Friday, November 29, 2013

18వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం - ఓ విహంగ వీక్షణం!


తెలుగు సినిమా దుస్థితి!

    'హమ్ తుమ్... దిల్ దివానా! ఫస్ట్ లవ్... సెకెండ్ హ్యాండ్! బాయ్ మీట్స్ గర్ల్... లవ్ ఇన్ మలేసియా'! ఈ పేర్లన్నీ హిందీ సినిమాలవో... లేదా ఇంగ్లీష్ మూవీస్ వో అనుకుంటే మీరు పొరపడినట్టే... తెలుగు సినిమాలకు మన దర్శక నిర్మాతలు పెట్టిన పేర్లివి!! కొత్త కథలను ఎంపిక చేసుకునే సంగతి ఏమో కానీ, పరభాషా పదాలతో సినిమా పేర్లు పెట్టడంలో మాత్రం మనవాళ్ళు ముందున్నారు!!
    హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని వీధులకు అంటించిన వాల్ పోస్టర్స్ చూసిన ఎవరికైనా తాము ముంబైలో ఉన్నామనే భావన కలుగుతుంది. ఫిల్మ్ ఛాంబర్ చుట్టుపక్కల గోడలన్నీ తాజా చిత్రాల పోస్టర్స్ తో నిండిపోవడం, ఆ సినిమాల పేర్లన్నీ హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఉండటమే దానికి కారణం. అయితే చదువుకునేందుకు వీలుగా ఈ సినిమాల పేర్లు మాత్రం తెలుగు లిపిలో ఉంటాయి. గతంలో తమిళ, కన్నడ భాషా చిత్రాలను డబ్బింగ్ చేసే నిర్మాతలు సైతం... 'ఆ సినిమా తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉంది కాబట్టి డబ్ చేశామ'ని ఘనంగా చెప్పుకునే వారు. మరి కొందరు నిర్మాతలైతే, తమ సినిమాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడతాయని ఊదరగొట్టేవారు. ఇప్పుడదంతా పాత చింతకాయ పచ్చడైపోయింది. ట్రెండ్ కు అనుగుణంగా సినిమాకు పేరు పెట్టడం సాధారణ విషయమై పోయింది.  అందుకనే తెలుగు పదాలకు తిలోదకాలిచ్చి... క్యాచీ వర్డ్స్ అంటూ చిత్ర విచిత్రమైన పేర్లు పెడుతున్నారు. తాజాగా క్రికెటర్ కపిల్ దేవ్ ఆడియోను ఆవిష్కరించిన ఓ సినిమా పేరు 'దిల్ దివానా'. ఇది తెలుగు సినిమానే అయినా... కథానుగుణంగా ఆ పేరు పెట్టామన్నది నిర్మాతల మాట.
    'ఈ రోజుల్లో...' తో తెలుగు సినిమా రంగంలో కొత్త పోకడలకు తెర లేపిన దర్శకుడు మారుతీ ఆ తర్వాత మాత్రం ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టడం మీదే ఆసక్తి చూపుతున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలతో పాటు... తను నిర్మాణ భాగస్వామిగా ఉన్న పలు చిత్రాలకు అలాంటి పేర్లే పెడుతున్నాడు. 'అంతకుముందు ఆ తర్వాత' సినిమాతో విజయ పథంలోకి అడుగుపెట్టిన సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా, నందిని కథానాయికగా మారుతీ నిర్మించే సినిమాకు 'లవర్స్' అనే పేరు పెట్టారు. అలానే మారుతీ సమర్పణలో రుద్రపతి రమణారావు నిర్మిస్తున్న సినిమాకూ 'గ్రీన్ సిగ్నల్' అనే పేరు ఖరారు చేశారు. నాలుగు యువ జంటలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ డిసెంబర్ లో విడుదల కాబోతోంది. గతంలో 'ఇట్స్ మై లవ్ స్టోరీ', 'బ్యాక్ బెంచ్  స్టూడెంట్' చిత్రాలకు దర్వకత్వం వహించిన మధుర శ్రీధర్ ఇప్పుడు నిర్మాతగా మారారు. అయినా సినిమాలకు పేర్లు పెట్టే విషయంలో ఆయన తన పంథా మార్చుకోలేదు. సైబర్ క్రైమ్ నేపథ్యంలో, పి.బి. మంజునాథ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ మధుర శ్రీధర్ నిర్మించే తాజా చిత్రం పేరు 'లేడీస్ అండ్ జంటిల్మాన్'. ఈ సినిమాలో మహత్ రాఘవేంద్ర హీరోగా నటిస్తున్నాడు. ఇతనితో పాటే ప్రిన్స్ కూడా హీరోగా నటిస్తున్న మరో సినిమా పేరు 'బన్నీ ఎన్ చెర్రీ'. ఈ మూవీ డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
