్'. ఈ సినిమాలో మహత్ రాఘవేంద్ర హీరోగా నటిస్తున్నాడు. ఇతనితో పాటే ప్రిన్స్ కూడా హీరోగా నటిస్తున్న మరో సినిమా పేరు 'బన్నీ ఎన్ చెర్రీ'. ఈ మూవీ డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
     'జయం' సినిమాతో హీరోగా తెరంగేట్రమ్ చేసిన నితిన్ 'ఇష్క్'తో మరోసారి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. ఆ తర్వాత 'గుండెజారి గల్లంతయ్యిందే'తో మరో విజయాన్ని తన ఖాతాలో జమ చేసుకున్నాడు. ప్రస్తుతం నితిన్ చేస్తున్న రెండు సినిమాల పేర్లూ ఇంగ్లీష్ లోనే ఉండటం విశేషం. ప్రభుదేవా శిష్యుడు ప్రేమ్ సాయిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మిస్తున్న 'కొరియర్ బోయ్ కళ్యాణ్' అందులో ఒకటి కాగా, పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న 'హార్ట్ ఎటాక్' రెండోది. ఈ రెండు సినిమాలూ ఒకదాని వెనుకే ఒకటి విడుదలకు కానున్నాయి. ఇక 'మొగలిరేకులు' ధారావాహికతో తెలుగు వారికి చేరువైన బుల్లితెర నటుడు సాగర్ తొలిసారి హీరోగా నటిస్తున్న సినిమాకు దర్శక నిర్మాతలు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అనే పేరు పెట్టారు. ఈ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
    'అద్వైతం' సినిమాతో జాతీయ అవార్డును అందుకున్న దర్శకుడు ప్రదీప్ మాడుగుల ప్రస్తుతం 'బిల్లా రంగా' పేరుతో ఓ సినిమా తీస్తున్నారు. ఈ చిత్రంతో పాటే ఆయన దర్శకత్వంలో మరో సినిమా కూడా మొదలైంది. దాని పేరు 'మైనే ప్యార్ కియా'. హిందీలో సూపర్ హిట్ అయిన సినిమాకు దీనికీ సంబంధం లేదని, కథానుగుణంగానే ఈ పేరు పెట్టామని దర్శకుడు చెబుతున్నాడు. అలానే రామ్ గోపాల్ వర్మ సినిమా జీవితం ఆధారంగా విజయ్ కుమార్ నిర్మిస్తున్న సినిమాకు 'ఏ శ్యామ్ గోపాల్ వర్మ ఫిలిమ్' అని నామకరణం చేశారు. షఫీ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఇక చాలా రోజుల తర్వాత ఆర్యన్ రాజేశ్ నటిస్తున్న సినిమాకు 'పకడో పకడో' అనే పేరు పెట్టారు. అలానే హీరో శ్రీకాంత్, కామ్నా జఠ్మలానీ జంటగా నటిస్తున్న సినిమా పేరు 'హంటర్'. ఇదిలా ఉంటే శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'తో హీరోగా పరిచయం అయిన సుధాకర్ కొమాకుల 'ఉందిలే మంచి కాలం ముందు ముందునా' అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అతను నటిస్తున్న మరో సినిమా పేరు మాత్రం 'హ్యాంగ్ అప్'! ఇక 'మనసంతా నువ్వే' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వి.