Saturday, November 16, 2019

బందరులో శక్తిపటాలు (ప్రయాణం) సంచిక వెబ్ మేగజైన్ లో...

బందరులో శక్తి పటాలు!

పండగ సమయాల్లో సొంత వూరు వెళ్ళకూడదనే నియమాన్ని చాలా యేళ్ళ క్రితమే పెట్టేసుకున్నాను. దాంతో సంక్రాంతి, ఉగాది, వినాయక చవితి, దసరా, దీపావళి... ఇలా అన్ని పండగలు హైదరాబాద్‌లోనే జరుపుకోవడం అలవాటైపోయింది. కానీ ఈ యేడాది తప్పనిసరి పరిస్థితులలో మా సొంతూరు బందరు (మచిలీపట్నం) వెళ్ళాల్సి వచ్చింది. కొందరితో చేసే స్నేహం మనకు భలే ఉపయోగపడుతుంది. అలా ఓ రైల్వే ఉన్నతాధికారితో నాకున్న బీరకాయ పీచు బంధుత్వంతో పాటు ఏర్పడిన గాఢమైన మైత్రి కారణంగా ఎంచక్కా రైల్లో ఎమర్జెన్సీ కోటా కింద టిక్కెట్ కన్ఫర్మ్ చేసుకుని దసరా పండగకు బందరు చేరగలిగాను!

చిత్రమేమంటే... మా ఊళ్ళో ఉండే చాలా పురాతన, ప్రత్యేక దేవాలయాల గురించి నాకు తెలియనే తెలియదు. ఆ మధ్య నా కొలీగ్ ప్రదీప్ 'మీ బందరులో హయగ్రీవాలయం ఉంది తెలుసా?' అని ప్రశ్నిస్తే తెల్లబోయాను. ఆ తర్వాత ఊరెళ్ళినప్పుడు మా తమ్ముడు జితేంద్రను అడిగి తెలుసుకుని, బచ్చుపేట వెంకటేశ్వర స్వామి గుడిపక్కనే ఉన్న హయగ్రీవ కోవెలకు వెళ్ళి స్వామిని దర్శించుకున్నాను. అలానే ఈ దసరాకు నేను బందరు వెళ్ళినప్పుడూ ఓ కొత్త అనుభూతిని పొందాను. అదే శక్తిపటాల ఊరేగింపు!

నా చిన్నతనంలోనూ శక్తిపటాల ఊరేగింపు దసరా రోజుల్లో జరిగేది కానీ మరీ ఇంత ఉదృతంగా కాదు. రెండు మూడు శక్తిపటాలు మాత్రమే కనిపించేవి. అవీ ఒకటి రెండు పేటలకు మాత్రమే పరిమితం అయ్యేవి. కానీ ఇప్పుడు అవి వంద సంఖ్యకు పెరిగాయనిపించింది. అంతేకాదు... బందరులోని ప్రధాన పేటలన్నింటిలోనూ కుర్రాళ్లు శక్తి పటాలను ఎత్తుకుంటున్నారు. దసరా పండగ రోజుల్లో మనిషికి శక్తివేషం వేస్తారు.  ఐదారు అడుగు ఎత్తులో వెదురు కర్రలతో శక్తి పటాన్ని తయారు చేస్తారు. ఓ వైపు కాళీమాతను, మరో వైపు ఆంజనేయ స్వామి బొమ్మను రంగులతో గీస్తారు. దీనిని కుర్రాళ్ళు వీపుకు కట్టుకుంటారు. అలానే ముఖానికి కాళీ మాత బొమ్మను తగిలించుకుంటారు. ఓ చేతిలో శక్తిపటం తాలూకు తాడును, మరో చేతిలో కత్తిని పట్టుకుంటారు. వీరి ముందు ఉండే బృందం కొట్టే డప్పుల శబ్దానికి తగ్గట్టుగా, లయబద్దంగా శక్తి పటాన్ని ఎత్తకున్న యువకుడు ఆడుతూ ఉంటాడు. ముఖమంతా అమ్మవారి ప్రతిమతో మూసుకోవడంతో ఊపిరి అందడం కొంత కష్టమే. అందుకే ఓ సహాయకుడు పక్కనే ఉండి, విసనకర్రతో విసురుతూ ఉంటాడు. అలసి, సొలసినప్పుడు కాసేపు సేద తీర్చుకుంటూ, ప్రతి గడప దగ్గర ఆగుతూ ఈ ఊరేగింపును ఈ బృందం కొనసాగిస్తుంటుంది. ఉదయానే అమ్మవారిని పూజించి, ఉపవాసంతో మొదలయ్యే ఈ ఊరేగింపు తంతు... ప్రధాన కూడళ్ళను చుట్టి, సాయంత్రంకు తిరిగి గుడిని చేరడంతో ముగుస్తుంది. శక్తి పటాలు ఎత్తుకునే వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు సైతం అతనితో పాటు ఈ ఊరేగింపులో పాల్గొంటారు. ఇలా భక్తి శ్రద్ధలతో చేసే ఈ ఊరేగింపుతో కోరిన కోరికలు తీరతాయని వారి నమ్మకం.

