Sunday, September 7, 2014

పోర్ బందర్ మీదుగా రెండు జ్యోతిర్లింగాల దర్శనం!

వీలైనన్ని పర్యాటక కేంద్రాలు చూడాలన్నది నా ఆశ. ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవాలన్నది మా బావగారి కోరిక. దాంతో మా రెండు కుటుంబాల అభిరుచికి తగ్గట్టుగా గుజరాత్ లోని సోమనాథ, నాగేశ్వరం జ్యోతిర్లింగాల పర్యటనను ఆయన గమ్మత్తుగా ప్లాన్ చేశారు. మాతో పాటు బావగారి చిరకాల మిత్రుడు, పొద్దుటూరుకు చెందిన రంగస్వామి గారి కుటుంబం  కూడా జత కలవడంతో పిల్లాపెద్దా కలిపి మొత్తం పదిహేను మందిమి అయ్యాం.
హైదరాబాద్ నుండి శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరే రాజ్ కోట్ ఎక్స్ ప్రెస్ లో రిజర్వేషన్ చేయించుకున్నాం. దాదాపు ఇరవై నాలుగు గంటల ప్రయాణం తర్వాత ఆదివారం మధ్యాహ్నం రెండున్నరకు రైలు అహ్మదాబాద్ కు చేరింది. రైల్వే స్టేషన్ లోని రెస్ట్ రూమ్ లో కాలకృత్యాలు తీర్చుకుని, సబర్మతీ ఆశ్రమంకు బైలుదేరడంతో మా యాత్ర మొదలైందని చెప్పాలి.
అహ్మదాబాద్ స్టేషన్ నుండి నాలుగు మైళ్ళ దూరంలో సబర్మతి నది ఒడ్డున ఉందా ఆశ్రమం. బయట నుండి చూడటానికి సాదా సీదాగా కనిపించినాలోపలికి అడుగుపెట్టిన తర్వాత కానీ దాని గొప్పతనం మాకు అర్థం కాలేదు. గాంధీజీకి చెందిన ఛాయాచిత్రాలతో ఆ ఆశ్రమం మాకు స్వాగతం పలికింది. అంతేనాఆయన ఉపయోగించిన చేతికర్ర, ధరించిన చెప్పులు, నూలు వడికిన రాట్నం వంటివి  అక్కడ ప్రదర్శనకు ఉంచారు. వీటన్నిటింకంటే మమ్మల్ని అమితంగా ఆకట్టుకుంది. ఆయన నివసించిన హృదయ్ కుంజ్! గాంధీ ఉపయోగించిన గదికి తాళం వేసినాఆశ్రమంలో అతిథులు కూర్చొనే స్థలం, కస్తూరీబా గది, ఆమె వంటచేసిన ప్రదేశమూ వంటివి చూడగలిగాం. 1917 నుండి దండి ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించే వరకూ గాంధీ సబర్మతీ ఆశ్రమంలో ఉంటూనే తన కార్యకలాపాలను నిర్వర్తించారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ సబర్మతీ ఆశ్రమంలో కాలు పెట్టనని చెప్పి మరీ బయలు దేరిన ఆయన, స్వాతంత్రానంతరం ఆరు మాసాల్లోనే హత్యకు గురికావడంతో అక్కడకు తిరిగి రాలేకపోయారన్న విషయం తెలిసి మనసు విలవిలలాడింది.
హృదయ్ కుంజ్ వసారాలోనే ఓ పెద్దాయన రాట్నం ఎలా వడకాలో విదేశీయులకు ఓపికగా చూపెడుతుంటే ముచ్చటేసింది. భారత స్వతంత్రోద్యమంలో గాంధీజీ పాత్రను మననం చేసుకుంటూ ఆశ్రమానికి వీడ్కోలు పలికాం. రైల్వే స్టేషన్ కు వెళ్ళే దారిలో ఉన్న స్వామినారాయణ మందిరాన్ని, జైన్ టెంపుల్ ను వీక్షించాం. ఆ రోజు రాత్రి పది గంటలకు అహ్మదాబాద్ నుండి విరావల్ కు మా రైలు ప్రయాణం మొదలైంది.
త్రివేణీ ఘాట్ లో జలకాలాటలు!
