Monday, August 12, 2013

The unsung hero... Sri K.V. Seshagiri Rao!


శ్రీ కె.వి. శేషగిరి రావు గారితో నాకు వ్యక్తిగత పరిచయం కావడానికంటే ముందే ఆయన రచనలతో పరిచయమైంది. నా చిన్నతనం నుండి జాగృతి వార పత్రిక మా ఇంటికి పోస్టులో వస్తుండేది. 1985 ప్రాంతంలో 'స్వాతి' అనే పేరుతో జాగృతిలో అనేక వ్యాసాలు వస్తుండేవి. అమెరికా, రష్యా, చైనా దేశాల దురాగతాల గురించి, ఇస్లామిక్ తీవ్రవాదం గురించి, క్రైస్తవుల మతమార్పిడి గురించి స్వాతి పేరుతో వచ్చే ఆవ్యాసాలు చదువుతూ, నేను ఆయన అభిమానిగా మారిపోయాను. నా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత జాగృతిలోనే సబ్ ఎడిటర్ గా చేరినప్పుడు స్వాతి అనే పేరుతో ఆర్టికల్స్ రాస్తోంది శ్రీ కె.వి. శేషగిరిరావు గారని తెలిసింది. ఆయన న్యూఢిల్లీలో వ్యవసాయ మంత్రిత్వ శాఖలో డైరెక్టర్ గా పనిచేస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగి అయిన కారణంగా 'స్వాతి' అనే కలం పేరుతో వ్యాసాలు రాస్తున్నారని మా ఎడిటర్ శ్రీ రామ్మోహనరావు గారు చెప్పారు. 

వారంలో క్రమం తప్పకుండా నాలుగైదు రోజులు ఆయన నుండి మాకు వ్యాసాలు వస్తుండేవి. జాతీయ, అంతర్జాతీయ అంశాల గురించి ఎంతో లోతైన భావాలను సైతం ఆయన సరళమైన భాషలో పాఠకులకు అందించేవారు. కేవలం వ్యాసాలు రాయడమే కాదు... నవభారతి ప్రచురణ సంస్థ కోసం వందలాది పుస్తకాలు రాశారు. తన కార్యాలయానికి వెళ్లే ముందు, అక్కడి నుండి ఇంటికి వచ్చే ముందు న్యూఢిల్లీలోని విదేశీ గ్రంథాలయాలకు వెళ్ళి సమాచారాన్ని సేకరించి, వాస్తవమైన విషయాలను అందించడానికి ఆయన ఎంతో శ్రమపడేవారు. స్కూటర్ మీదనే ఢిల్లీ వీధుల్లో రోజుకు ఇరవై ముప్ఫై కిలోమీటర్లు ప్రయాణం చేసేవారు. నేను జాగృతిలో ఉన్న నాలుగేళ్ళ కాలంలో ఆయన ఆర్టికల్ పోస్టులో రాగానే మొట్టమొదట నేనే చదివే వాడిని. ఆ రకంగా నేను వాటికి తొలి పాఠకుడిని. ఆయన పంపిన వ్యాసం అందిందని, ఫలానా సంచికలో ప్రచురిస్తున్నామని నేనే వారం వారం ఉత్తరాలు రాస్తుండేవాడిని. యేడాదిన్నర పాటు మా మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాక, వృత్తిరీత్యా ఢిల్లీ వెళ్ళినప్పుడు తొలిసారి, నా అభిమాన రచయిత శ్రీ కె.వి. శేషగిరి రావుగారిని రామకృష్ణాపురంలోని ఆయన ఇంటిలో కలిశాను. ఆయన చూపించిన అభిమానం కారణంగా వారి కుటుంబానికి మరింత చేరువయ్యాను.

ఏ విషయం గురించి అయినా హాయిగా చదువుకునేలా వ్యాసాన్ని రాయడంలో ఆయనకు ఆయనే సాటి. కానీ ఏ రోజునా పేరు కోసం, వ్యక్తిగత ప్రచారం కోసం ఆయన పాకులాడలేదు. స్వాతి అనే వ్యక్తి ఎవరో కూడా చాలామంది జాగృతి పాఠకులకు తెలియనే తెలియదు. సంపాదకులు శ్రీ రామ్మోహనరావుగారు తనకు అప్పగించిన పనిని ప్రతిఫలాపేక్ష లేకుండా, సంవత్సరాల తరబడి, అదే అంకితభావంతో నిర్వర్తించిన గొప్ప రచయిత శ్రీ శేషగిరిరావుగారు. ఉద్యోగ విరమణ తర్వాత హైదరాబాద్ మల్కాజ్ గిరి లో ఆయన స్థిరపడ్డారు. 
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను నెల రోజుల క్రితమే వెళ్ళి కలిసి. నా కథల పుస్తకం ఇచ్చి, ఆశీస్సులు తీసుకుని వచ్చాను. గొప్ప రచయిత, మానవతా వాది అయిన శ్రీ శేషగిరిరావు గారు ఈ రోజు సాయంత్రం స్వర్గస్థులయ్యారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు తన రచనలతో జాగృతి పాఠకులను అలరించిన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.