Tuesday, December 17, 2013

Sanku Sir... Happy Birthday!

శంకుగారి పుట్టినరోజు సందర్భంగా ఓ రెండు మాటలు!

'మీ ఇంటికి రావచ్చా... మీతో కాస్త మాట్లాడాలి' అని ఎవరైనా ఫోన్ చేస్తే... నిజం చెప్పొద్దు సవాలక్ష ఆలోచిస్తాను (అతనికి నేను టైమ్ కేటాయింగలనా లేదా! అతను వస్తే నేను చేసుకుంటున్న పనికి ఏమైనా అంతరాయం కలుగుతుందా! లేక బయటకు వెళ్ళాల్సిన పనిని వాయిదా వేసుకోవాల్సి వస్తుందా... ఇలా).
కానీ పాతికేళ్ళ క్రితం పరిచయం అయిన శంకుగారితో నా అనుభవం వేరు. ఆయన స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్ కాబట్టి ఆదివారం ఉదయం నేను ఫోన్ చేసి... 'సార్ మీ ఇంటికి రావచ్చా... కాసేపు మాట్లాడదామని ఉంది' అని అంటే చాలు సెకన్ కూడా పాజ్ ఇవ్వకుండా 'ఓ యస్... తప్పకుండా రండీ' అని సమాధానం చెప్పేవారు. నారాయణగూడాలోని 'జాగృతి' పత్రిక ఆఫీసులో ఉండే నేను, బాగ్ అంబర్ పేటలోని ఆయన ఇంటికి ఆగమేఘాల మీద చేరుకునే వాడిని.
1984లో క్రోక్విల్ హాస్యప్రియ చూసి... దాని అభిమానిని అయిపోయి... ఆ పత్రిక ద్వారానే కార్టూనిస్టుగా తెలుగు పాఠకులకు పరిచయం అయిన వాడిని కాబట్టి... ఆ పత్రిక సంపాదకులైన శంకుగారిని, ఆ పత్రిక కార్యాలయాన్ని చూడాలనే కోరిక నాకు బలంగా ఉండేది. మచిలీపట్నం నుండి విద్య, ఉద్యోగ రీత్యా 1989లో హైదరాబాద్ వచ్చాక శంకు గారిని కలిశాను. కార్టూన్ల గురించి, వాటిని గీసే పెద్దల గురించిన నా అజ్ఞానమంతా ఆయన దగ్గర వెళ్లబోసుకునే వాడిని. ఆయన చక్కగా నవ్వుతూ, ఓపికగా సమాధానాలు ఇస్తూ ఉండేవారు. మధ్యలో ఆయన శ్రీమతి శోభా శంకర్ గారూ వేడి వేడి కాఫీని అందించేవారు.
''సార్... మన 'హాస్యప్రియ' కోసం నేనేమైనా చేయగలిగితే చెప్పండి. ఆనందంగా చేస్తాను. చివరకు ఫ్రూఫ్స్ చూడమన్నా సంతోషంగా చూస్తాను'' అని శంకు గారిని అడుగుతుండే వాడిని.
'ఫర్వాలేదు లెండీ... నేను చూసుకోగలను'... అంటుండేవారు. 'వన్ మ్యాన్ ఆర్మీ'గా ఆయన తన భుజస్కంధాల మీదే ఆ పత్రికను చివరి వరకూ నడిపారు. కొంత కాలానికి 'హాస్యప్రియ' ఆగిపోయింది.
అప్పటికే పత్రికా రంగంలో ఉన్న నేను ఓ పత్రికను సొంతంగా నడపడంలోని సాదక బాధకాలు తెలుసుకున్నాను కాబట్టి పరిస్థితిని అర్థం చేసుకోగలిగాను. అయితే నాకిష్టమైన, నన్ను కార్టూనిస్టుగా పరిచయం చేసిన 'హాస్యప్రియ' మూతపడిందనే బాధ ఇప్పటికీ మనసులో ఓ మూల ముల్లులా గుచ్చుకుంటూనే ఉంటుంది. ఆ పత్రికను శంకు గారు పునః ప్రారంభిస్తే చూడాలనే కోరిక అలానే ఉండిపోయింది. పాతికేళ్ళ మా పరిచయం ఇంకా తాజాగా ఉందంటే దానికి శంకూ గారే కారణం. 'హాస్యప్రియ' పత్రిక ఆగిపోయినా... తోటి కార్టూనిస్టులను ప్రోత్సహించే పని ఆయన ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు.

శంకుగారికి జన్మదిన శుభాకాంక్షలు!

No comments:

Post a Comment