Sunday, July 28, 2013

శ్రీ అక్కినేని రవిశంకర్ ప్రసాద్… కొన్ని జ్ఞాపకాలు!

ఒక వ్యక్తిని ఎప్పుడు ఎక్కడ ఎలా కలుస్తామో… ఏ రకంగా ఆయన మన జీవితంలో మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోతారో నిజంగానే ఓ మిస్టరీ! ఇటీవల కన్నుమూసిన ప్రముఖ నిర్మాత రవిశంకర్ ప్రసాద్ గారితో నా అనుబంధం అలాంటిదే. చిరంజీవి హీరోగా నటించిన ‘శంకర్ దాదా ఎం.బి.బి.యస్.’ చిత్రానికి ఆయన నిర్మాత. ఆంధ్రజ్యోతి దిన ప్రతిక ఫిల్మ్ రిపోర్టర్ గా ఆయన ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది. రవిశంకర్ ప్రసాద్ ఉండేది చెన్నైలో, అయితే సినిమా విడుదల సందర్భంగా 2004 అక్టోబర్ మాసంలో ఆయన హైదరాబాద్ వచ్చారు. పి.ఆర్.ఓ. వేణుగోపాల్ ద్వారా ఆయన అపాయింట్ మెంట్ తీసుకున్నాను.

జెమినీ టీవీ ఛానెల్ అధినేత, పెద్ద బిజినెస్ మేగ్నేట్, అన్నింటినీ మించి నేను ఎంతో గౌరవించే, భారతదేశం గర్వించే సినీ ప్రముఖుడు స్వర్గీయ ఎల్.వి. ప్రసాద్ గారికి రవిశంకర్ ప్రసాద్ స్వయాన మనవడు. ఈ కారణాల చేత కాస్త నెర్వస్ గానే ఆయన గదిలోకి అడుగుపెట్టాను. నన్ను చూడగానే లేచి నిలుచుకుని ఆప్యాయంగా షేక్ హ్యాండ్ ఇచ్చారు. దాంతో సగం టెన్షన్ తగ్గిపోయింది. ఆ తర్వాత సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూ సరదాగా సాగిపోయింది. ఈలోగా టీ వచ్చింది. దానిని తాగుతూ ఉంటే, ఆయన రాజమండ్రిలో తాను ప్రారంభించిన ఆనందీ రెసిడెన్సి హోటల్ గురించి చెప్పారు. ఎన్నో సౌకర్యాలను కల్పిస్తున్నా… కస్టమర్ల ను హోటల్ కు తీసుకు రాలేకపోతున్నామని, ఆ అంశం రైల్వేస్టేషన్ లోనూ, బస్ స్టేషన్ లోనూ ఉండే రిక్షావాళ్ళ చేతుల్లో ఉంటుందని అన్నారు. తాను ఓ సారి స్వయంగా రిక్షాలో తన హోటల్ కు వెళ్ళినప్పుడు ఈ విషయం బోధపడిందని చెప్పారు.

ఈ విషయాన్ని తీసుకుని కథ ఎందుకు రాయకూడదూ అని నా మనసుకు అనిపించింది. ఆయన సమస్యకు నాదైన పరిష్కారాన్ని ఆలోచించి… ‘అదీ సంగతి’ అనే పేరుతో ఓ చిన్న కథ రాశాను. దానిని నవ్య వీక్లీ ఎడిటర్ శ్రీరమణగారు చదివి బాగుందని, 2005 ఫిబ్రవరి 9, సంచికలో ప్రచురించారు.

తర్వాత ఎప్పుడైనా కలిసినప్పుడు రవిశంకర్ ప్రసాద్ గారికి ఈ విషయాన్ని చెప్పాలని అనుకున్నాను. కానీ నాకు ఆ అవకాశం కలగలేదు. ఈ నెల 8వ తేదీ భగవంతుడు ఆ అవకాశాన్ని శాశ్వతంగా దూరం చేశాడు.



No comments:

Post a Comment