యన్. ఆదిత్య 'రెయిన్ బో' మూవీతో నిర్మాతగానూ మారాడు. ఇప్పుడు... అతని దర్శకత్వంలో రాబోతున్న సినిమా పేరు 'పార్క్'. అలానే 'హ్యాపీడేస్' ఫేమ్ వంశీకృష్ణ నిర్మాతగా మారి తీస్తున్న తొలి సినిమా పేరు 'పేరెంట్స్'. ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
    ప్రస్తుతం తెలుగులో సెట్స్ మీద ఉన్న సినిమాలు దాదాపు వంద వరకూ ఉంటే... అందులో నలభై సినిమాలు హిందీ లేదా ఇంగ్లీష్ పేర్లతో ఉన్నవే. 'ఆ నలుగురు' రచయిత మదన్ దర్శకుడిగా మారి తీసిన తొలి సినిమా 'పెళ్ళయిన కొత్తలో'. ఇప్పుడు అతను విద్యాసాగర్ దర్శకత్వంలో తీస్తున్న సినిమాకు 'కాఫీ విత్ మై వైఫ్' అనే పేరు పెట్టారు. ఇక 'ప్రేమించుకుందాం...రా', 'ప్రేమంటే ఇదేరా' వంటి సూపర్ హిట్స్ తీసిన జయంత్ సి. పరాన్జీ 'లవ్ ఫరెవర్' మూవీ డైరెక్ట్ చేస్తున్నారు. ఇవి కాకుండా... వీకెండ్ లవ్, కలర్ ఫుల్ లైఫ్, లవ్ ఇన్ మలేసియా, హైదరాబాద్ లవ్ స్టోరీ, లవ్ ఇన్ హైదరాబాద్, ఫస్ట్ లవ్, యూత్ ఫుల్ లవ్, ఇట్స్ మై లవ్ లైఫ్, చాటింగ్, బాయ్ మీట్స్ గర్ల్, థర్డ్ మేన్, డెవిల్స్ బుక్ పేర్లతో వస్తున్న సినిమాలు మరికొన్ని. 'వాంటెడ్' సినిమాతో దర్శకుడిగానూ మారిన రచయిత బి.వి.యస్. రవి, తాజాగా తన మిత్రులతో కలిసి 'సెకండ్ హ్యాండ్' మూవీని ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.
    తమిళ ప్రజలకు భాషాభిమానం ఎక్కువ. అందుకు అక్కడి సినిమా రంగమూ మినహాయింపు కాదు. స్వతహాగా అక్కడి దర్శక నిర్మాతలు తమ సినిమాలకు తమిళ పేర్లు పెట్టడానికే  ఆసక్తి చూపిస్తుంటారు. కొందరు సృజనకు సంకెళ్ళా అంటూ హద్దు మీరినా... వారి నడ్డివిరచడానికి ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. అధిక పన్నులు వడ్డించి, వారినీ దారికి తెస్తోంది. ఆ తరహాలోనే తెలుగు సినిమాకు తెలుగు పేరు పెట్టకపోతే... వాణిజ్య పన్ను అధికంగా చెల్లించాల్సి ఉంటుందని మన ప్రభుత్వమూ నిబంధనను విధిస్తే... ఈ పరభాషా వ్యామోహం కాస్త తగ్గే అవకాశం ఉంది. అప్పుడే అచ్చమైన తెలుగు పదాలు మన చెవిని సోకుతాయి!! ఆ రోజులు ఎప్పుడొస్తాయో చూడాలి.