ఆదివారం రాత్రి అహ్మాదాబాద్ లో ఎక్కిన రైలు సోమవారం ఉదయం ఏడు గంటలకు విరావల్ కు చేరింది. అక్కడ నుండి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సోమనాథ్ కు ఆటోలో బయలుదేరాం. దారిపొడుగుతా మాకు వందల సంఖ్యలో ఫిషింగ్ బోట్స్ కనిపించాయి. ప్రతి బోటు మీద మువ్వన్నెల జండా ఎగరడంతో పాటు స్కూల్ పిల్లలు యూనిఫామ్ ధరించినట్టుగా ఆ బోట్లన్ని ఒకే రంగులో ఉండటం విశేషం. బహుశా ఇవి భారతదేశానికి చెందినవని గుర్తించడం కోసం అలా చేశారేమోనని పించింది. ఇక సోమనాథ మందిర స్వాగత ద్వారం దాటి ముందుకు సాగే సరికీ అప్పటి వరకూ విశాలంగా ఉన్న రోడ్లు సన్నగా కుచించుకుపోయి కనిపించాయి. ఆటో వెనుక ఆటో వెళ్ళాల్సిందే తప్పితేఓవర్ టేక్ చేసే ప్రసక్తే లేదు.
సోమనాథ మందిరానికి దగ్గరలోనే మా బసకు ఏర్పాట్లు జరిగాయి. పక్కనే ఉన్న సముద్రంలో మూడు మునకలు వేయాలనే కోరిక బలంగాఉన్నా, జోరుగా కురుస్తున్న వర్షాల కారణంగా కలెక్టర్ అందుకు అనుమతించడం లేదని, కావాలంటే దగ్గరలో ఉన్న త్రివేణీ ఘాట్ కు తీసుకెళతానని మా ఆటో డ్రైవర్ చెప్పాడు. బసలో కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత అందరం ఛలో అంటూ అటుకేసి బయలుదేరాం. దట్టమైన చెట్ల మధ్య నుండి త్రివేణీ ఘాట్ వైపు వెళుతుంటేపురివిప్పిన నెమళ్ళు అనేకం మాకు కనుల విందు చేశాయి.  
ఘాట్ స్వాగత తోరణం నుండి లోపలకు వెళ్ళగానేఎదురుగా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ విగ్రహం కనిపించింది. 1967 నుండి 1995 వరకూ శ్రీ సోమనాథ ట్రస్ట్ అధ్యక్షుడిగా మొరార్జీదేశాయ్ బాధ్యతలను నిర్వర్తించారు. దేవాలయంతో పాటు ఈ ఘాట్ అభివృద్ధికి కృషి చేసినందుకు గానూ ఆయన విగ్రహాన్ని 2006లో ఆవిష్కరించారట. అక్కడ నుండి బోటులో త్రివేణీ సంగమ స్థలికి బయలు దేరాంరెండు కిలోమీటర్ల దూరంలో కపిల, హిరణ్య, సరస్వతి నదులు కలుస్తాయని బోటులోవాళ్ళు చెప్పారు. అంతర్వాహినిగా ఉన్న సరస్వతి మాట ఏమోగానీ, కపిల, హిరణ్య నదుల నీళ్ళు వేర్వేరు రంగుల్లో ఉండటంతో వాటి సంగమం చాలా స్పష్టంగా మాకు కనిపించింది. అక్కడ నుండి ఒడ్డుకు వచ్చి కాసేపు ఆ నదీతీరంలో జలకాలాడాం. ఆ తర్వాత దగ్గరలో ఉన్న గీతామందిరానికి వెళ్ళాం. శ్రీకృష్ణ పరమాత్ముని సోదరుడు, యాదవ రాజు బలరాముడు అవతారం చాలించిన పుణ్య తీర్థం అది. ఓ చిన్న గుహలో బలరాముడి విగ్రహం దర్శనమిచ్చింది. అక్కడ నుండే ఆయన ఆదిశేషుగా మారి అంతర్థానం అయ్యాడని అక్కడి వారు చెప్పారు.  శ్రీకృష్ణుడు కూడా తన అవతారాన్ని చాలించే సమయంలో అక్కడికే వచ్చాడని చెబుతూ, ఆయన పాదపద్మాలను చూపించారు. ఆ పక్కనే ఉన్న లక్ష్మీనారాయణ మందిరాన్నీ వీక్షించి, సోమనాథకు తిరిగి బయలుదేరాం.
హరహర మహాదేవ శంభో శంకర!
ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొట్టమొదటిది సోమనాథ. ముక్కంటి సోమనాథునిగా వెలసిన కథ స్కాంద పురాణంలో ఉంది. బ్రహ్మదేవుని మానసపుత్రుడైన దక్షప్రజాపతికి అశ్విని నుంచి రేవతి వరకు 27 మంది కుమార్తెలున్నారు. తన కుమార్తెలను చంద్రునికి ఇచ్చి ఘనంగ వివాహం జరిపించాడు దక్షుడు. అయితే చంద్రుడు రోహిణిని మాత్రం అనురాగంతో చూస్తూ, మిగిలినవారిని అలక్ష్యం చేయసాగాడు. మిగిలినవారు తండ్రితో ఈ విషయాన్నీ మొరపెట్టుకోగా, దక్షుడు అల్లుడైన చంద్రుడిని మందలిస్తాడు. అయినప్పటికీ, చంద్రుని ప్రవర్తనలో మార్పురాకపోవడంతో, క్షయ రోగగ్రస్తుడవు కమ్మని చంద్రుని శపిస్తాడు దక్షుడు. ఫలితంగా చంద్రుడు క్షీణించసాగాడు. చంద్రకాంతి లేకపోవడంతో ఔషధాలు, పుష్పాలు ఫలించలేదు. ఈ పరిస్థితిని చూసిన సమస్త లోకవాసులు, తమ కష్టాలు తీరేమార్గం చూపమని బ్రహ్మ దేవుని ప్రార్థించారు. బ్రహ్మ ఆదేశాన్ననుసరించి ప్రభాస క్షేత్రంలో మహామృత్యుంజయ మంత్రానుష్ఠానంగా శంకరుని ఆరాధించిన చంద్రుడు, పార్థివలింగాన్ని ప్రతిష్టించి పూజించగా, శంకరుడు ప్రత్యక్షమై, చంద్రుని రోగ విముక్తుని గావించి, కృష్ణపక్షంలో చంద్రకళలు రోజు రోజుకీ తగ్గుతాయనీ, శుక్లపక్షంలో దిన మొక కళ చొప్పున పెరుగుతుందని అనుగ్రహించాడు. ఆనాటి నుండి చంద్రుని కోరిక మేర, అతని కీర్తి దశదిశలా వ్యాపించేందుకై చంద్రుని పేరుతో సోమనాథునిగా, జ్యోతిర్లింగరూపునిగా పార్వతీదేవిసమేతంగా వెలసి భక్తులను కరుణిస్తున్నాడని ఆ పురాణంలో పేర్కొన్నారు.
సోమనాథ మందిరానికి బలమైన చారిత్రక నేపథ్యం కూడా ఉంది. ఈ దేశంపై దండయాత్ర చేయడానికి వచ్చిన ఎంతోమంది పరాయి రాజులు, పాలకులు సోమనాథ దేవాలయాన్ని అనేక పర్యాయాలు ధ్వంసం చేశారు. దాడి జరిగిన కొద్ది రోజులకే తిరిగి స్థానికులు ఇక్కడి శివలింగాన్నిప్రతిష్ఠించుతూ వచ్చారు. అలా మొత్తం ఏడు సార్లు ఇక్కడ సోమనాథుడి విగ్రహం పునః ప్రతిష్ఠించబడింది. భారతదేశం స్వేచ్ఛావాయువులను పీల్చుకున్న తర్వాత జూనాఘఢ్ సంస్థానాన్ని విలీనం చేయించడానికి అక్కడకు వచ్చిన అప్పటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్, సోమనాథ మందిరాన్ని పునర్నించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. మందిర ప్రాంతంలో ఉన్న మసీదును కొంత దూరానికి తరలించారు. 1951లో మందిర పునర్నిర్మాణానికి భూమి పూజ చేసిన అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ ధ్వంసం కంటే పునర్నిర్మాణంలోని గొప్పతనానికి సోమనాథ దేవాలయం తార్కాణంగా నిలుస్తుందని చెప్పడం విశేషం. సర్థార్ వల్లభాయ్ పటేల్ మరణానంతరం మందిర నిర్మాణ బాధ్యతలను మరో కేంద్ర మంత్రి కె.ఎం. మున్షీ తన భుజస్కందాలపై వేసుకున్నారు. సుదీర్ఘ కాలం సాగిన ఈ మందిర పునర్నిర్మాణం 1995తో పూర్తయ్యింది. అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ సోమనాథ దేవాలయాన్ని జాతికి అంకితమిచ్చారు.