అసలీ సంప్రదాయం ఎలా మొదలైందని మా తమ్ముడిని అడిగితే ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. ''శతాబ్దానికి ముందే ఇది మొదలైందట. కలకత్తా నుండీ వచ్చిన బుద్దా సింగ్ అనే ఆయన... అక్కడ జరిగే శక్తి పటాల ఊరేగింపుకు ప్రభావితుడై... ఇక్కడ కూడా ఆ సంప్రదాయం మొదలెట్టాడట. ఈడేపల్లిలోని ఓ చిన్న గుడిసెలో కాళికామాత చిత్రాన్ని పెట్టుకుని ఆరాధించేవాడట. శరన్నవరాత్రుల సమయంలో శక్తి పటాన్ని స్వయంగా తయారు చేసుకుని, ఆరేడు వీధుల్లో తిరిగే వాడట. అతను మొదలు పెట్టిన ఆ సంప్రదాయాన్ని ఆ తర్వాత అతని వారసులూ కొనసాగించారట. అప్పుడు ఏర్పడిన ఈడేపల్లిలోని చిన్న శక్తి గుడి ఇప్పుడు పెద్దదిగా రూపొందింది" అని చెప్పాడు.
ఈ వందేళ్ళ కాలక్రమంలో ఈ శక్తిపటాల ఊరేగింపు అనేది బందరులోని అన్ని వాడలకూ వ్యాపించేసిందట. చిత్రం ఏమంటే... కలకత్తా తర్వాత ఆ స్థాయిలో శక్తిపటాల ఊరేగింపు జరిగేది బందులోనే అని తమ్ముడు చెబుతుంటే ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టాను.

దసరా తొమ్మిది రోజులు జరిగే ఊరేగింపులు ఓ ఎత్తు అయితే... విజయదశమి రోజు రాత్రి అన్ని వాడల శక్తి పటాలు బందరు పట్టణ ప్రధాన కూడలి అయిన కోనేరు సెంటర్ కు వచ్చి అక్కడో జాతరను తలపింపచేయడం మరో ఎత్తు! ఊరిలోని అన్ని ప్రాంతాల శక్తి పటాలను చూడటానికి ఆ రోజు రాత్రి బందరు వాసులంతా... కోనేరు సెంటర్ కు చేరుకుంటారు. గతంలో రాత్రి రెండు గంటల వరకూ ఈ జాతర సాగుతుండేది. కానీ ఇప్పుడది ఏకంగా తెల్లవారు ఝాము వరకూ కొనసాగుతోంది. నేను విజయదశమి మర్నాడు పొద్దునే కోనేరు సెంటర్ కు
తమ్ముడితో కలిసి వెళ్ళేసరికీ పది పన్నెండు శక్తి పటాలు అక్కడ అప్పటికీ ఉన్నాయి. పోలీసులు వాళ్ళకు నచ్చచెప్పి... వారి వారి ప్రాంతాలకు పంపే పనిలో బిజీగా ఉన్నారు. రాత్రంతా జాగారం చేసిన జనాలు సైతం చుట్టూ ఉన్న భవంతుల పై నుండీ ఈ శక్తి పటాలను చూస్తూనే ఉన్నారు. మనుషులు యాంత్రికంగా తయారైపోయి... ఎవరి గూటిలో వారు గడిపేస్తున్నారని మనం అనుకుంటున్నాం కానీ సామూహిక సంబరాలు, ఇలాంటి సంప్రదాయాలు ఇంకా చాలా చోట్ల కొనసాగుతూనే ఉన్నాయి.

అయితే బాధకరమైన విషయం ఏమంటే... ఇలాంటి జాతరలలో క్రమశిక్షణ మృగ్యమవుతోంది. భక్తి ముసుగులో కొందరు తాగుడు లాంటి వ్యసనాలకు బానిస అవుతున్నారు. ముఖ్యంగా కుర్రకారుకు ఇలాంటి కార్యక్రమాలతో ఓ లైసెన్స్ ఇచ్చినట్టుగా అయిపోతోంది. శక్తి పటం వెనుక పగలంతా తిరగడం, నృత్యం చేయడం అంత తేలికైన విషయం కాదు! సో  ఆ కష్టం తెలియకుండా ఉండాలంటే... చుక్క పడాల్సిందే! అన్నట్టుగా కొందరు వ్యవహరిస్తున్నారు. దీనిని అదుపు చేయకపోతే మాత్రం... యువతరాన్ని మనం తెలిసి తెలిసి చెడగొట్టినట్టే అవుతుంది!
మనిషి సన్మార్గంలో సాగడానికి భక్తి ఉపయోగపడాలి కానీ... వ్యసనాలకు బానిస కావడానికి కాదనే విషయాన్ని ఎవరో ఒకరు వారికి తెలియచెప్పాల్సి ఉంది!

- వడ్డి ఓంప్రకాశ్‌ నారాయణ








https://sanchika.com/bandarulo-shakti-pataalu/

No comments:

Post a Comment