Saturday, October 26, 2013

శ్రుతి హాసన్ రికార్డ్!


ప్రముఖ నటుడు కమల్ హాసన్ తనయి శ్రుతి హాసన్ ఇటీవల ఓ కొత్త రికార్డును నెలకొల్పింది. ఒకే పేరుతో వచ్చిన రెండు సినిమాలలో ఆమె నాయికగా నటించింది. హిందీలో వచ్చిన 'రామయ్యా వస్తావయ్యా' (ఇది తెలుగు సినిమా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' కు రీమేక్) కాగా, మరొకటి తెలుగులో ఎన్టీయార్ హీరోగా దిల్ రాజు నిర్మించిన 'రామయ్యా వస్తావయ్యా'. కథలు వేరైనా టైటిల్ మాత్రం ఒక్కటే! ఈ రెండు సినిమాలలోనూ శ్రుతి నటిస్తోందనగానే అందరూ 'ఆహా...' అనుకున్నారు. అదో రికార్డ్ అయితే...  ఒకదాని వెనుక ఒకటిగా వచ్చిన ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడం మరో రికార్డ్! ఏదేమైనా తండ్రి కమల్ మాదిరే శ్రుతి జయాపజయాల్లోనూ తనదైన శైలి కనబరుస్తోంది!

Saturday, October 12, 2013

Ramayya... vasthavayya movie review



                                         

                             వచ్చిన రామయ్య నచ్చలేదు!



బృందావనం వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ఎన్టీయార్ దిల్ రాజు కాంబినేషన్ లో సినిమా అంటే ఎలా ఉండాలి!? గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీశ్ శంకర్ సినిమా అంటే ఎలా ఉండాలి!? ఎన్టీయార్, హరీశ్ శంకర్ తొలిసారి సినిమా చేస్తున్నారంటే ఏ రేంజ్ లో ఉండాలి!? కానీ రామయ్యా వస్తావయ్యా ఆ స్థాయిలో లేకుండా పోయింది!

బహుశా దానికి కారణం దర్శక నిర్మాతలతో సహా హీరో ఆడియెన్స్ కు ఇచ్చిన భరోసా కావచ్చు. సినిమా విడుదలకు ఐదారు రోజుల ముందు నిర్మాత దిల్ రాజు ఈ యేడాది టాలీవుడ్ టాప్ త్రీ మూవీస్ లో ఇదీ ఒకటి అవుతుందని చెబితే ఓహో అంటూ అభిమానులు అంచనాలు పెంచేసుకున్నారు. ఆడియో ఆవిష్కరణలో ఎన్టీయార్ ను ఇలా గతంలో ఎప్పుడూ చూడలేదు అని హరీశ్ శంకర్ చెబితే, నిజమే కాబోలు అనుకున్నారు. రావు రమేశ్ కనిపించేది కాసేపే అయినా ఇరగదీసేశాడు. శబాష్ అని సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయడు కితాబిస్తే నిజమని నమ్మేశారు.

కానీ రామయ్యా వస్తావయ్యా చూసిన ఆడియెన్స్ ఇదేమిటీ! ఎప్పుడో ఇరవై యేళ్ళ క్రితం తయారు చేసుకున్న కథను ఇప్పుడు తీసినట్టుగా ఉంది అని అనుకుంటూ థియేటర్ నుండి బయటకు వస్తున్నారు. రామయ్య ఎప్పుడొస్తాడా అని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అభిమానుల్ని నిరాశకు గురిచేసే విధంగానే ఈ సినిమా ఉంది.

ఇక కథ విషయానికి వస్తే

నందు కాలేజీ స్టూడెంట్. సరదాగా జీవితాన్ని గడిపేస్తుంటాడు. అతని జీవితంలోకి ఊహించని విధంగా ఆకర్ష ప్రవేశిస్తుంది. ఆమెను ఇంప్రస్ చేసి, ప్రేమలో పడేస్తాడు. అంతేకాదు. ఆమె బామ్మకూ దగ్గరైపోతాడు. ఆమె కోరిక మేరకు ఆకర్ష అక్క పెళ్ళికి ఇతనూ అతిధిగా వెళతాడు. బిజినెస్ మేగ్నెట్ అయిన ఆకర్ష తండ్రిని చంపేస్తాంటూ కొందరు ఫోన్ చేసి బెదిరిస్తూ ఉంటారు. మీరేమీ భయపడకండి అంకుల్, నేనున్నాను అని హామీ ఇస్తాడు నందు. తనపక్కనే నందుని కూర్చోపెట్టుకుని నిమిషాలు లెక్కిస్తున్న ఆకర్ష తండ్రిని నందూనే అతి క్రూరంగా హతమార్చుతాడు. తన ప్రియురాలి తండ్రిని అతను ఎందుకు చంపాల్సి వచ్చింది, అంతటి ఘోరం అతనేం చేశాడు అసలు నందు ఎవరు!? ఈ ప్రశ్నలకు సమాధానంగా ద్వితీయార్థం సాగుతుంది.

