Monday, January 28, 2013

'Viswaroopam' movie review


                    

                      కమల్ హసన్ 'విశ్వరూప' విన్యాసం!

సినిమాను శ్వాసించడం అందరివల్లా కాదు. దానిని శ్వాసించకుండా ఉండటమూ కొందరివల్ల కాదు. అటువంటి వ్యక్తి కమల్ హాసన్. కొత్త సినిమా మొదలు పెట్టేప్పుడు చేసే చిత్రాల సంఖ్య మరొకటి పెరిగిందని ఆయన భావించడు.  అందుకోసమే అయితే అసలు సినిమానే చేయడు. మనసా వాచా కర్మణ పాత్రను ప్రేమిస్తాడు కాబట్టే దానికి  ప్రాణ ప్రతిష్ఠ చేయగలుగుతాడు. నటుడిగా కమల్ కు తిరుగులేదు.. ఇప్పుడు దర్శకుడిగానూ…అని తాజా చిత్రం ‘విశ్వరూపం’ నిరూపించింది.
కథ విషయానికి వస్తే…ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన టెర్రరిజాన్ని కూకటి వేళ్ళతో పెకళించడానికి కంకణం కట్టుకున్న ఓ దేశభక్త ముస్లిం సాహసగాథ ఇది. అయితే దీనికి అమెరికాను నేపథ్యంగా తీసుకున్నారు కమల్ హాసన్. సినిమా ప్రారంభమూ అక్కడే జరుగుతుంది. అమెరికాలో నివసించే భారతీయ యువతీ యువకులకు విశ్వనాథ్ (కమల్ హాసన్) నృత్యం నేర్పిస్తుంటాడు.  అతన్ని పెళ్ళి చేసుకోవడం  ద్వారా అమెరికాకు వెళ్ళొచ్చని, అక్కడ పిహెచ్ డీ చేయొచ్చని భావిస్తుంది డాక్టర్ నిరుపమ. అయితే  పెళ్ళయిన తర్వాత ఆమెకు  భర్త మీద అనుమానం మొదలవుతుంది. దాంతో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ను నియమించి, భర్తను వెంబడించమని కోరుతుంది. ఈ పరిశోధన సమయంలోనే ఊహించని విధంగా ఆ డిటెక్టివ్ ను టెర్రరిస్ట్ నాయకుడు జాన్ ఒమర్ (రాహుల్ బోస్) మనుషులు హత్య చేస్తారు. అంతేకాదు విశ్వనాథ్ ను, అతని భార్య నిరుపమను, ఆమె బాస్ దీపక్ (సమ్రాట్ చక్రవర్తి) అందించిన సమాచారంతో కిడ్నాప్ చేస్తారు. విశ్వనాథ్ గతం గురించి  తెలిసి ఒమర్ సంఘటనా స్థలం లోకి చేరుకునే లోపే భార్యతో కలిసి అతను శత్రువులను సంహరించి బయటపడతాడు. విశ్వనాథ్ నిజానికి ఓ ముస్లిం అని, అతను అల్ ఖైదా బృందానికి ఒకప్పుడు శిక్షణ ఇచ్చిన వ్యక్తి అని ఒమర్ తన సహచరులకు చెబుతాడు. విశ్వనాథ్ గతం ఏమిటి? తన స్నేహితుడైన ఒమర్ తో అతనికి వైరమెందుకొచ్చింది? వరుస బాంబు దాడులకు పాల్పడాలనుకున్న ఈ టెర్రరిస్టుల హింస రచనను విశ్వనాథ్ ఎలా భగ్నం చేశాడు? అన్నది మిగతా కథ.
ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన టెర్రరిజంపై వివిధ భాషల్లో వివిధ దేశాలలో అనేక సినిమాలు రూపొందాయి.  అందులో ‘విశ్వరూపం’ ది ఓ ప్రత్యేక స్థానం. ఇది కమల్ మార్కు భారతీయ సినిమానే అయినే…అంతర్జాతీయ చిత్రాల స్థాయిలో ఇది తెరకెక్కింది. నటుడిగా కమల్ హాసన్ ను వేలెత్తి చూపలేం. ఇందులో మూడు భిన్నమైన వేషధారణలతో కమల్ కనిపిస్తారు. ప్రథమార్థంలో  నాట్యాచారుడు విశ్వనాథ్ గా, ఆల్ ఖైదా తీవ్రవాదిగా, ద్వితీయార్థంలో ‘రా’ ఏజెంట్ గా వైవిధ్యమైన  నటన ప్రదర్శించారు. ఇక ఈ చిత్రంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది రాహుల్ బోస్ గురించి కమల్ తో సరిసమానంగా నటించాడు. ఇతర ప్రధాన పాత్రలను పూజా కుమార్, ఆండ్రియా, సమ్రాట్ చక్రవర్తి, జయదీప్ అహ్లావత్, నాజర్, శేఖర్ కపూర్ తదితరులు సమర్థవంతంగా పోషించారు. పాటలకు పెద్దగా ఆస్కారం లేని  ఈ సినిమాలో నేపథ్య సంగీతందే పైచేయి. శంకర్, ఎహ్ సాన్, లాయ్ త్రయం చక్కని సంగీతాన్ని అందించింది. అలానే సినిమాకు హైలైట్ గా  నిలిచింది శాను వర్గీస్ కెమెరా పనితనం. ఆఫ్గనిస్తాన్ నేపథ్యంలో చిత్రీకరించిన సన్నివేశాలన్నీ మన కళ్ళ ముందే జరుగుతున్న భావన కలుగుతుంది. అయితే మహేశ్ నారాయణ్ ఎడిటింగ్ పేలవంగా ఉన్న కారణంగా….సినిమా కొన్ని సన్నివేశాలలో మందగమనంతో సాగింది. కమల్ స్క్రీన్ ప్లే అత్యద్భుతం. నాట్యాచార్యుడు విశ్వనాథ్ ఒక్కసారిగా జూలు విదిల్చిన సింహంలా ప్రత్యర్థుల మీద దాడి చేసిన సన్నివేశాన్ని థియేటర్లలోని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రత్యేకమైన వినోదం లేకపోయినా కమల్ మార్కు డైలాగ్ కామెడీని విశ్వనాథ్ పాత్ర ద్వారా అందించారు. ఆ తర్వాత సినిమా అంతా కథానుగుణంగా సాగటంతో సాధారణ ప్రేక్షకుడికి కాస్త విసుగు కలగడం సహజం. కానీ కమల్ మాత్రం ఎటువంటి సంశయాలూ మనసులో పెట్టుకోకుండా తాను చెప్పాలనుకున్నది చెప్పారు.  ఇటువంటి సినిమాలకు ముగింపు ఇవ్వడం అనేది ఎంతో సంక్లిష్టమైంది. ఆ విషయంలో కమల్ కూడా మినహాయింపు కాదని ‘విశ్వరూపం’ నిరూపించింది. అందుకే దీనికి ఓ సీక్వెల్ ఉంటుందనే విధంగా ముగింపు పలికారు.
ఎన్నో ఆటంకాలను, అవరోధాలను తట్టుకున్నందుకు మాత్రమే కాదు, ఓ మంచి సినిమాను స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించినందుకూ కమల్ ను అభినందించాలి.  ఆరు పాటలు, నాలుగు పోరాట సన్నివేశాల ఫార్ములా సినిమాలకు అలవాటుపడిన మన ప్రేక్షకులు సమాజంలో జరుగుతున్న అరాచకాలను, తీవ్రవాదుల దుశ్చర్యలను ఎండగట్టే ఇటువంటి ఆలోచనాత్మక చిత్రాలను ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమా చూసిన తర్వాత అందరి మనసుల్ని తొలిచే ప్రశ్న ఒక్కటే – ఈ సినిమాపై అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ముస్లిం సంస్థలకు ఎందుకు వచ్చింది? టెర్రరిజానికి వ్యతిరేకంగా ఓ ముస్లిం పోరాడినట్టు కమల్ హాసన్ చూపించడాన్ని వారు సహించలేకపోతున్నారా అనే సందేహం కలుగుతుంది.

No comments:

Post a Comment