Tuesday, October 27, 2015


శ్రీ మాడా గారితో అనుబంధం!

విశేషం ఏమంటే… మాడా వెంకటేశ్వరరావు నటించిన ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’ సినిమాను నేను చూడలేదు. అయితే… అందులోని ‘చూడు సినమ్మా… పాడు పిల్లాడు’ పాట మాత్రం నాకు కంఠతా వచ్చేసింది. టేప్ రికార్డర్లు (మధ్యతరగతి కుటుంబాల్లోకి) కొత్తగా వస్తున్న ఆ సమయంలో మా లక్ష్మీ వదిన వాళ్ళ ఇంట్లో ఆ పాట విన్నాను. బాలుగారి పెక్యులర్ వాయిస్ నన్ను ఆకట్టుకుంది. అంతే విపరీతంగా ప్రాక్టీస్ చేసేశాను. ఆ తర్వాత ఎన్నిసార్లో ఎంత మాత్రం సిగ్గు పడకుండా ఆ పాట చాలామంది ముందు పాడేశాను. ఇక ‘ముత్యాల ముగ్గు’లోని రావు గోపాలరావు గారి ఇంట్రడక్షన్ సీన్ను… మాడా గారి డైలాగ్ తో సహా ప్రాక్టీస్ చేసేయడం మరో తీయని అనుభూతి!
ఫిల్మ్ రిపోర్టర్ గా నేను బాధ్యతలు స్వీకరించేసరికీ మాడా గారు నటనకు దూరమై పోయారు. అయితే… ఏదైనా సినిమా ఫంక్షన్లలో కలిసినప్పుడు మాత్రం ఆయనతో చనువుగా మాట్లాడుతుండే వాడిని. రెండేళ్ళ క్రితం సికింద్రాబాద్ లో డాక్టర్ గురునాథ్ గారి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన తన కుమార్తెను వెంట పెట్టుకుని వచ్చారు. ఆరోగ్యపరమైన సమస్యల గురించి కాసేపు మాట్లాడారు. అదే ఆయనతో చివరి మాటామంతీ.
బాధాకరం ఏమంటే… పక్షం రోజుల క్రితం ఆయన చనిపోయారనే రాంగ్ న్యూస్ ను నిజమేనని నమ్మి.. ఫోన్ ఇన్ లో ఆయన గురించి వివరించాను. కానీ మరి నిమిషమే ఆయన జీవించే ఉన్నారని తెలిసింది! తెలియక చేసిన తప్పుకు ఎంతగా కుమిలిపోయానో… ఆయన బ్రతికే ఉన్నందుకు అంతగా ఆనందించాను. కానీ… నిన్న రాత్రి ఆయన మరణానికి సంబంధించిన విషాద వార్త వినక తప్పింది కాదు.
ఆడ… మగ కాని వారికి ‘మాడా’ అనే ఓ పదాన్ని అందించిన గొప్ప నటుడు శ్రీ మాడా వెంకటేశ్వరరావు.
ఇంతకంటే ఆయన జన్మకు సార్థకత ఏముంటుంది!!

No comments:

Post a Comment