రొటీన్ రివేంజ్ డ్రామా! రొటీన్ స్ర్కీన్ ప్లే!! పోనీ ఆర్టిస్టులకైనా ఇదేమైనా కొత్త పాత్రల అంటే అదీ లేదు. ఎన్టీయార్ గతంలో నరసింహుడులో చేసింది ఇదే తరహా పాత్ర! కాకపోతే ఇప్పుడు ఎన్టీయార్ కాస్త సన్నగా, నాజుగ్గా కథానుగుణంగా, కాలేజీ స్టూడెంట్ లానే ఉన్నాడు. ప్రధమార్థంలో ప్రేక్షకులకు కాస్త రిలీఫ్ కలిగిందంటే ఎన్టీయార్ పంచ్ డైలాగ్స్, అతని సరదా నటన వల్లే. ఇక ద్వితీయార్థం వచ్చేసరికీ ఎన్టీయార్ మార్క్ మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ హెవీ డోస్ లో బుర్రను హీటెక్కించేస్తాయి. దాంతో ప్రధమార్థంలోని ఫ్రెష్ నెస్ ను కూడా ఆడియెన్స్ మర్చిపోతారు. కోట శ్రీనివాసరావు కేంద్ర స్ర్తీ, శిశు సంక్షేమ శాఖామంత్రి అని ఒకచోట చెప్పిస్తారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ లో కాలు పెట్టినప్పుడు క్రీడాశాఖామంత్రిని అని చెబుతాడు. ఆ కాసేపట్లోనే పోర్టుఫోలియో మారిపోయిందేమో అర్థం కాదు. అలానే మీడియా వాళ్ళను ఆడిపోసుకోవడం కూడా కావాలని పెట్టినట్టు ఉంది తప్పితే, అవసరమైంది కాదు! హంసానందిని ఓ పాటలో మెరవడం కూడా సెంటిమెంట్ గా అనిపిస్తోంది. మిర్చి, అత్తారింటికి దారేది తర్వాత ఆమె ఈ సినిమాలోనూ ఐటమ్ సాంగ్లో మెరిసింది. ముఖ్యంగా అనంత శ్రీరామ్ రాసిన జాబిల్లి నువ్వే చెప్పమ్మా, సాహితి రాసిన నేనెప్పుడైన కలగన్నానా పాటలు ఆకట్టుకున్నాయి. శ్రీమణి, భాస్కరభట్ల గీతాలు మాస్ కు నచ్చుతాయి. తమన్ బాణీలలో కొత్తదనం కనిపించలేదు. నటీనటుల్లో ఎన్టీయార్ కు వంక పెట్టేది లేదు. బాగాచేశాడు. బృందావనంలో సమంత పాత్రను కాజల్ డామినేట్ చేసినట్టుగానే ఇక్కడా ఆ ఛాన్స్ శ్రుతిహాసన్ కొట్టేసింది. రావు రమేశ్ పాత్ర ఎంట్రీలో ఉన్న బిల్డప్ తర్వాత లేదు. కోట, ముఖేశ్ రుషి, రవిశంకర్, భరణి, నాగినీడు అందరివీ రొటీన్ క్యారెక్టర్లే. కాస్త వెరైటీ క్యారెక్టర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆమె రోహిణీ హట్టంగడీనే. ఈ యేడాది ప్రారంభంలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ప్రేమను పంచే బామ్మగా నటించిన ఆమె, ఇందులో యంగ్ జనరేషన్ తో పాటు తానూ అప్ డేట్ అయ్యే పాత్రను చక్కగా చేసి, ఆకట్టుకుంది. ఇందులో నాది డిఫరెంట్ క్యారెక్టర్ అని గట్టిగా చెప్పుకునే అర్హత ఆమె ఒక్కదానికే ఉందనిపిస్తుంది. చోటా కె నాయుడు కెమెరాపనితనం బాగానే ఉంది. 

ఎటొచ్చి కథలో బలం లేకపోవడంతో, స్ర్కీన్ ప్లే పరమ రొటీన్ గా ఉండటంతో ఈ సినిమా సాధారణ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలం అయింది. ఎన్టీయార్ ను అభిమానించేవారికి మాత్రమే నచ్చే సినిమా ఇది!

యాభై యేళ్ళకూ చెక్కుచెదరని 'నర్తనశాల'!