ప్రస్తుతం ఉన్న సోమనాథ మందిరానికి ఎడమవైపున రాణీ అహల్యాబాయి నిర్మించిన శివాలయం ఉంది. 1783లో ఆమె దీనిని నిర్మించారు. అక్కడ దర్శనం చేసుకుని, ఆ తర్వాత సోమనాధుడి దగ్గరకు వెళ్ళాలని స్థానికులు చెప్పడంతో అలానే చేశాం. సోమనాథ దేవాలయాన్ని వీక్షించడానికి రెండు కళ్లు సరిపోవంటే అతిశయోక్తి కాదు! సముద్రపు హోరు ఒకవైపు, ఆ సాగరుడిని కట్టడి చేస్తూ వేసిన పెద్దపెద్ద నల్లని రాళ్ళను తాకుతూ ఎగడిసడే అలల నుండి చిందే చిరుజల్లుల చల్లదనం మరోవైపు, ఆ ఆహ్లాదకర వాతావరణంలోహర హర మహాదేవఅంటూ మది గదుల్లో ప్రతిధ్వనించే శివనామస్మరణ ఇంకోవైపువీటన్నింటినీ ఆస్వాదిస్తూ, దేవాలయ ప్రధాన ద్వారంలోకి ప్రవేశించగానే సోమనాథుని దర్శన భాగ్యం కలిగింది. అయితే ఇక్కడ శివలింగాన్ని తాకడం, దానికి స్వయంగా అభిషేకం చేయడం కుదరని పని. కాస్తంత దూరం నుండే ఆ ముక్కంటికి నమస్కరించి వెనుదిరిగాం. దేవాలయానికి వెనకగా ఉన్న  అరేబియా సముద్ర తీరాన్ని చూస్తుంటే భారతదేశానికి ఇటు పక్క ఉన్న మా స్వగ్రామం మచిలీపట్నంలోని బంగాళాఖాతం గుర్తొచ్చింది. దేశంలోని తూర్పు తీరం నుండి పడమర తీరానికి వచ్చి ఇక్కడి సముద్రాన్ని వీక్షించడం థ్రిల్ గా అనిపించింది. సోమనాథుడి దర్శనానంతరం భోజనం కానిచ్చి, చుట్టుపక్కల ప్రాంతాల్లోని దర్శనీయ స్థలాలను చూసేందుకు బైలుదేరాం.
కృష్ణావతారం చాలించిన చోటు!
విరావల్ నుండి సోమనాథ దేవాలయానికి వచ్చే దారిలోనే ప్రభాస పట్టణం ఉంది. అక్కడే శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారాన్ని చాలించాడని స్థానికులు తెలిపారు. యాదవరాజుల మధ్య సాగిన అంతర్యుద్ధాల కారణంగా ఖిన్నుడైన శ్రీకృష్ణ పరమాత్మ ప్రభాస పట్టణం చేరుకున్నాడట. ఓ రోజు రావి చెట్టు నీడలో కాలు మీద కాలు వేసుకని యోగసమాథిలో పరుండగా, ఆయన కాలి బొటనవేలును చూసి, జంతువుగా భ్రమించిన జరా అనే వేటగాడు విల్లు ఎక్కుపెట్టి బాణం వేశాడట! ఆ తర్వాత తాను చేసిన పొరపాటు గ్రహించి, మన్నించమని శ్రీకృష్ణుడిని శరణు వేడుకోగాఇదంత తన ఇఛ్ఛాపూర్వకంగానే జరుగుతోందని, బాధపడవద్దని శ్రీకృష్ణుడు సెలవిచ్చి, అవతారం చాలించాడని పురాణాలు చెబుతున్నాయి. ప్రభాస పట్టణంలోని శ్రీ భాలకా తీర్థంలో పవళించిన శ్రీకృష్ణుని విగ్రహంతో పాటు శరాన్ని సంధించిన వేటగాడి ప్రతిమ కూడా ఉందిశ్రీకృష్ణుని విగ్రహం చెంతనే ఓ రావిచెట్టు ఉంది. దాని నీడలోనే వటపత్రశాయి పవళించాడని అక్కడి వారు చెప్పారు.  ఈ తీర్థస్థలి పక్కనే ప్రజాపిత ఈశ్వరీయ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయంకు చెందిన ఆర్ట్ గ్యాలరీని చూసిఆ రాత్రి సోమనాథుడి హారతి సేవకు హాజరయ్యాం.
