Tuesday, July 19, 2011

Vikram's 'Naanna' movie review


హృదయాన్ని హత్తుకునే 'నాన్న'!
ఒక దశకు చేరుకున్నాక, నటీనటులకు సంపాదన మీద కంటే కూడా కీర్తికాంక్షలపై ఆశ కలుగుతుంది. అందుకనే కెరీర్‌ ప్రారంభంలో కమర్షియల్‌ హిట్‌ కోసం పాకులాడిన వారు ఒక స్థాయికి వచ్చాక, వైవిధ్యమైన పాత్రలు చేసి పేరు సంపాదించుకోవాలని తహతహలాడుతుంటారు. పైగా స్టార్‌ హీరోలు రొటీన్‌ ఫార్ములా సినిమాలు చేసినా అభిమానులు, సాధారణ ప్రేక్షకులు హర్షించరు. ప్రస్తుతం కథానాయకుడు విక్రమ్‌ది అదే పరిస్థితి. అందుకనే హడావుడి పడకుండా ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. 'శివపుత్రుడు'తో ఉత్తమనటుడిగా జాతీయ అవార్డును అందుకున్న విక్రమ్‌ ఓ సాదా సీదా నటుడిగా కెరీర్‌ను ప్రారంభించాడు. తమిళ, తెలుగు భాషల్లో చిన్న చిన్న పాత్రలు చేసి ఒక్కో అడుగు అధిరోహిస్తూ ఇవాళ స్టార్‌ హీరోగా ఎదిగాడు. దర్శకుడు శంకర్‌తో కలిసి 'అపరిచితుడు' చేశాక, విక్రమ్‌ హీరోగా శిఖరాగ్రాన్ని చేరినట్టు అయింది. ఇక ఇప్పుడు నటుడిగా తనను ఛాలెంజ్‌ చేసే పాత్రల కోసం పరితపిస్తున్నాడు. అందులో భాగంగానే తాజాగా 'దైవ తిరుమగన్‌' సినిమా చేశాడు. ఇది తెలుగులో 'నాన్న'గా అనువాదమైంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైంది.
'నాన్న' సినిమా పేరుకు తగ్గట్టుగానే ఓ నాన్న కథ. మానసికంగా ఎదగని ఓ తండ్రి వ్యథ. ఊటీలో చాక్లెట్‌ ఫ్యాక్టరీలో పనిచేసే కృష్ణ (విక్రమ్‌) మానసిక ఎదుగుదల లేని మనిషి. అయినా అతన్ని ఇష్టపడి ఓ గొప్పింటి అమ్మాయి కన్నవాళ్ళను కాదని పెళ్ళి చేసుకుంటుంది. ఓ పాపకు జన్మనిచ్చిన మరుక్షణమే ఆమె మరణిస్తుంది. ఇక ఆ చిన్నారి పాపకు కృష్ణే తల్లీతండ్రి! మూడేళ్ళపాటు స్నేహితులు, సహచరుల సహకారంతో ఏ లోటు లేకుండా తన కూతురు వెన్నెల (బేబీ సారా)ను పెంచుతాడు. ఆమెను స్కూల్‌లో వేసినప్పటి నుండి కృష్ణ జీవితంలో కష్టాలు మొదలవుతాయి. ఆ స్కూల్‌ కరస్పాండెంట్‌ శ్వేత (అమలాపాల్‌)కు వెన్నెల అంటే తెలియని అభిమానం కలుగుతుంది. తీరా చూస్తే వెన్నెల తన చనిపోయిన అక్క కూతురే అని తెలుస్తుంది. వైజాగ్‌లో ఉండే నాన్నకు కబురు చేస్తుంది. తమని కాదని ప్రేమించి పెళ్ళి చేసుకున్న కూతురు చనిపోయింది, కనీసం ఆమె వారసురాలినైనా తనతో తీసుకెళ్ళాలని చూస్తాడు. అందుకు కృష్ణ ప్రతిఘటించడంతో వెనక్కి తగ్గుతారు. కృష్ణని కూడా తమతో పాటు రమ్మని చెప్పి, ఓ తెల్లవారు ఝామున మార్గం మధ్యలో అతన్ని కారు నుండి దింపేసి వెళ్ళిపోతారు. మనసికంగా ఎదగని కృష్ణకు తాను ఎక్కడున్నాడో తెలియదు. తాను ఎక్కడ నుండి అక్కడకు వచ్చాడో తెలియదు. తెలిసిందంతా తన కూతురు వెన్నెలను కొందరు ఎత్తుకు పోయారనే. అటువంటి పరిస్థితిలో అనుకోకుండా అతనికి లాయర్‌ అనురాధ (అనుష్క) పరిచయం అవుతుంది. కృష్ణ కథను తెలుసుకుని అతనికి సాయం చేసేందుకు సిద్ధపడుతుంది. కోర్టు ద్వారా అతనికి న్యాయం జరిగేలా చేస్తానని హామీ ఇస్తుంది. కృష్ణ తన కూతురు వెన్నెలను కలుసుకున్నాడు? ఈ అమాయక తండ్రీ కూతుళ్ళకు న్యాయం జరిగిందా! లేదా? అన్నది పతాక సన్నివేశం.