                  

                         50 యేళ్ళకూ చెక్కుచెదరని నర్తనశాల

అత్యంత సుందరాంగుడు నందమూరి తారకరామారావు పేడి ముఖంతో వెండితెరపై కనిపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా!?
వయసుకు మించిన శరీరభారంతో ఉన్న సావిత్రిని పాండవుల సతీమణి ద్రౌపతిగా సినీ వీక్షకులు అంగీకరించగలరా!?
అహంకారానికి, అధికార దర్పానికి నిలువెత్తు నిదర్శనంగా ఎస్వీరంగారావును తెలుగువారు ఊహించుకోగలరా!?
సాంఘికాలను రూపొందించి, విజయం సాధించిన కమలాకర కామేశ్వరరావు పౌరాణిక గాథకు న్యాయం చేయగలరా!?

ఈ ప్రశ్నలన్నింటికి లభించిన చక్కని సమాధానం నర్తనశాల!

తెలుగువారికి మాత్రమే వరమైన పద్యం తొలిటాకీ చిత్రాలలో విరివిగా వినిపించేది. అటువంటి పద్యాలు, అద్భుతమైన పాటల సమాహారంగా తెరకెక్కిన సినిమా నర్తనశాల!
రాజ్యం పిక్చర్స్ బ్యానర్ లో శ్రీధరరావు,లక్ష్మీ రాజ్యం నిర్మించిన ఈ సినిమా 11 అక్టోబర్, 1963న విడుదలై, అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇవాళతో యాభై వసంతాలను పూర్తి చేసుకుంది. తెలుగు సినిమా ఖ్యాతిని, తెలుగు నటుని సత్తాను ప్రపంచదేశాలకు తెలియచేసిన సినిమాగా నర్తనశాల చరిత్రలో నిలిచిపోయింది.