మంగళవారం ఉదయానే అహల్యాబాయి నిర్మిత శివాలయంలో శివలింగానికి అభిషేకం చేసి, ఆ తర్వాత ముచ్చటగా మూడోసారి సోమనాథుడిని  దర్శనం చేసుకుని, ద్వారక దిశగా ప్రయాణం మొదలు పెట్టాం! ద్వారకకు రైలు మార్గం ఉన్నా, దారిలో పోర్ బందర్ లోని గాంధీజీ ఇంటిని చూడాలన్నది మా ఆలోచన. అందుకే  ప్రైవేటు వాహనంలో బైలు దేరాం. సోమనాథ నుండి ద్వారక వెళ్ళే రోడ్డు మార్గం సముద్రపు ఒడ్డునే సాగుతుంది. దారిపొడుగునా ఉన్న విండ్ మిల్స్ ను చూస్తేగుజరాత్ లో విద్యుత్ కొరత ఎందుకు లేదో అర్థమైంది. మార్గం మధ్యలో అవకాశం ఉన్న చోటల్లా సముద్ర తీరంలో కాసేపు ఆటలాడి తిరిగి ప్రయాణం కొనసాగించాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత దీరుభాయ్ అంబాయ్ స్వస్థలం చోర్వాద్ మీదుగా మా ప్రయాణం సాగింది. మధ్యాహ్యం రెండు గంటల ప్రాంతంలో పోర్ బందర్ లోకి మా వాహనం అడుగుపెట్టింది.
గాంధీ మహాత్ముడు పుట్టిన ఇంటిలోకి అడుగుపెడుతుంటే ఒడలు పులకరించాయి. గుజరాత్ లోని మారు మూల పల్లెలో పుట్టిన ఓ వ్యక్తియావత్ భారత జాతినీ మేల్కొలపడం అంటే మాటలా! అదీ అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాల ద్వారా! ఆ ఘనకార్యాన్ని నిర్వర్తించిన వ్యక్తిగా ప్రతి ఒక్కరికీ గాంధీజీపై అపరిమిత గౌరవం ఉండటం సహజం. అందుకే ఆయన జన్మించిన ఇల్లు ఇవాళ దర్శనీయ స్థలంగా మారింది. భారతదేశంలోని కొన్ని లక్షల గ్రామాలలో, మరుమూల పల్లెల్లో గాంధీజీ విగ్రహం ఉందంటే అతిశయోక్తి కాదు. ఆయన ఇంటి వీధి మొదట్లో ఉన్న గాంధీజీ విగ్రహం మమ్మల్ని ఎంతో ఆకట్టుకుంది.
నిజానికి పూర్వకాలంలో పోర్ బందర్ ను సుధామపురి అని పిలిచేవాళ్ళు. శ్రీకృష్ణుడి స్నేహితుడు సుధాముడు పుట్టిన ఊరు ఇదేగాంధీజీ ఇంటికి కొద్ది దూరంలోనే సుధాముడి స్మృతి మందిరం ఉంది. 12, 13వ శతాబ్దంలో చిన్నగా ఉన్న ఈ మందిరాన్ని 1900 సంవత్సరంలో పోర్ బందర్ కు చెందిన మహారాజా భావసింహజీ పునర్ నిర్మించారు. ఇదే ప్రాంగణంలో చాముండి మాత కొలువై ఉంది. ఆ తల్లిని దర్శించుకుని ద్వారకకు బయలుదేరాం.
అదిగో ద్వారక
శ్రీకృష్ణుని పాదస్మర్శతో పునీతమైన భూమి ద్వారక. జరాసంధుడి బారినుండి యాదవులను రక్షించడం కోసం శ్రీకృష్ణుడు ఈ నగరాన్ని నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించిన తర్వాత ద్వారక సముద్రంలో మునిగిపోయిందంటారు. సూర్యాస్తమయానికి కాస్తంత ముందుగా ఆ నగరానికి మేం చేరుకున్నాం. హోటల్లో కాలకృత్యాలు తీర్చుకుని, ద్వాదశ జ్యోతిలింగాలలో ఆరవది అయిన నాగేశ్వర క్షేత్రానికి బయలుదేరాం. ద్వారక కు సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో అది ఉంది. ఈ క్షేత్రం గురించి పురాణాలలో ఇలా చెప్పబడింది. పశ్చిమ సముద్ర తీరాన, దారుకుడనే రాక్షసుడు, తన భార్య దారుకతో కలిసి ప్రజలను చిత్రహింసలకు గురిచేశాడట. యజ్ఞయాగాదులను నాశనం చేస్తూ, ముని జనులను హింసించాడట. వీరి హింసను తట్టుకోలేని ఋషులు ఔర్వమహర్షికి విన్న వించుకున్నారట. ఔర్వమహర్షి ఆ రాక్షస దంపతులను సతీసమేతంగా మరణించునట్లుగా శపించాడు. ఆ మునిశాపం భూమి పైనే పనిచేస్తుంది. కనుక, రాక్షదంపతులు సముద్రమధ్యంలో నివాసమేర్పరుచుకుని సముద్రయానం చేసేవారిని పీడించసాగారు. ఇలా కనబడిన ప్రయాణీకులందరి