Sunday, November 23, 2014

'Rowdy Fellow' movie review


ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. ఆ రకంగా నారా రోహిత్ కు మొదటి సినిమా 'బాణం' జంటిల్ మ్యాన్ ఇమేజ్ ను ఇచ్చింది. దాంతో అతని సినిమాల్లో ఏదో ఒక సందేశం ఉంటుందని ఆడియెన్స్ ఫిక్స్ అయిపోయారు. 'సోలో'తో హిట్ కొట్టిన ఈ నారా వారి కుర్రాడికి ఆ తర్వాత కాస్తంత పేరు తెచ్చిపెట్టిన సినిమా 'ప్రతినిధి'! పాత ఇమేజ్ ను చెరిపేసుకుంటూ... టఫ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయాలనుకున్నాడు నారా రోహిత్! గీత రచయిత కృష్ణ చైతన్యను దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రకాశ్ రెడ్డి ఈ సినిమా నిర్మించారు!

కథ విషయానికి వస్తే... మూడేళ్ళ క్రితం విదేశాలకు వెళ్ళి కోట్లు సంపాదించి... ఇండియాకు తిరిగొస్తాడు రానా ప్రతాప్ జయదేవ్ (నారా రోహిత్). ఇగోకి బానిస అయిన ఈ కుర్రాడికి ఊహించని విధంగా ఎస్.పి. (ఆహుతి ప్రసాద్) తో గొడవౌతుంది. తన కాలర్ పట్టుకున్న ఆ ఎస్.పి. కి బుద్ధి చెప్పాలని... యాభై లక్షలు లంచం ఇచ్చి... ఎస్.ఐ. పోస్ట్ ను కొనేస్తాడు. అనుకోకుండా పక్క జిల్లాలో పోస్టింగ్ వచ్చిందని తెలిసి... అక్కడ అల్లరి చేసి... పశ్చిమ గోదావరిలో పోస్టింగ్ వేయించుకుంటాడు. ఆ పనిలోనే ఎస్.పి. కూతురు మేఘ (విశాఖ సింగ్) కు లైన్ వేస్తాడీ ఇగోయిస్టిక్ పోలీస్ ఆఫీసర్! అయితే... కాబోయే మామగారు కాబట్టి ఎస్.పి.తో వైరాన్ని వదులుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో అతనికి అసురగణం దుర్గా ప్రసాద్ (రావు రమేశ్)తో ఇగో ప్రాబ్లమ్ తలెత్తుతుంది. అంతే... ముందుగా ఈ పార్లమెంటేరియన్ పని పట్టాలనే నిర్ణయానికి వస్తాడు. కేంద్ర మంత్రి పదవి చేజారిపోయిందనే అక్కసుతో ఉన్న దుర్గాప్రసాద్ కు, కొల్లేరు ప్రాంతాన్ని  కాపాడాలనుకున్న రానా ప్రతాప్ జయదేవ్ కు మధ్య ఎలాంటి పోరు జరిగిందన్నదే మిగతా సినిమా!

ప్రకృతిని దోచుకోవాలని చూసిన పొలిటీషియన్లను, మీడియా ఎండగట్టడం మామూలే! అటువంటి వాళ్ళ అడ్రస్ గల్లంతు చేసిన కథలతోనూ, రివేంజ్ డ్రామా బ్యాక్ డ్రాప్ తోనూ గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. అయితే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కంటే... ఇగోయిస్టిక్ పర్సన్ గా విలన్స్ తో గొడవకు దిగే క్యారెక్టర్ ను తెర మీద చూడటం చాలా రేర్! ఈ సినిమాకు సంబంధించి కొత్త విషయం ఏమైనా ఉందంటే అదే! అలవాటు లేని పాత్రే అయినా... నారా రోహిత్ బాగానే చేశాడు. అయితే... బాడీలో ఉండాల్సిన ఫెక్సిబిలిటీ ఏ మాత్రం లేదు! ఈ విషయంలో కాస్తంత జాగ్రత్త పడితే ఇంకాస్త బాగుండేది! హీరోయిన్ విశాఖా సింగ్ ది అంతగా ప్రాధాన్యం లేని పాత్ర. ఈ సినిమాలో నారా రోహిత్ తర్వాత అత్యధిక మార్కులు పొందేది రావు రమేశ్! డైలాగ్ మాడ్యులేషన్ లోనూ, యాక్టింగ్ లోనూ... రావు గోపాలరావు కొడుకునని సినిమా సినిమాకు రావు రమేశ్ నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. చాలా వరకూ సక్సెస్ అవుతున్నాడు. థియేటర్ ఓనర్ సిల్క్ గా పోసాని కృష్ణ మురళీ, హీరోయిన్ స్నేహితుడిగా సత్య వినోదాన్ని బాగానే పంచారు. ఇతర ప్రధాన పాత్రలను ఆహుతి ప్రసాద్, అజయ్, సుప్రీత్, గొల్లపూడి, ప్రవీణ్, తాళ్ళూరి రామేశ్వరి తదితరులు పోషించారు. సన్నీ ఎం.ఆర్. అందించిన సంగీతం, ఓం సినిమాటోగ్రఫీ సన్నివేశాలను ఎలివేట్ చేశాయి. 
ఈ 'రౌడీ ఫెలో'కు  కథ, మాటలు కూడా దర్శకుడు కృష్ణ చైతన్య అందించాడు. మాటలు ఫిలసాఫికల్ గా బాగున్నాయి. అయితే చాలా సందర్భాలలో సన్నివేశాన్ని ఇవి డామినేట్ చేశాయి. కథ బాగానే ఉన్నా..  దానిని తెర మీద ప్రెజెంట్ చేసే విషయంలో జాగ్రత్త తీసుకోక పోవడంతో సినిమా స్లోగా భారంగా నడుస్తున్నట్లనిపిస్తుంది... ఈ విషయంలో కేర్ తీసుకుని ఉంటే మంచి సినిమా అయిఉండేది. 
'ఈ రౌడీ... మరీ ఇంత స్లో ఫెలో ఏమిటీ' అని మూవీ చూశాక మీకు అనిపిస్తే... అది మీ తప్పుకాదు!

No comments:

Post a Comment