భారతీయులకు సంస్కృతి, సంప్రదాయాలంటే ఎనలేని మక్కువ అనే విషయం అందిరికీ తెలిసిందే. అందుకే సినిమా మాధ్యమంలోనూ వాటికే మనవాళ్ళు అధిక ప్రాధాన్యమిచ్చారు. మూకీ సమయంలోనే కాదు టాకీలు ప్రారంభమైనా అదే ఒరవడి కొనసాగింది. నర్తనశాల కథాంశంతోనే 1918లోనటరాజ మొదలియార్ కీచకవధ పేరుతో ఓ మూకీ తీశారు. 1937లో విజయదశమి లేక కీచకవధ పేరుతోనూ ఓ టాకీ చిత్రం వచ్చింది. నిజానికి కీచకవథ కథను ఇప్పుడు తలుచుకుంటే ఇది చిరపురాతనం నిత్యనూతనం అనిపిస్తుంది. ఇప్పటికీ ఇదే ఫార్ములాలో భారతీయ సినిమాలు తెరకెక్కుతుండటం విశేషం. మాయాజూదంలో కౌరవుల చేతిలో ఓడిపోయినందుకు గానూ పన్నెండేళ్లు అరణ్యవాసం, ఆపై ఓ యేడాది అజ్ఞాతవాసం చేయడానికి అంగీకరించిన పాండవులు, చివరి యేడాది విరాట రాజు కొలువులో మారువేషాలతో గడిపిన సందర్భంలో జరిగే కథే ఈ చిత్రం!
పౌరాణిక పాత్రలంటే ప్రాణం పెట్టే ఎన్టీయార్ తో పాండవమధ్యముడు అర్జునిడి పాత్ర చేయించాలనుకున్నారు. అందులో ఇబ్బందిలేదు. అయితే ఆ అర్జునుడు ఇప్పుడే ధనుర్ధారి కాదు, నాట్యాచార్యుడు అదీ ఆడామగా కానీ వ్యక్తి! ఆ పాత్రను చేయమని ఎన్టీయార్ ను అడగడానికి ఎంత సాహసం కావాలి. అయినా ఆయనతో ఉన్న పరిచయం,చనువుతో లక్ష్మీరాజ్యం, శ్రీధరరావు దంపతులు ఎన్టీయార్ ను కలిసి,  సంప్రదించారు. తొలుత ఆయన సందేహించినా, కళాదర్శకుడు టివియస్ శర్మ వేసిన చిత్రాలను చూసి తన అంగీకారం తెలిపారు. అలానే బృహన్నల వేషధారణను తన అభిమాన దర్శకుడు కె.వి. రెడ్డికి చూపించి, ఆయన భేష్ అన్నతర్వాతనే ముందుకెళ్ళారు ఎన్టీయార్. అలానే ద్రౌపదిగా నటించిన సావిత్రి సైతం ముందు ససేమిరా అన్నారు. అంతకుముందు ఈ సంస్థ నిర్మించిన సంసారం చిత్రం నుండి ఆమెను తొలగించడంతో కినుక వహించారు.  తాను కాస్త లవుగా ఉన్నానంటూ సాకు చూపించారు. కానీ దర్శక నిర్మాతల ఒత్తిడి, ఎన్టీయార్ ప్రోత్సాహం కారణంతో ఆమె కాదలేక ద్రౌపది పాత్ర పోషణకు సుముఖత వ్యక్తం చేశారు. ఇక కీలకమైన కీచకుడి పాత్రకు ఎస్వీయార్ ఎన్నుకోవడంతో దర్శక నిర్మాతలకు ఉన్న దూరదృష్టి ఏమిటో అందరికీ అర్థమైపోయింది. కీచకుడిగా ఎస్వీయార్ తెరపై కనిపించేది కొద్దిసేపే అయినా, తన ప్రతిభాపాటవాలతో ఆయన ప్రేక్షకుల్ని విస్మయానికి గురిచేశారు. అయితే కేవలం నటీనటుల ఎంపికతోనే విజయలక్ష్మి నర్తనశాలలో నర్తించలేదన్నది వాస్తవం. సాంకేతిక నిపుణుల ప్రతిభ, నటీనటుల అంకితభావానికి తోడైంది. నృత్యంలో అనుభవంలేని ఎన్టీయార్ నాట్యాచారుడిగా నటించడం కోసం ఎంతో కృషి చేశారు.  పైగా ఎల్. విజయలక్ష్మి లాంటి చక్కని నృత్యకళాకారిణికి తాను నాట్యం నేర్పు తున్నట్టు నటించాలంటే కొంత సాధన అవసరమని ఆయన భావించారు. అందుకనే వెంపటి పెదసత్యంగారి వద్ద నెల రోజుల పాటు నాట్యాన్ని అభ్యసించారు. సావిత్రి అయితే ద్రౌపది పాత్రలో లీనమైపోయారు.  తండ్రికి అంతగా ఆరోగ్యం బాగోకపోవడంతో సముద్రాల జూనియర్ కీచక స్వగతానికి సంభాషణలు రాశారు.  సంధాన సమయమైనది.. ఇంకనూ సైరంధ్రి రాలేదే అంటూ సాగే ఆ మాటలను చదివి ఎస్వీయార్ పరమానందభరితులైపోయారు. ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేశారు. ఈ సినిమాలో మరో కీలకమైన పాత్ర భీముడిది. ఈ పాత్రకోసం పన్నెండు సంవత్సరాల పాటు హెవీ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ అయిన, ఇండియన్ టార్జాన్ దండమూడి రాజగోపాల్ ను ఎంపిక చేశారు దర్శక నిర్మాతలు. ఆయన కూడా తనకిచ్చిన తొలి అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నారు. అలానే జీమూతమల్లుడిగా నటించిన నెల్లూరు కాంతారావు సైతం పేరున్న మల్లయోధుడే కావడం మరో విశేషం. ఇక ఇతర ప్రధాన పాత్రలలో ధర్మరాజుగా మిక్కిలినేని, దుర్యోధనుడిగా ధూళిపాళ, దుశ్శాసనుడిగా కైకాల సత్యనారాయణ, విరాట రాజుగా ముక్కామల, సుధేష్ణగా సంధ్య, ఉత్తరగా ఎల్.విజయలక్ష్మి, అభిమన్యుడిగా శోభన్ బాబు, సుభద్రగా లక్ష్మీరాజ్యం, శ్రీకృష్ణుడిగా కాంతారావు, ఉత్తరకుమారుడిగా రేలంగి, ఊర్వశిగా పద్మినీ ప్రియదర్శిని నటించారు. ఈ సినిమా విజయంలో సుసర్ల దక్షిణామూర్తి సంగీతానికీ ప్రధాన పాత్ర ఉంది. సుసర్లవారి బాణీలకు తగ్గట్టుగా సముద్రాల, కొసరాజు, శ్రీశ్రీ చక్కని గీతాలను అందించారు. జననీ శివకామినీ అనే భక్తి గీతం నేటికి తెలుగు వారి నోళ్ళలో నానుతూనే ఉంది. ఎవరికోసం ఈ మందహాసం గీతాన్ని ఆలపించని యువతీయువకులు అప్పట్లో లేరంటే అతిశయోక్తి కాదు. అలానే సలలిత రాగ సుధారససారం పాట పాడని వర్ధమాన గాయనీ గాయకులు ఉండేవారే కాదు. సఖియా వివరించవే, నరవరా ఓ కురువరా వంటి పాటలూ ఆపాతమధురాలుగా మిగిలిపోయాయి.
1963లో జాతీయ స్థాయిలో ద్వితీయ ఉత్తమ చిత్రంగా నర్తనశాల ఎంపికై, రాష్ర్టపతి అవార్డును అందుకున్నతొలి తెలుగు సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది. అలానే ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగిన చలన చిత్రోత్సవానికి భారతదేశం తరఫున ఎంపికయిన ఏకైక చిత్రం ఇది. అక్కడకు నిర్మాతలు శ్రీధరరావు, లక్ష్మీరాజ్యంతో పాటు ఎస్వీరంగారావు, రేలంగి, సావిత్రి వెళ్ళారు. కీచకుడిగా ఎస్వీయార్ నటన చూసి ముగ్థులైన అక్కడి ప్రేక్షకులు ఆయనను ఉత్తమ నటుడిగా ఎంపికచేసి, సత్కరించారు. అలానే కళాదర్శకుడు టివిఎస్ శర్మ ప్రతిభనూ వేనోళ్ళపొగిడారు.  విశేషం ఏమంటే ఆ రోజుల్లోనూ సినిమాకు లభించిన ఈ అరుదైన గౌరవాన్ని పాఠకులకు తెలియచేయడానికి ప్రతికలు విశేష కృషి చేశాయి. ఆంధ్రప్రభ దినపత్రిక ఏప్రిల్ 25, 1964న ఓ సప్లిమెంట్ ను ప్రచురించింది. అందులో సినిమాలోని విశేషాలు, నటీనటుల మనసులోని మాటలనే కాకుండా, సాంకేతిక నిపుణుల గొప్పదనాన్ని తెలిసిందీ. అంతేకాదు ఈ సినిమా విషయంలో వచ్చిన రెండు విమర్శలకూ నిర్మాత సహేతుకమైన సమాధానాలను పత్రిక ముఖంగా ఇవ్వడం మరీ విశేషం!

సినీ విమర్శకుడిగా జీవితాన్ని ప్రారంభించి, దర్శకుడిగా ఎదిగిన కమలాకర కామేశ్వరరావును పౌరాణిక బ్రహ్మగా తీర్చిదిద్దిన చిత్రరాజాలలో నర్తనశాలది అగ్రతాంబూలం! ఆపైన ఆయన ఎన్నో అపురూపమైన పౌరాణిక చిత్రాలను రూపొందించి, తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.
నర్తనశాల కథాంశం మీద మక్కువతోనే ఎన్టీయార్ తన నట విశ్వరూపాన్ని సంపూర్ణంగా ఆవిష్కరిస్తూ 1979లో శ్రీమద్విరాటపర్వం సినిమా రూపొందించారు. అందులో ఆయన శ్రీకృష్ణుడు, అర్జునుడు, బృహన్నల, కీచకుడు, దుర్యోధనుడిగా నటించి అలరించారు.