ధనవస్తువులను అపహరిస్తూ చెరసాలలో బంధించసాగారు. అలా బంధింపబడినవారిలో సుప్రియుడొకడు. ఇతడు పరమ శివభక్తుడు. రాక్షసబాధలను తట్టుకోలేక సుప్రియుడు ఆర్తనాదం చేయగా, దివ్యతేజః పుంజం కళ్ళు మిరిమిట్లు గొలుపుతూ ప్రకాశించింది. ఆ కాంతికి దారుకునితో పాటు సమస్త రాక్షసులు నేలకొరిగారు. అక్కడ పరమశివుడు నాగరూపమై జ్యోతిర్లింగమైవెలిశాడు. ఈ స్వామిని దర్శించి, సేవించుకున్నవారికి శాశ్వత పుణ్యలోకవాసం సిద్ధిస్తుందని ప్రతీతి. ఈ నాగేశ్వర జ్యోతిలింగ క్షేత్రం పక్కనే నలభై అడుగుల ఎత్తైన సింహ పీఠంపై 85 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహం ఉంది. ప్రసన్న వదనుడైన ఆ శివుడి విగ్రహం చుట్టూ ఓంనమః శివాయ అంటూ ఐదు సార్లు ప్రదక్షిణ చేస్తేఅనుకున్న కోరికలు నెరవేరతాయని స్థానికులు తెలిపారు.
నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనానంతరంఅక్కడికి సమీపంలోని రుక్మిణీ మందిరానికి వెళ్ళాం. ఆ మందిరంలోనే ఓ పక్కన రామనామం రాసిన రాయి నీటిలో తేలుతూ కనిపించింది. ఆ చెంతనే గోపీ తలాబ్ ఉంది. అక్కడే కృష్ణుడు గోపికలతో జలక్రీడలాడాడని అక్కడి వారు చెప్పారు. అక్కడి నుండి తిరిగి ద్వారక చేరుకున్నాకకాస్తంత సమయం ఉండటంతో శ్రీకృష్ణ దర్శనానికీ వెళ్ళాం. అయితే మందిరంలో కృష్ణుడు పక్కన రుక్మిణీమాత లేకపోవడం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అలానే పట్టపు రాణుల భవంతిలోనూ రుక్మిణి విగ్రహం కనిపించలేదు. దానికి కారణం ఏమిటనేది ఆ మర్నాడు కానీ మాకు తెలియలేదు!
బుధవారం ఉదయాన్నే మా ద్వారక నగర పర్యటన రుక్మిణీదేవి మందిర దర్శనంతో మొదలైంది. ఆ మందిరానికీ ఓ కథ ఉంది. ఓసారి కృష్ణుడు దుర్వాస మహామునిని ఆతిథ్యం స్వీకరించమని ఇంటికి పిలిచాడట. అతిథి భోజనం పూర్తయ్యే వరకూ ఆ ఇంటిలో మరెవ్వరూ ఏమీ ముట్టడానికి వీల్లేదన్నది అప్పటి నియమం. అయితే దుర్వాసుడు భోజనం చేస్తున్న సమయంలో రుక్మిణికి దాహం వేసి, కృష్ణుడిని నీళ్ళు ఇవ్వమని అర్థించిందట. దుర్వాసుడు చూడటం లేదనే నమ్మకంతో కృష్ణుడు కాలి బొటనవేలుని నేలపై నొక్కి పెట్టి పాతాళ గంగను పైకి తీసుకొచ్చి రుక్మిణి దాహం తీర్చాడట. దానిని చూసిన దుర్వాస మహాముని, రుక్మిణి మీద కోపంతో భార్యభర్తలిద్దరూ పన్నెండు సంవత్సరాల పాటు వేరువేరుగా ఉండాలని శపించాడట. అందుకే ద్వారకలోని ప్రధాన దేవాలయంలో కృష్ణుడి పక్కన రుక్మిణి దేవి ఉండదని, అలానే రుక్మిణి దేవి మందిరంలో కృష్ణుడు కనిపించడని అక్కడి పూజారి చెబుతుంటే విన్నాం.
