Sunday, November 23, 2014

'Naa Bangarutalli' movie review


'ఇన్ ద నేమ్ ఆఫ్ బుద్ధా' సినిమాతో అంతర్జాతీయంగా దర్శకుడు రాజేశ్ టచ్ రివర్ కు మంచి గుర్తింపు లభించింది. ప్రజ్వల సంస్థ నిర్వాహకురాలిగా సునీత కృష్ణన్ కు చక్కని గౌరవం ఉంది. వీరిద్దరు కలిసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన సినిమా 'నా బంగారుతల్లి'! ప్రేక్షకుల ముందుకు రావడానికంటే ముందే ఈ సినిమాకు జాతీయ స్థాయిలో మూడు అవార్డులు వచ్చాయి. అలానే అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలోనూ ప్రశంసలు లభించాయి. ఆడియో రిలీజ్ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొనడం, నాగార్జున సతీమణి అమల సినిమా విడుదలకు సహకరించడం, సునీతా కృష్ణన్ కోరిక మేరకు వందలాది మంది స్వచ్ఛందంగా విరాళాలను అందించడంతో 'ఖచ్చితంగా ఇది మంచి సినిమా' అనే భావన చాలామందిలో కలిగింది! 

కథ లోకి వెళితే... దుర్గా (అంజలీ పాటిల్) బ్రిలియంట్ స్టూడెంట్. ఇంటర్ లో స్కూల్ ఫస్ట్ రావడమే కాదు... ఆ జిల్లాలోనే ఎయిత్ ర్యాంక్ సంపాదించుకుంటుంది. అయితే ఆ క్రెడిట్ మొత్తం తన తండ్రి శ్రీనివాసన్ (సిద్ధిక్) కే దక్కుతుందని, తనతో పాటు ఆయన్నీ సత్కరించమని స్కూల్ యాజమాన్యాన్ని కోరుతుంది. తమ ఊరిలో కాకుండా హైదరాబాద్ వెళ్ళి డిగ్రీ చదవాలన్నది దుర్గ కోరిక. కానీ తండ్రి మాత్రం తమని వదిలి దూరంగా ఉండొద్దని చెబుతుంటాడు. తన కళ్ళముందు ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా సహించలేని మనస్తత్వం దుర్గది.  తండ్రి తరహాలోనే ఈ అమ్మాయి కూడా సమాజాన్ని ఉద్ధరిస్తోందంటూ ఊరి వాళ్ళు ఎగతాళి చేస్తుంటారు. అయినా... ఆ మాటలను పట్టించుకోకుండా తన దారిన తాను ముందుకు పోతూ ఉంటుంది దుర్గా. తన స్నేహితురాలి పెళ్ళిలోనే దుర్గ మనసుకు నచ్చని వ్యక్తి తారసపడతాడు. పెద్దల అంగీకారంతో విజయ్ ( రత్న శేఖర్)తో నిశ్చితార్థం కూడా జరుగుతుంది. అదే సమయంలో హైదరాబాద్ లో డిగ్రీ చదవడానికి దుర్గకు అవకాశం లభిస్తుంది. తండ్రి అప్పటికే హైదరాబాద్ లో ఉండటంతో... తల్లిని ఒప్పించి... సిటీకి ఒంటరిగా బయలుదేరుతుంది. అయితే... సిటీ చేరిన దుర్గ జీవితంలో ఎలాంటి దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి, ఈ చదువుల తల్లి ఎలాంటి ఇబ్బందుల్ని, అనూహ్య సంఘటనలను ఎదుర్కొందన్నది మిగతా కథ!

హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు చాలా తక్కువనే చెప్పాలి. ఆ కోవకే చెందిన కమల్ హాసన్ 'మహానది' చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయి ఉంది. ఈ సినిమా మొదలు కాగానే... 'మహానది'లా ఉందే అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ సమయానికి కథ ఊహించని మలుపు తిరిగి ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేస్తుంది. అలానే క్లయిమాక్స్ కూడా చాలా అర్థవంతంగానూ... సహజంగానూ ఉంది! ఇలాంటి కథలను తెరకెక్కించడానికి కేవలం డబ్బులు ఉంటే సరిపోదు... మంచి మనసు, గట్టి పట్టుదల ఉండాలి. అవి రెండూ తమకు ఉన్నాయని రాజేశ్ టచ్ రివర్, సునీత కృష్ణన్ నిరూపించుకున్నారు. కథనంలో కొన్ని లోపాలు ఉన్నా... ఎంపిక చేసుకున్న కథ... నటీనటుల అభినయం మనల్ని సినిమాలో లీనమయ్యేట్టు చేస్తాయి. ముఖ్యంగా దుర్గ పాత్రను అంజలీపాటిల్ అద్భుతంగా పోషించింది. జాతీయ అవార్డుల కమిటీ అందుకే ఆమెకు ప్రత్యేక పురస్కారం అందించిందనిపిస్తుంది. అలానే ఆమె తండ్రి పాత్ర పోషించిన సిద్ధిక్ కూడా తన నటనతో మెప్పించాడు. నేపథ్య సంగీతానికి జాతీయ అవార్డును అందుకున్న శాంతను మోయిత్రా గురించీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే! పాటల్లోని సాహిత్యం కూడా అర్థవంతంగా ఉంది. పేరుకు ఇది తెలుగు సినిమానే, చిత్రీకరణ కూడా అత్యధిక భాగం హైదరాబాద్ లోనే జరిగింది, అయినా... పరిచయం ఉన్న ముఖాలు రెండు మూడు కూడా లేకపోవడం ఈ సినిమాకు సంబంధించిన ప్రధానమైన మైనస్! అంజలీ పాటిల్ వంటి నటి తెలుగులో దొరక్కపోవచ్చు... కానీ మిగిలిన పాత్రలకైనా ఇక్కడి వారిని తీసుకుని ఉంటే... మరింతగా తెలుగు ప్రేక్షకులలోకి 'నా బంగారు తల్లి' చొచ్చుకుని పోయి ఉండేది! అలా చేయకపోవడం వల్ల డబ్బింగ్ సినిమానేమో అనే భావన ప్రేక్షకులకు కలుగుతోంది! ఏదేమైనా రాజేశ్ టచ్ రివర్, సునీతా కృష్ణన్ కృషిని, పట్టుదలను అభినందించాలి!

No comments:

Post a Comment