     'జయం' సినిమాతో హీరోగా తెరంగేట్రమ్ చేసిన నితిన్ 'ఇష్క్'తో మరోసారి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. ఆ తర్వాత 'గుండెజారి గల్లంతయ్యిందే'తో మరో విజయాన్ని తన ఖాతాలో జమ చేసుకున్నాడు. ప్రస్తుతం నితిన్ చేస్తున్న రెండు సినిమాల పేర్లూ ఇంగ్లీష్ లోనే ఉండటం విశేషం. ప్రభుదేవా శిష్యుడు ప్రేమ్ సాయిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మిస్తున్న 'కొరియర్ బోయ్ కళ్యాణ్' అందులో ఒకటి కాగా, పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న 'హార్ట్ ఎటాక్' రెండోది. ఈ రెండు సినిమాలూ ఒకదాని వెనుకే ఒకటి విడుదలకు కానున్నాయి. ఇక 'మొగలిరేకులు' ధారావాహికతో తెలుగు వారికి చేరువైన బుల్లితెర నటుడు సాగర్ తొలిసారి హీరోగా నటిస్తున్న సినిమాకు దర్శక నిర్మాతలు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అనే పేరు పెట్టారు. ఈ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
    'అద్వైతం' సినిమాతో జాతీయ అవార్డును అందుకున్న దర్శకుడు ప్రదీప్ మాడుగుల ప్రస్తుతం 'బిల్లా రంగా' పేరుతో ఓ సినిమా తీస్తున్నారు. ఈ చిత్రంతో పాటే ఆయన దర్శకత్వంలో మరో సినిమా కూడా మొదలైంది. దాని పేరు 'మైనే ప్యార్ కియా'. హిందీలో సూపర్ హిట్ అయిన సినిమాకు దీనికీ సంబంధం లేదని, కథానుగుణంగానే ఈ పేరు పెట్టామని దర్శకుడు చెబుతున్నాడు. అలానే రామ్ గోపాల్ వర్మ సినిమా జీవితం ఆధారంగా విజయ్ కుమార్ నిర్మిస్తున్న సినిమాకు 'ఏ శ్యామ్ గోపాల్ వర్మ ఫిలిమ్' అని నామకరణం చేశారు. షఫీ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఇక చాలా రోజుల తర్వాత ఆర్యన్ రాజేశ్ నటిస్తున్న సినిమాకు 'పకడో పకడో' అనే పేరు పెట్టారు. అలానే హీరో శ్రీకాంత్, కామ్నా జఠ్మలానీ జంటగా నటిస్తున్న సినిమా పేరు 'హంటర్'. ఇదిలా ఉంటే శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'తో హీరోగా పరిచయం అయిన సుధాకర్ కొమాకుల 'ఉందిలే మంచి కాలం ముందు ముందునా' అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అతను నటిస్తున్న మరో సినిమా పేరు మాత్రం 'హ్యాంగ్ అప్'! ఇక 'మనసంతా నువ్వే' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వి.యన్. ఆదిత్య 'రెయిన్ బో' మూవీతో నిర్మాతగానూ మారాడు. ఇప్పుడు... అతని దర్శకత్వంలో రాబోతున్న సినిమా పేరు 'పార్క్'. అలానే 'హ్యాపీడేస్' ఫేమ్ వంశీకృష్ణ నిర్మాతగా మారి తీస్తున్న తొలి సినిమా పేరు 'పేరెంట్స్'. ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
    ప్రస్తుతం తెలుగులో సెట్స్ మీద ఉన్న సినిమాలు దాదాపు వంద వరకూ ఉంటే... అందులో నలభై సినిమాలు హిందీ లేదా ఇంగ్లీష్ పేర్లతో ఉన్నవే. 'ఆ నలుగురు' రచయిత మదన్ దర్శకుడిగా మారి తీసిన తొలి సినిమా 'పెళ్ళయిన కొత్తలో'. ఇప్పుడు అతను విద్యాసాగర్ దర్శకత్వంలో తీస్తున్న సినిమాకు 'కాఫీ విత్ మై వైఫ్' అనే పేరు పెట్టారు. ఇక 'ప్రేమించుకుందాం...రా', 'ప్రేమంటే ఇదేరా' వంటి సూపర్ హిట్స్ తీసిన జయంత్ సి. పరాన్జీ 'లవ్ ఫరెవర్' మూవీ డైరెక్ట్ చేస్తున్నారు. ఇవి కాకుండా... వీకెండ్ లవ్, కలర్ ఫుల్ లైఫ్, లవ్ ఇన్ మలేసియా, హైదరాబాద్ లవ్ స్టోరీ, లవ్ ఇన్ హైదరాబాద్, ఫస్ట్ లవ్, యూత్ ఫుల్ లవ్, ఇట్స్ మై లవ్ లైఫ్, చాటింగ్, బాయ్ మీట్స్ గర్ల్, థర్డ్ మేన్, డెవిల్స్ బుక్ పేర్లతో వస్తున్న సినిమాలు మరికొన్ని. 'వాంటెడ్' సినిమాతో దర్శకుడిగానూ మారిన రచయిత బి.వి.యస్. రవి, తాజాగా తన మిత్రులతో కలిసి 'సెకండ్ హ్యాండ్' మూవీని ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.
    తమిళ ప్రజలకు భాషాభిమానం ఎక్కువ. అందుకు అక్కడి సినిమా రంగమూ మినహాయింపు కాదు. స్వతహాగా అక్కడి దర్శక నిర్మాతలు తమ సినిమాలకు తమిళ పేర్లు పెట్టడానికే  ఆసక్తి చూపిస్తుంటారు. కొందరు సృజనకు సంకెళ్ళా అంటూ హద్దు మీరినా... వారి నడ్డివిరచడానికి ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. అధిక పన్నులు వడ్డించి, వారినీ దారికి తెస్తోంది. ఆ తరహాలోనే తెలుగు సినిమాకు తెలుగు పేరు పెట్టకపోతే... వాణిజ్య పన్ను అధికంగా చెల్లించాల్సి ఉంటుందని మన ప్రభుత్వమూ నిబంధనను విధిస్తే... ఈ పరభాషా వ్యామోహం కాస్త తగ్గే అవకాశం ఉంది. అప్పుడే అచ్చమైన తెలుగు పదాలు మన చెవిని సోకుతాయి!! ఆ రోజులు ఎప్పుడొస్తాయో చూడాలి.