అక్కడి నుండి బెట్ ద్వారకకు బయలుదేరాం. ద్వారకకు 30 కి.మీ. దూరంలో ఉన్న ఓఖా నుండి బోటులో బెట్ ద్వారకకు వెళ్ళాల్సి ఉంటుంది. ద్వీపంలో ఉండే శ్రీకృష్ణుని దేవాలయ దర్శనం కూడా ఎంతో పవిత్రమైనదిగా అక్కడి ప్రజలు భావిస్తారు. దాదాపు వందమందిని ఎక్కించుకుని ఓఖా నుండి బెట్ ద్వారకకు మా బోటు బయలుదేరింది. ఆ ద్వీపంలో కాస్తంత ఎత్తుమీద కృష్ణ మందిరం ఉంది. అందులోని కృష్ణుడి విగ్రహాన్ని రుక్మిణీదేవి వియోగ సమయంలో స్వయంగా ఇసుకతో చేసిందటబెట్ ద్వారకలోని కృష్ణమందిరం బయట పోలీసులు పహార కాయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. సహజ ఓడరేవు కూడా అయిన బెట్ ద్వారక చారిత్రకంగానూ ప్రధానమైనది. బహుశా అందుకే అక్కడ అంత కట్టుదిట్టమైన పోలీస్ పోస్ట్ ను ఏర్పాటు చేశారనిపించింది. బెట్ ద్వారకలోని దేవాలయ సముదాయాన్ని వీక్షించి, అక్కడ నుండి తిరిగి ద్వారకకు నాగేశ్వరం మీదుగా బయలుదేరాం. మేం అక్కడకు చేరేసరికీ హారతి కార్యక్రమం జరుగుతోంది. అది పూర్తికాగానే స్వయంగా నాగేశ్వరుడికి అభిషేకం చేసే అవకాశం మాకు కలిగింది. సోమనాథ క్షేత్రంలో తీరని కోరిక ఇక్కడ ఇలా నెరవేరడంతో మా బావగారి ఆనందానికి అవధులు లేవు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లోని మరోదానికి ఆయన స్వయంగా అభిషేకం చేయడంతో ఈ యాత్ర సఫలీకృతమైందిగా భావించారు. అక్కడ నుండి ద్వారకకు తిరుగుప్రయాణమయ్యాం.
ఆ సాయంత్రం భారతదేశానికి పశ్చిమాన సముద్రంలోకి జారిపోయే సూర్యగోళాన్ని కళ్ళారా చూడాలనే కోరిక మాకు కలిగింది. సాయంత్రం ఐదు గంటలకు సన్ సెట్ పాయింట్ కు వెళ్ళాం. అక్కడి పురాతన మందిరంలోని శివుడికి నమస్కరించి, సముద్ర తీరం వైపు దృష్టి సారించాం. సముద్ర మట్టానికి దాదాపు రెండు వంద అడుగుల ఎత్తులో ఉన్న మా మీదకు అలలు విరుచుకుపడుతుంటేఓ క్షణం భయం వేసింది. మందిరానికి అడ్డుగా వేసిన రాళ్ళను ఢీ కొడుతూ అలలు అంతెత్తున ఎగసి పడుతూమమ్మల్ని తడిపేస్తుంటే హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన దురదృష్టకర సంఘటన జ్ఞప్తికి వచ్చింది. ప్రకృతికి ఎదురీది మనిషి ఏమీ చేయలేడని, దానితో పాటు సహజీవనం చేయాల్సిందేననే విషయం బోధపడింది. అదే రోజు రాత్రి ద్వారక నుండి రోడ్డు మార్గంలో బయలు దేరి, గురువారం ఉదయానికి రాజ్ కోట్ చేరాం. అక్కడ నుండి ఉదయం ఐదు గంటలకు బయలుదేరిన రాజ్ కోట్- సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ లో మాకు రిజర్వేషన్ జరిగింది. శుక్రవారం ఉదయం పదిగంటలకు సికింద్రాబాద్ కు చేరుకోవడంతో ద్వాదశ జ్యోతిర్లింగాల్లోని మరో రెండు పుణ్య క్షేత్రాల దర్శనం పూర్తయినట్టయింది! ఇరవై నాలుగు గంటలపాటు సాగిన తిరుగు రైలు ప్రయాణంలో గడిచిన నాలుగు రోజుల యాత్రావిశేషాలను తలుచుకుంటూ, ప్రయాణ బడలికనూ తీర్చేసుకున్నాం. ఆ రకంగా గాంధీ నడయాడిన పుణ్యభూమి మీదుగా ద్వాదశ జ్యోతిర్లింగాల్లోని రెండింటిని దర్శించుకున్నాం.
                                                      ...........
          సోమనాథ దేవాలయం... ఎదురుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ నిలువెత్తు విగ్రహం

