Wednesday, August 2, 2023

Karthik with Martinoz

 


కుర్రాళ్ళోయ్... కుర్రాళ్ళు!

జూన్ 29న మా రవి పాడి బావ ఫోన్ చేసి... ‘మీ మేనల్లుడు ప్రణీత్ పూనే లోనే ఉన్నాడా?’ అని అడిగారు. వాడికి ఫోన్ చేస్తే... అంబర్ నాథ్ లో వాళ్ళ పాప మొక్కులు తీర్చుకునే పనిలో ఉన్నానని చెప్పాడు. అదే మాట బావకు చెప్పాను. ‘సర్లే... నా పని బెంగళూరుకు మారిందన్న మాట’ అని చెప్పి ఫోన్ కట్ చేశారు. ఆ తర్వాత పదిరోజులకు నా వాట్సప్ కు ఓ ఫోటో వచ్చింది. అందులో రవి పాడి బావ వాళ్ళ పెద్దబ్బాయి కార్తికేయ అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్ తో దిగిన ఫోటో ఉంది. దాన్ని చూడగానే నేను ఆశ్చర్యపోయాను... మా అబ్బాయి కార్తికేయకు దాన్ని చూపిస్తే... ‘కార్తీక్ అన్న... మార్టినెజ్ తో ఫోటో దిగాడా? ఆయన ఎంత గొప్ప ఫుట్ బాల్ ప్లేయరో తెలుసా?’ అనేశాడు.
నిజం చెప్పాలంటే... ఆ క్షణం వరకూ నాకు ఎమిలియానో మార్టినెజ్ గురించి ఏమీ తెలియదు. అదే మాటను మా రవి పాడి బావతో చెబితే, అర్జెంటీనా దేశాన్ని విశ్వవిజేతగా నిలపడంలో మార్టినెజ్ పాత్ర ఏమిటనేది ఆయన వివరిస్తే... నోరెళ్ళబెట్టాను. మా బావ కొడుకు కార్తికేయ ప్రస్తుతం డాక్టర్ బి. వి. రాజు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజరీనింగ్ చదువుతున్నాడు. చిన్నప్పటి నుండి ఫుట్ బాల్ ప్లేయర్. స్కూల్ లోనూ, కాలేజీలోనూ ఫుట్ బాల్ ఆడాడు. సంగీతమంటే అభిరుచి ఉన్న కార్తికేయ రాయల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ (లండన్)లో ఓకల్ వెస్ట్రన్, పియానో 5వ గ్రేడ్ ఉత్తీర్ణత కూడా సాధించాడు.
ఇక జూలై ఫస్ట్ వీక్ మార్టినెజ్ కోల్ కతాలోని మోహన్ బగాన్ క్లబ్ లో జరిగే ఓ ప్రైవేట్ ఈవెంట్ కు వస్తున్నాడని తెలుసుకున్న మా బావ కొడుకు కార్తికేయ అక్కడకు వెళ్ళి మార్టినెజ్ ను కలుసుకుని, 2022 వరల్డ్ కప్ రిప్లికా తో ఫోటో దిగాడు. అర్జంటీనా జెర్సీపై ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నాడు. హైదరాబాద్ నుండి ఓ ఫుట్ బాల్ క్రీడాకారుడు తనను కలుసుకోవడానికి కోల్ కతా వచ్చాడని తెలుసుకున్న మార్టినెజ్ కూడా కార్తీకేయను చక్కగా రిసీవ్ చేసుకున్నాడు. కార్తికేయలోని ఈ ఉత్సాహం, చొరవ, తెగింపు చూసిన తర్వాత అప్పుడెప్పుడో ‘అందమైన అనుభవం’ సినిమాలోని ‘’కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళోయ్ కళ్ళాలే లేనోళ్ళు’’ అనే పాట గుర్తొచ్చింది.
ఇంతకూ జూన్ నెలాఖరులో మా బావ నాకు పూనేలో పనుందని ఫోన్ చేసింది అక్కడ నుండి అర్జెంటీనా జెర్సీని తెప్పించడానికట! ఆ రోజు మా మేనల్లుడు పూనే లో లేకపోవడంతో... బెంగళూరులో తెలిసినవాళ్ళకు ఫోన్ చేసి... హుటాహుటిన అక్కడ నుండి హైదరాబాద్ కు జెర్సీ తెప్పించి, తన కొడుక్కి ఇచ్చి, కోల్ కతా పంపారన్న మాట!!

No comments:

Post a Comment