'నాన్న' సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది విక్రమ్‌ నటన. మానసికంగా ఎదగని తండ్రిగా అతను అద్భుతంగా నటించాడు. అలానే మూడేళ్ళ బేబీ సారా కూడా విక్రమ్‌కు థీటుగా నటించి మెప్పించింది. లాయర్‌ అనురాధగా అనుష్క చక్కగా నటించింది. అనుష్క నటించిన 'అరుంధతి' సినిమా తమిళంలో ఘన విజయాన్ని సాధించింది. అంతవరకూ అనుష్కను ఓ గ్లామర్‌ హీరోయిన్‌గానే చూసిన తమిళ ప్రేక్షకులకు ఆమెలోని మరో కోణం 'అరుంధతి' సినిమాతో తెలిసింది. అలానే గత యేడాది అక్కడ ఘన విజయం సాధించిన 'సింగం' (తెలుగులో 'యముడు') సినిమా కూడా ఆమెకు నటిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడీ సినిమా కూడా నటిగా అనుష్కలోని సత్తాను చాటేదే. అలానే 'మైనా'తో తమిళ ప్రేక్షకులకు చేరువైన మలయాళీ నటి అమలాపాల్‌ కూడా పాత్రోచితంగా నటించింది. ఇక సంతానం, నాజర్‌, సచిన్‌ ఖేడ్కర్‌, సురేఖావాణి తమ పాత్రల్లో చక్కగా ఇమిడిపోయారు.
తమిళంలో గత యేడాది వచ్చిన 'మదరాసి పట్టణం' సినిమాకు దర్శకత్వం వహించిన ఎ.ఎల్‌. విజయ్‌ 'నాన్న' సినిమాను డైరెక్ట్‌ చేశాడు. నిజానికి పదేళ్ళ క్రితం హాలీవుడ్‌లో వచ్చిన 'ఐ యామ్‌ శామ్‌' అనే సినిమా ఆధారంగా, 'నాన్న' తెరకెక్కింది. ఇదే సినిమాను కాస్త అటు ఇటుగా మార్చి ఆరేళ్ళ క్రితం హిందీలో అజయ్‌ దేవ్‌గన్‌ హీరోగా 'మై ఐసా హీ హూ' చిత్రాన్ని తీశారు. ఇప్పుడు మరోసారి 'నాన్న'గా ఈ సినిమా దక్షిణాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ చక్కని కథాంశాన్ని ప్రేక్షకులకు అందించడం మంచిదే కానీ పూర్తిగా కాపీ కథను అందించడమే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అమాయకపు తండ్రి అనగానే తెలుగు వాళ్ళందరికీ గుర్తొచ్చేది 'స్వాతిముత్యం'లో కమల్‌ హాసనే. అయితే ఆ ఛాయలు ఎక్కడా కనిపించకుండా విక్రమ్‌ ఈ పాత్రలో ఒదిగిపోయాడు. అతను పోషించిన కృష్ణ పాత్రలో ఓ స్వచ్ఛత మనకు గోచరిస్తుంది. ముఖ్యంగా కోర్టులో వచ్చే పతాక సన్నివేశంలో విక్రమ్‌, సారా పోటీపడి నటించారు. ఈ సినిమాకు ఓ రకంగా ప్రాణం పోసింది జి.వి. ప్రకాశ్‌ నేపథ్య సంగీతం. సినిమాలో వచ్చే పాటలన్నీ సందర్భానుసారంగా ఉండేవే. అలానే నీరవ్‌ షా కెమెరాపనితనం కూడా చెప్పుకోదగ్గది. చాలా కాలం తర్వాత మళ్ళీ వెండితెరపై ఊటీ అందాలను ఆస్వాదించే అవకాశం కలిగింది.
మొత్తం మీద రొటీన్‌ ఫార్ములా చిత్రాలకు భిన్నంగా 'నాన్న' రూపొందింది. కమర్షియల్‌గా ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించకపోవచ్చు. కానీ మనసున్న ప్రతివారినీ ఆకట్టుకుంటుంది. ఆలోచింపచేస్తుంది. 'నాన్న' సినిమాను తెలుగువారి ముందుకు తీసుకొచ్చిన నిర్మాతలు మళ్ళా విజయ్‌ ప్రసాద్‌, సురేశ్‌ కొండేటి అభినందనీయులు.

No comments:

Post a Comment