                             అహ్మదాబాద్ లోని సబర్మతీ ఆశ్రమ ముఖద్వారం

     సోమనాథ దేవాలయం నుండి త్రివేణీ సంగమానికి వెళ్ళే దారిలో ఎదురైన జాతీయ పక్షి! 
  
                  త్రివేణీ సంగమ స్థలికి సమీపంలోని బలరామ అంతర్థాన స్థలం

               త్రివేణీ సంగమ స్థలిలో మా చినబావ బాలసుబ్రహ్మణ్యం ఆనంద హేల!

                    సబర్మతీ ఆశ్రమంలో గాంధీ విగ్రహం చెంతన మా చిరంజీవులు

           సోమనాథ పక్కనే ఉన్న అహల్యాబాయి నిర్మిత దేవాలయంలోని శివలింగం

                       పోర్ బందర్ లోని మహాత్మ గాంధీ ఇంటి ముఖద్వార చిత్రం

                     నా శ్రీమతి మాధవితో గాంధీజీ పుస్తక పఠన మందిరంలో....

                                ద్వారక సమీపంలోని నాగేశ్వర జ్యోతిర్లింగం

                      నాగేశ్వర జ్యోతిర్లింగం పక్కనే ఉన్న మహా శివుని భారీ విగ్రహం

                  గుజరాతీ ప్రయాణీకుల ఆటోని డ్రైవ్ చేస్తున్న చిరంజీవి కార్తికేయ

                             ద్వారక సమీపంలోని రుక్మిణీమాత మందిరం

                                మర పడవలో బెట్ ద్వారకకు వెళుతూ....

                      ప్రభాస పట్టణంలోని నిర్యాణ స్థలంలో శ్రీకృష్ణుడి విగ్రహం

                ద్వారకలోని సన్ సెట్ పాయింట్ దగ్గర అరేబియా సముద్ర తీరంలో....


                                   ద్వారకలోని శ్రీకృష్ణ మందిరం



-      వడ్డి ఓంప్రకాశ్ నారాయణ

No comments:

Post a Comment